విఐపి హజ్‌ కోటాకు కేంద్రం త్వరలో స్వస్తి!

ముస్లిం యాత్రికులకు ఇచ్చే విఐపి హజ్‌ కోటాకు కేంద్ర ప్రభుత్వం త్వరలో స్వస్తి పలకనుంది. ఈ కోటాను నిలిపివేయాలని  నిర్ణయించినట్లు కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ తెలిపారు. దీని ముఖ్య ఉద్దేశం వీఐపీ సాంస్కృతిక ముగింపు పలకడమేనని ఆమె చెప్పారు. యుపిఎ హయాంలో ఏర్పాటైన ఈ విఐపి కోటా సంస్కృతికి ముగింపు పలకాలని ప్రధాని నరేంద్ర మోదీ  పదవీకాలం ప్రారంభంలోనే చెప్పారని  ఆమె గుర్తు చేశారు. త్వరలో నూతన సమగ్ర విధానాన్ని ప్రకటిస్తామని ఇరానీ వెల్లడించారు.

ఏడాది కొకసారి చేపట్టే హజ్‌ యాత్రలో భాగంగా ముస్లిములు సౌదీ అరేబియాలోని మక్కాకు వెళుతుంటారు. అత్యున్నత రాజ్యాంగ పదవులలో ఉన్న రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధాని, కేంద్ర మైనారిటీ వ్యవహారాల శాఖతో పాటు హజ్‌ కమిటీలు 500 మందిని ఈ కోటా కింద హజ్‌ యాత్రకు నామినేట్‌ చేయవచ్చు.

హజ్‌ కోటాలు రెండు నిష్పత్తులలో మైనారిటీ వ్యవహారాల శాఖ, హజ్‌ కమిటీలు ద్వారా వివిధ వాటాదారులకు పంపిణీ చేస్తారు. అయితే ఈ సీట్లలో 70 శాతం హెచ్‌సిఒఐకి రిజర్వ్‌ చేయబడినప్పటికీ.,30 శాతం ప్రైవేట్‌ వ్యక్తులకు కేటాయించారని సంబంధిత వర్గాలు తెలిపాయి.

హెచ్‌సిఒఐతో ఉన్న మొత్తం స్లాట్‌లలో 500 మందిని ప్రభుత్వ కోటా కింద ఎంపిక చేయగా, మిగిలినవి 2018-22 ముస్లిం జనాభా లెక్కల ఆధారంగా వివిధ రాష్ట్రాలకు పంపిణీ చేసినట్లు ఆ వర్గాలు తెలిపాయి. ఈ కోటాను తొలగించడంతో హజ్‌కమిటీ, ప్రైవేట్‌ సంస్థల ద్వారానే ముస్లిం యాత్రికులు హజ్‌ యాత్ర చేపట్టాల్సి వుంటుంది.