ప్రపంచానికి నూతన ఎజెండా ప్రతిపాదించిన మోదీ

ప్రపంచాన్ని తిరిగి శక్తిమంతం చేసేందుకు స్పందించు, గుర్తించు, గౌరవించు, సంస్కరించు ఆధారంగా నూతన గ్లోబల్ ఎజెండాను ప్రధాని నరేంద్ర మోదీ ప్రతిపాదించారు. గ్లోబల్ సౌత్‌కు ఉండే ముఖ్యమైన అవసరాల పట్ల సమ్మిళిత, సమతుల్యతతో కూడిన అంతర్జాతీయ ఎజెండాను రూపొందించడం ద్వారా స్పందించాలని ఆయన పిలుపిచ్చారు.

గ్లోబల్ సౌత్ నేతల వర్చువల్ సదస్సులో గురువారం ఆయన మాట్లాడుతూ అభివృద్ధి పథం నుంచి పక్కకు తప్పుకోకుండా ఉండటం కోసం, అసమానతలను తొలగించడం కోసం అంతర్జాతీయ రాజకీయ, ఆర్థిక పరిపాలనను పునర్నిర్మించడానికి అభివృద్ధి చెందుతున్న దేశాలు చేతులు కలపాలని కోరారు

జీ20 ప్రెసిడెన్సీ మన దేశానికి వచ్చిన తర్వాత, మన ప్రభుత్వం ‘ది వాయిస్ ఆఫ్ గ్లోబల్ సౌత్ సమ్మిట్’ అనే నూతన కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈ సదస్సులో బంగ్లాదేశ్, కాంబోడియా, గుయానా, మొజాంబిక్, మంగోలియా, పపువా న్యూ గినియా, సెనెగల్, థాయ్‌లాండ్, ఉజ్బెకిస్థాన్, వియత్నాం దేశాల నేతలు పాల్గొన్నారు.

జీ20 ప్రెసిడెన్సీ సమయంలో తాను గ్లోబల్ సౌత్‌కు ప్రతినిధిగా వ్యవహరిస్తానని భారత దేశం పేర్కొంది. సదస్సును ఉద్దేశించి మోదీ వర్చువల్ విధానంలో మాట్లాడుతూ వాతావరణ మార్పులు, ఉక్రెయిన్ యుద్ధం వంటి సవాళ్ళను ప్రపంచం ఎదుర్కొంటోందని, వీటిలో అత్యధిక సవాళ్ళు గ్లోబల్ సౌత్ దేశాలు సృష్టించినవి కాదని చెప్పారు. మరోవైపు ఇటువంటి సమస్యలకు పరిష్కారాల అన్వేషణ నుంచి అభివృద్ధి చెందుతున్న దేశాలను మినహాయించారని పేర్కొన్నారు

ఉమ్మడిగా ఉన్నప్పటికీ, ప్రత్యేక బాధ్యతలు అన్ని రకాల ప్రపంచ సవాళ్ళకు వర్తిస్తాయని గుర్తించాలని చెప్పారు. అన్ని దేశాల సార్వభౌమాధికారాన్ని, శాసన నియమాలను గౌరవించాలని, విభేదాలు, వివాదాలను శాంతియుతంగా పరిష్కరించుకోవాలని తెలిపారు. ఐక్య రాజ్య సమితితో సహా అంతర్జాతీయ వ్యవస్థలను ప్రస్తుత కాలానికి అనుగుణంగా ఉండేవిధంగా సంస్కరించాలని తెలిపారు.

నేడు ప్రపంచం ఎదుర్కొంటున్న సవాళ్ళలో అత్యధిక సవాళ్లు గ్లోబల్ సౌత్ సృష్టించినవి కాదని స్పష్టం చేశారు. అయితే వీటి ప్రభావం మనపై ఎక్కువగా ఉంటోందని తెలిపారు. కరోనా మహమ్మారి చూపిన ప్రభావాన్ని మనం గమనించామని గుర్తు చేశారు. వాతావరణ మార్పులు, ఉగ్రవాదంలో కూడా ఈ ప్రభావం కనిపిస్తోందని పేర్కొన్నారు. ఉక్రెయిన్ యుద్ధం కూడా మనపై ప్రభావం చూపుతోందని తెలిపారు. ఈ సమస్యలకు పరిష్కారాలను కనుగొనడంలో మన పాత్ర కానీ, మన గళం కానీ కనిపించడం లేదని చెప్పారు.

