సోషలిస్ట్ యోధుడు శ‌ర‌ద్ యాదవ్ కన్నుమూత

సోషలిస్ట్ యోధుడు, మాజీ కేంద్ర మంత్రి శ‌ర‌ద్ యాద‌వ్ (75) గురువారం రాత్రి క‌న్నుమూశారు. కొంత కాలంగా అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్న శ‌ర‌ద్ యాద‌వ్‌.. జ‌న‌తాద‌ళ్ యునైటెడ్ వ్య‌వ‌స్థాప‌క అధ్య‌క్షుడిగా ప‌ని చేశారు. ఏడు సార్లు లోక్‌స‌భ‌కు ఆయ‌న ప్రాతినిధ్యం వ‌హించారు. 2018లో లోక్‌తాంత్రిక్ జ‌న‌తాద‌ళ్ అనే పార్టీని స్థాపించారు. శరద్ యాదవ్ మరణించిన సంగతి ఆయన కూతురు సుభాషిణి ధ్రువీకరించారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. పప్పా నహీ రహే అని హిందీలో ట్వీట్ చేశారు.
 
అనారోగ్యంతో బాధ పడుతున్న శరద్ యాదవ్‌ను చికిత్స కోసం అపస్మారక స్థితిలో దవాఖానకు తీసుకొచ్చారని, తాము ఎంత ప్రయత్నించినా ప్రాణాలు కాపాడలేకపోయామని గురుగ్రామ్‌లోని ఫోర్టిస్‌ దవాఖాన ఓ ప్రకటనలో తెలిపింది. సోషలిస్టు దిగ్గజం జయప్రకాశ్‌ నారాయణ్‌కు అనుచరుడైన శరద్‌యాదవ్‌.. దేశ రాజకీయాల్లో తనదైన ముద్ర వేశారు.  దేశంలోని ప్ర‌ముఖ సోష‌లిస్టు నేత‌ల్లో శ‌ర‌ద్ యాద‌వ్ ఒక‌రు. బీహార్‌లో ఆర్జేడీ అధినేత లాలూ ప్ర‌సాద్ యాద‌వ్‌, బీహార్ సీఎం నితీశ్ కుమార్ త‌దిత‌రుల‌తో క‌లిసి ప‌ని చేసిన అనుభ‌వం ఉంది. 1989కి ముందు విశ్వ‌నాథ్ ప్ర‌తాప్ సింగ్ స్థాపించిన జ‌న‌తాద‌ళ్ పార్టీలో కీల‌కంగా వ్య‌వ‌హ‌రించారు.

ఏడుసార్లు లోక్‌సభ సభ్యుడిగా, మూడు సార్లు రాజ్యసభ సభ్యుడిగా సేవలందించారు. కేంద్ర మంత్రిగానూ పనిచేశారు. మధ్యప్రదేశ్‌లోని హోషంగాబాద్‌ జిల్లా బాబయి గ్రామంలో 1947 జూలై 1న శరద్‌యాదవ్‌ జన్మించారు. తండ్రి నందకిశోర్‌ యాదవ్‌. తల్లి సుమిత్రా యాదవ్‌. మధ్యప్రదేశ్‌లో జన్మించినా శరద్‌ యాదవ్‌ రాజకీయ జీవితం ప్రధానంగా బీహార్‌ కేంద్రంగానే సాగింది.

1974లో మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌ నుంచి తొలిసారి లోక్‌సభకు ఎన్నికయ్యారు. జేపీ ఎంపిక చేసిన తొలి అభ్యర్థి శరద్‌యాదవే కావడం విశేషం. అనంతరం 1977లో అదే స్థానం నుంచి మరోసారి ఎన్నికయ్యారు. 1979లో జనతాపార్టీ విడిపోయినప్పుడు ఆయన చరణ్‌సింగ్‌ పక్షాన చేరారు. 1981లో అమేథీలో రాజీవ్‌గాంధీపై పోటీచేసి ఓటమిపాలయ్యారు. 1984లో బదౌన్‌లో ఓటమిపాలయినా.. 1989లో అదే స్థానం నుంచి గెలుపొందారు. అనంతరం బీహార్‌లోని మాదేపురా నుంచి నాలుగుసార్లు లోక్‌సభకు ఎన్నికయ్యారు.

బీహార్ ముఖ్యమంత్రిగా లాలూ ప్ర‌సాద్ యాద‌వ్ ప‌శుగ్రాసం కుంభ‌కోణం కేసులో అరెస్ట్ కావ‌డం ఖాయం కావ‌డంతో పార్టీని చీల్చి రాష్ట్రీయ జ‌న‌తాద‌ళ్ పార్టీని స్థాపించారు. దీంతో జ‌న‌తాద‌ళ్ పార్టీ అధ్య‌క్షుడిగా శ‌ర‌ద్ యాద‌వ్ నియ‌మితుల‌య్యారు. త‌ర్వాత జ‌న‌తాద‌ళ్ యునైటెడ్ పార్టీని 2003లో స్థాపించి వ్య‌వ‌స్థాప‌క అధ్య‌క్షుడిగా వ్య‌వ‌హ‌రించారు.

లాలూ ప్ర‌సాద్ యాద‌వ్‌కు వ్య‌తిరేకంగా జార్జి ఫెర్నాండెజ్‌, నితీశ్ కుమార్ త‌దిత‌రుల‌తో క‌లిసి ప‌ని చేశారు. కేంద్రంలో 1999-2004 మ‌ధ్య అట‌ల్ బిహారీ వాజ్‌పేయి ప్రభుత్వంలో ప‌లు మంత్రి ప‌ద‌వుల్లో ప‌ని చేశారు. 2004 లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో ఓట‌మి పాలైన త‌ర్వాత నితీశ్ కుమార్ సాయంతో రాజ్య‌స‌భ‌కు ఎన్నిక‌య్యారు. తిరిగి 2009లో మ‌ధేపురా నుంచి లోక్‌స‌భ‌కు ఎన్నికైనా.. 2014 ఎన్నిక‌ల్లో జేడీయూ ఓట‌మి పాలైంది.

2015 అసెంబ్లీ ఎన్నిక‌ల త‌ర్వాత 2017లో నితీశ్ కుమార్ సార‌ధ్యంలోని జేడీయూ బీజేపీతో సంకీర్ణ ప్ర‌భుత్వం ఏర్పాటు చేసింది. అప్పుడు నితీశ్ కుమార్‌తో క‌లిసి ముందుకు సాగేందుకు శ‌ర‌ద్ యాద‌వ్ నిరాక‌రించారు. దీంతో 2018లో సొంతంగా లోక్‌తాంత్రిక్ జ‌న‌తాద‌ళ్ (ఎల్జేడీ) ఏర్పాటు చేశారు.  జ‌న‌తా ప‌రివార్‌ను క‌లిపేందుకు చేసిన ప్ర‌య‌త్నాలు ఫ‌లించ‌క‌పోవ‌డంతో గ‌త మార్చిలో ఆర్జేడీలో లోక్ తాంత్రిక్ జ‌న‌తాద‌ళ్ పార్టీని విలీనం చేశారు. మూడున్న‌ర ద‌శాబ్దాల త‌ర్వాత తిరిగి లాలూతో జ‌త క‌ట్టారు.