పార్లమెంట్‌ పనుల్లో సుప్రీంకోర్టు జోక్యంపై ఉప రాష్ట్రపతి అసంతృప్తి

పార్లమెంట్‌ పనుల్లో సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవడంపై ఉప రాష్ట్రపతి జగదీప్‌ ధన్‌ఖర్‌ అసంతృప్తి వ్యక్తం చేశారు. పార్లమెంట్‌ చేసే చట్టాలపై సుప్రీంకోర్టు ముద్ర వేస్తేనే చట్టంగా తయారవుతుందా? అని ప్రశ్నించారు. ఇలాంటప్పుడు పార్లమెంట్‌ చట్టాలు చేయడం ఎందుకని అడిగారు.
 
బుధవారం జైపూర్‌లో రెండు రోజులపాటు జరిగే 83 వ అసెంబ్లీ స్పీకర్ల జాతీయ సదస్సు ప్రారంభ సమావేశంలో మాట్లాడుతూ ‘పార్లమెంట్ చట్టాలు చేస్తుంది. వాటిని సుప్రీంకోర్టు రద్దు చేస్తుంది. పార్లమెంట్ చేసిన చట్టం కోర్టు ఆమోదం పొందినప్పుడే చట్టం అవుతుందా?” అని ప్రశ్నించారు. 1973 లో ఈ తప్పుడు సంప్రదాయం మొదలైందని ఆయన పేర్కొన్నారు.
 
భారత రాజ్యాంగ మౌలిక నిర్మాణాన్ని పార్లమెంటు మార్చజాలదని, ఈ విషయంలో సుప్రీంకోర్టుకు మాత్రమే అంతిమ అధికారం ఉందని చెప్పడాన్ని తాను వ్యతిరేకిస్తున్నట్లు స్పష్టం చేశారు.  1973లో సుప్రీంకోర్టు కేశవానంద భారతి కేసులో ఇచ్చిన తీర్పులో దీనిని చెప్పిందని, దీనిని తాను పూర్తిగా వ్యతిరేకిస్తున్నానని చెప్పారు.
 
‘‘మౌలిక నిర్మాణం’’ లేదా ‘‘రాజ్యాంగ ప్రాథమిక శిల్పం’’ అని చెప్తున్న దానికి రాజ్యాంగ సవరణలు ఉల్లంఘించినట్లు ప్రకటిస్తూ, ఆ రాజ్యాంగ సవరణలను రద్దు చేసే అధికారాన్ని మొట్టమొదటిసారి కేశవానంద భారతి తీర్పులోనే సుప్రీంకోర్టు సృష్టించిందని ఆయన గుర్తు చేశారు. ఆ తర్వాతి కాలంలో ఈ మౌలిక నిర్మాణానికి చాలా ముఖ్యమైనవిగా చెప్తూ అనేక ముఖ్యమైన రూలింగ్స్‌ను సుప్రీంకోర్టు ఇచ్చిందని తెలిపారు. ఈ ప్రక్రియలో పార్లమెంటరీ సార్వభౌమాధికారానికి హాని జరిగిందని విచారం వ్యక్తం చేశారు.
 
 రాజ్యాంగంలో మార్పులు చేసే అధికారం పార్లమెంట్‌కు ఉన్నదని పేర్కొంటూ  పార్లమెంట్ తన నిర్ణయాన్ని ఇతర సంస్థల ద్వారా సమీక్షించేందుకు అనుమతించవచ్చా? అని ప్రశ్నించారు. పార్లమెంట్‌ చేసిన ఏ చట్టాన్నయినా ఏ సంస్థ అయినా ఏ కారణంతో చెల్లుబాటయ్యేలా చేస్తే అది ప్రజాస్వామ్యానికి మంచిది కాదని హెచ్చరించారు. అలాంటి సందర్భాల్లో మనది ప్రజాస్వామ్య దేశం అని చెప్పడం కష్టంగా ఉంటుదని ధన్‌ఖర్‌ తెలిపారు.
 