భారత దేశం మాత్రం అభివృద్ధి చెందుతున్న దేశాల ప్రాధాన్యతలు, సవాళ్ళను ఎలుగెత్తి చాటడానికి కృషి చేస్తోందని ప్రధాని చెప్పారు. జీ20 ప్రెసిడెన్సీని భారత దేశం ఈ ఏడాది ప్రారంభించిందని, గ్లోబల్ సౌత్ గళాన్ని బిగ్గరగా వినిపించడం భారత్ లక్ష్యమని, ఇది సహజమేనని తెలిపారు. భారత్ జీ20 ప్రెసిడెన్సీ కోసం ‘ఒక భూమి, ఒకే కుటుంబం, ఒకే భవిష్యత్తు’ అనే ఇతివృత్తాన్ని ఎంచుకున్నామని తెలిపారు.

కష్టకాలంతో కూడిన మరో సంవత్సరపు పేజీని తిప్పిన తర్వాత ప్రపంచం సంక్షోభ స్థితిలో ఉందని ప్రధాని తెలిపారు. గత ఏడాది యుద్ధం, ఘర్షణలు, ఉగ్రవాదం, భౌగోళిక-రాజకీయ ఉద్రిక్తతలు, ఆహారం, ఎరువులు, ఇంధనాల ధరల పెరుగుదల వేధించాయని పేర్కొన్నారు. వీటితోపాటు వాతావరణ మార్పుల వల్ల ప్రకృతి వైపరీత్యాలు, కోవిడ్ మహమ్మారి వల్ల ఆర్థిక పతనం కూడా వేధించాయని చెప్పారు.

మానవాళిలో నాలుగింట మూడొంతుల మంది గ్లోబల్ సౌత్ దేశాల్లో ఉంటున్నారని, ఈ దేశాలకు కూడా సమాన గళం ఉండాలని ప్రధాని స్పష్టం చేశారు. భవిష్యత్తులో విస్తృత అవకాశాలు ఈ దేశాలకు ఉంటాయని చెప్పారు. ఎనిమిది దశాబ్దాలనాటి గ్లోబల్ గవర్నెన్స్ మోడల్ నెమ్మదిగా మారుతోందని, ఆధునిక విధానాన్ని రూపొందించేందుకు మనం కృషి చేయాలని మోదీ పిలుపునిచ్చారు.

కరోనా మహమ్మారి సమయంలో భారత దేశం సుమారు 100 దేశాలకు మందులు, వ్యాక్సిన్లను సరఫరా చేసిందని గుర్తు చేశారు. ఉమ్మడి భవిష్యత్తును నిర్ణయించుకోవడంలో అభివృద్ధి చెందుతున్న దేశాలకు అత్యధిక పాత్ర ఉండాలని భారత దేశం ఎల్లప్పుడూ గట్టిగా చెప్తుందని భరోసా ఇచ్చారు. సవాళ్ళు ఎదురవుతున్నప్పటికీ, మన సమయం ఆసన్నమవుతోందనే ఆశాభావం తనకు ఉందని చెప్పారు.

మన సమాజాలు, ఆర్థిక వ్యవస్థలను మార్చగలిగే తేలికైన, సుస్థిరమైన పరిష్కారాలను గుర్తించవలసిన సమయం ఇదేనని చెప్పారు. ఇటువంటి వైఖరితో మనం మన సంక్లిష్ట సవాళ్ళను అధిగమించవచ్చునని తెలిపారు. పేదరికం, సార్వజనీన ఆరోగ్య సంరక్షణ, మానవ సామర్థ్యాల నిర్మాణం వంటి సవాళ్ళను మనం అధిగమించవచ్చునన్నారు.

గత శతాబ్దంలో మనమంతా విదేశీ పాలనకు వ్యతిరేకంగా ఒకరికొకరం మద్దతు ఇచ్చుకున్నామని గుర్తు చేశారు. నూతన ప్రపంచాన్ని సృష్టించడం కోసం ఈ శతాబ్దంలో కూడా మనం మళ్ళీ ఆ పని చేయగలమన్నారు. భారత దేశానికి వచ్చేసరికి, మీ గళమే భారత దేశ గళమని, మీ ప్రాధాన్యతలే భారత దేశ ప్రాధాన్యతలని చెప్పారు.