ఆస్ట్రేలియా హిందూ దేవాలయంలో ఖలీస్థాన్ శక్తుల అరాచకం

ఆస్ట్రేలియాలో ఖలీస్థానీ శక్తులు అరాచకానికి దిగాయి. భారత్‌పట్ల తమ విద్వేషాన్ని చాటుకున్నాయి. మెల్‌బోర్న్‌లోని ప్రఖ్యాత స్వామినారాయణ హిందూ దేవాలయంపై దాడికి దిగి, గోడలపై పరుషపదజాలపు రాతలు, ఇతరత్రా చర్యలతో మలినపర్చాయి. ఈ ఘటనను ది ఆస్ట్రేలియా టుడే పత్రిక  ఓ వార్తాకథనంలో తెలిపింది. మెల్‌బోర్న్ ఉత్తర శివార్లలోని మిల్ పార్క్ వద్ద నెలకొని ఉన్న ఈ దేవాలయం స్థానిక హిందువులకు ఆరాధ్య మందిరంగా ఉంది.

ఖలీస్థానీ మద్దతుదారులుగా అనుమానిస్తున్న దుండగులు ఈ మందిరం వద్ద ఇష్టారాజ్యానికి దిగారు. గోడలపై హిందూస్థాన్ ముర్దాబాద్ అని రాశారు. ఇక్కడ కొద్ది సేపు గుమికూడిన ఈ బృందం విద్వేష ప్రసంగాలకు కూడా పాల్పడింది. ఖలీస్థానీ నేత జర్నైల్ సింగ్ బింద్రన్‌వాలేను కొనియాడుతూ, భారతదేశాన్ని, హిందువులను దూషిస్తూ కవ్వింపు చర్యలకు దిగారు.

ఈ ఘటన పట్ల స్వామినారాయణ్ ఆలయ సంబంధిత బిఎపిఎస్ ట్రస్టు దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఈ విధమైన విధ్వంసకర, విద్వేష పూరిత చర్యలు గర్హనీయం అని తెలిపింది. జరిగిన ఘటన అనుచితం అని, తాము వెనువెంటనే శాంతి సామరస్యం కోసం ప్రార్థనలు నిర్వహిస్తామని, ఆ తరువాత సమగ్ర స్థాయిలో ప్రకటన వెలువరిస్తామని తెలిపారు.

జరిగిన ఘటన బాధాకరం అని నార్తర్న్ మెట్రోపాలిటన్ ప్రాంతపు లిబరల్ ఎంపి ఎవన్ ముల్హోలండ్ స్పందించారు. విక్టోరియాకు చెందిన శాంతికాముకులైన హిందూ సామాజిక వర్గం పట్ల ఇప్పటి ఈ పవిత్ర కాలంలో ఇటువంటి అవమానకర చర్య జరగడం దారుణం అని ఈ ఎంపి తమ ప్రకటన వెలువరించినట్లు ది ఆస్ట్రేలియా టుడే తెలిపింది.

 

కాగా, ఉద‌యాన్నే తాను ఆల‌యానికి వెళ్ల‌గా ఆల‌య గోడ‌ల‌పై ఖ‌లిస్తాన్ అనుకూల‌, భార‌త వ్య‌తిరేక నినాదాల‌తో పెయింటింగ్స్ క‌నిపించాయ‌ని ఓ స్ధానిక వ్య‌క్తి తెలిపారు. విద్రోహుల‌పై విక్టోరియా పోలీసులు క‌ఠిన చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని తాము డిమాండ్ చేస్తున్నామ‌ని స్ధానికులు పేర్కొన్నారు.

మెల్‌బోర్న్ హిందూ కమ్యూనిటీ ఈ సంఘటనపై స్థానిక పోలీసులకు, ఎంపీలకు ఫిర్యాదు చేసింది. సాంస్కృతిక శాఖ మంత్రి కూడా ఈ దేవాలయం ఉన్న ప్రాంతానికి చెందినవారే. గత ఏడాది నుంచి ఇటువంటి దుర్ఘటనలు జరుగుతున్నాయని స్థానికులు తెలిపారు. ఈ దేవాలయం గోడలపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా నినాదాలు రాశారని చెప్పారు. తాజా సంఘటనను కేరళ హిందూ సంఘం ఖండించింది.

ఆస్ట్రేలియాలోని విక్టోరియా స్టేట్ హిందూ కౌన్సిల్ అధ్యక్షుడు మకరంద్ భగవత్ మాట్లాడుతూ, ప్రార్థన స్థలాలు, దేవాలయాల పట్ల విద్వేషం, విధ్వంసాలు ఆమోదయోగ్యం కాదని, తాము తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. ఇటువంటి చర్యలు విక్టోరియాలోని జాతి, మత సహన చట్టానికి విరుద్ధమని తెలిపారు. ఈ దారుణానికి పాల్పడినవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని విక్టోరియా పోలీసులను, ప్రీమియర్ డాన్ ఆండ్రూస్‌ను కోరారు.

ఆల‌యంపై దాడిని విశ్వ‌హిందూ ప‌రిష‌త్ ఆస్ట్రేలియా శాఖ తీవ్రంగా ఖండించింది. ఇక గ‌త ఏడాది కెన‌డాలోనూ స్వామినారాయ‌ణ్ మందిర్‌పై ఖ‌లిస్తానీ మ‌ద్ద‌తుదారులు దాడులు చేప‌ట్టి మందిరంపై భార‌త్ వ్య‌తిరేక నినాదాల‌ను పెయింట్ చేయడం గమనార్హం.