ఉప రాష్ట్రపతి ధన్‌కర్ గతంలో నేషనల్ జ్యుడిషియల్ అపాయింట్‌మెంట్స్ కమిషన్ చట్టాన్ని సుప్రీంకోర్టు రద్దు చేసినపుడు కూడా తీవ్రంగా మండిపడ్డారు. ప్రజా తీర్పుదే పైచేయి అనేది ప్రజాస్వామిక సమాజంలో ఏ మౌలిక నిర్మాణానికైనా మూలమని ఆయన స్పష్టం చేశారు. పార్లమెంటు, చట్టసభల ఆధిక్యత, సార్వభౌమాధికారం అనుల్లంఘనీయమైనవని పేర్కొన్నారు
 
అన్ని రాజ్యాంగ వ్యవస్థలు – న్యాయ వ్యవస్థ, కార్యనిర్వాహక శాఖ, చట్టసభలు – తమ తమ పరిధులకు లోబడి పని చేయాలని, అత్యున్నత స్థాయి ప్రమాణాలతోకూడిన ఔన్నత్యం, గౌరవ, మర్యాదలకు అనుగుణంగా వ్యవహరించాలని ఆయన సూచించారు. ఈ అంశంలో ప్రస్తుత పరిస్థితులు సంబంధితులందరూ తీక్షణంగా దృష్టి సారించవలసిన అవసరాన్ని కల్పిస్తున్నాయని చెప్పారు. మరీ ముఖ్యంగా ఈ వ్యవస్థలను నడిపేవారు తీక్షణంగా దృష్టి సారించాలని హితవు చెప్పారు. రాజ్యాంగాన్ని సవరించేందుకు, శాసనం పట్ల వ్యవహరించేందుకు పార్లమెంటుకుగల అధికారం ఏ ఇతర వ్యవస్థకు లోబడినది కాదని ఉపరాష్ట్రపతి స్పష్టం చేశారు. ఇది ప్రజాస్వామ్యానికి జీవన రేఖ అని చెప్పారు. దీనిపై అందరూ ఆలోచనాత్మకంగా పరిశీలిస్తారని ఆశిస్తున్నానని తెలిపారు. రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా చట్ట సభలు, న్యాయ వ్యవస్థ మధ్య సామరస్యపూర్వక సంబంధాలను నెరపవలసిన అవసరం ఉందని పేర్కొంటూ దీనిపై ప్రిసైడింగ్ ఆఫీసర్లు చర్చించాలని కోరారు.

న్యాయవ్యవస్థ కూడా డెకోరమ్‌ను పాటించాలని లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా సూచించారు. తమకు ఇచ్చిన రాజ్యాంగ అధికారాన్ని ఉపయోగించుకోవాలని న్యాయవ్యవస్థ భావిస్తున్నాదని, అదే సమయంలో మీ అధికారాలను సమతులం చేసుకోండని తెలిపారు. ఇదే మన చట్టసభల స్పీకర్లకు కావాల్సిందని చెప్పారు.

కొన్నిసార్లు న్యాయవ్యవస్థతో విబేధాలు వస్తున్నాయని రాజస్థాన్‌ ముఖ్యమంత్రి అశోక్‌ గెహ్లాట్‌ తెలిపారు. న్యాయవ్యవస్థ మా పనిలో జోక్యం చేసుకుంటున్నదని విచారం వ్యక్తం చేసిన ఆయన.. ఇందిరాగాంధీ రద్దు చేసిన ప్రైవీ పర్సులను తర్వాత న్యాయవ్యవస్థ కూడా రద్దు చేసిన విషయం గుర్తు చేశారు. ఆ తర్వాత కాలంలో జాతీయీకరణ నుంచి అన్ని నిర్ణయాలకు అనుకూలంగా తీర్పులు వచ్చాయని పేర్కొన్నారు.