ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు కీలక నేత హిడ్మా మృతి

తెలంగాణ గ్రేహౌండ్స్, సీఆర్పీఎఫ్ కోబ్రా ఆధ్వర్యంలో ఆపరేషన్ నిర్వహించిన  ఆపరేషన్‌లో మావోయిస్టు నేత హిడ్మా మృతి చెందారు. హిడ్మా లక్ష్యంగా ప్రత్యేక హెలికాప్టర్‌లో సర్జికల్ స్ట్రెక్ చేశారు. బీజాపూర్-తెలంగాణ సరిహద్దుల్లో ఎన్‌కౌంటర్ జరిగినట్లు చెబుతున్నారు. ప్రస్తుతం ఆయన మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడిగా ఉన్నారు. బీజాపూర్, తెలంగాణ సరిహద్దుల్లో ఈ భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. కూంబింగ్ స‌మ‌యంలో పోలీసులు, మావోయిస్టుల‌కు మ‌ధ్య ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి.
 
అయితే హిడ్మా ఎన్‌కౌంటర్‌ను మావోయిస్టు కేంద్ర కమిటీ ధ్రువీకరించలేదు. కేంద్ర కమిటీ సభ్యుడిగా కూడా ఉన్న హిడ్మాకు నాలుగంచెల భద్రత ఉంటుంది. ఈ భద్రతను చేధించుకుని పోలీసులు హిడ్మా ఆపరేషన్‌ను సక్సెస్ చేసినట్లు తెలుస్తోంది. హిడ్మా భద్రత దళాలకు మోస్ట్‌ వాంటెడ్‌. దండకారణ్యంలో జరిగే ప్రతి దాడి వెనుకా ఆయన హస్తం ఉంటుందని నిఘా వర్గాలు చెబుతున్నాయి. 40 ఏళ్ల లోపు వయసున్న హిడ్మాకు మావోయిస్టుల్లో మాస్టర్ మైండ్‌గా గుర్తింపు ఉంది. 15 ఏళ్లకే మావోయిస్టుల్లో చేరిన హిడ్మా  కొద్దికాలానికే కేంద్ర కమిటీ స్థాయికి చేరుకున్నట్టు చెబుతారు. ఛత్తీస్‌గఢ్‌ రాష్రంలోని బస్తర్‌ జిల్లా పూవర్తిలోని ఆదివాసీ కుటుంబంలో జన్మించిన హిడ్మాకు బస్తర్‌, సుక్మా, దంతేవాడ, బీజాపూర్‌ ప్రాంతాల్లో గట్టి పట్టుంది.

దండకారణ్యంలోని ఆదివాసీలతో సత్సంబంధాలు ఉన్నాయి. 15ఏళ్ల వయస్సులోనే 1990లో అప్పటి పీపుల్స్‌వార్‌లో చేరారు. మిలిటెంట్‌గా పని చేస్తూ బస్తర్‌ కమాండర్‌గా ఎదిగారు. పీపుల్స్‌ లిబరేషన్‌ గెరిల్లా ఆర్మీ (పీఎల్‌జీఏ)లో కీలక నేతగా మారాడు. మావోయిస్టు పార్టీ ఛత్తీస్‌గఢ్‌ సౌత్‌ సబ్‌ జోనల్‌ కమాండర్‌గానూ బాధ్యతలు నిర్వర్తించాడు. ప్రస్తుతం దండకారణ్యం స్పెషల్‌ జోన్‌ కమిటీ సభ్యుడిగా, మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడిగా హిడ్మా పని చేశారు.

హిద్మా బృందాలు చేసిన అనేక ప్రాణాంతక దాడులలో మే 2013లో కాంగ్రెస్   కాన్వాయ్‌పై జీరామ్ వ్యాలీ ఆకస్మిక దాడి కూడా ఉంది. ఇందులో చాలా మంది రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు, వీసీ శుక్లా వంటి నాయకులు సహా దాదాపు 32 మంది మరణించారు. 2010లో తడ్‌ మెట్ల మెరుపు దాడిలో 24 మంది జవాన్లు మృతికి ఆయన సూత్రధారి అని తెలుస్తోంది. 2017 ఏప్రిల్‌లో సుక్మా జిల్లాలో 27 మంది సీఆర్‌పీఎఫ్‌ జవా న్లపై దాడి హతమార్చిన ఘటన భద్రత దళాలకు భారీ ఎదురుదెబ్బగా మిగిలిపోయింది.

2021 ఏప్రిల్‌ 4న బీజాపూర్‌ జిల్లా తరెంలో హిడ్మా వ్యూహంలో చిక్కు కుని 22 మంది బీఎస్‌ఎఫ్‌, సీఆర్‌పీఎఫ్‌ సిబ్బంది మృతి చెందారు. ఇలాంటి కనీసం 26 దాడుల్లో హిడ్మా కీలకంగా ఉన్నారు. అతడు ఫిలిప్పీన్స్‌లో గెరిల్లా వార్‌ఫేర్‌లో శిక్షణ పొందినట్లు సమాచారం. హిడ్మాను ఇంగ్లీష్‌తో పాటు గిరిజన మాండలికాలు, దేశంలోని అనేక ప్రాంతీయ భాషలలో నిష్ణాతుడని చెబుతారు. అతడిని హిడ్మాలు, సంతోష్ అని కూడా పిలుస్తారు.

హిడ్మా పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా బెటాలియన్ నంబర్ వన్‌కు నాయకత్వం వహిస్తున్నాడు. ఇందులో 180-250 మంది మావోయిస్టు ఫైటర్స్ ఉంటారు. 21 మంది సభ్యులున్న మావోయిస్టు కేంద్ర కమిటీలో అతి పిన్న వయస్కుడు కూడా హిడ్మానే. హిడ్మా తలపై రూ.40 లక్షల రివార్డు కూడా ఉంది. గతంలో ఒకసారి హిడ్మా పోలీసులకు లొంగిపోయినట్టు వార్తలు కూడా వచ్చాయి. అయితే మావోయిస్టులు అప్పట్లో దీన్ని ఖండించారు. తాజాగా హిడ్మా ఎన్‌కౌంటర్‌లో చనిపోయినట్లు వార్తలు వస్తున్నా.. మావోయిస్టులు ఇంకా దీన్ని ధృవీకరించాల్సి ఉంది.

జార్ఖండ్‌లో ఐదుగురు సీఆర్‌పీఎఫ్‌ జవాన్‌లకు గాయాలు
 
ఇలా ఉండగా, జార్ఖండ్‌ రాష్ట్రంలోని చైబాస జిల్లాలో మావోయిస్టులు, భద్రతా బలగాలకు మధ్య భారీ ఎన్‌కౌంటర్ చోటుచేసుకుంది. ఎదురు కాల్పులు కొనసాగుతుండగానే నక్సల్స్‌ ముందే పాతిపెట్టిన మందుపాతరను పేల్చేశారు. ఈ ఘటనలో ఐదుగురు సీఆర్‌పీఎఫ్‌ జవాన్‌లు తీవ్రంగా గాయపడ్డారు. ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
 
బుధవారం మధ్యాహ్నం సీఆర్‌పీఎఫ్‌ జవాన్‌లు, స్థానిక పోలీసులు సంయుక్తంగా నక్సలైట్‌ల కోసం కూంబింగ్‌ ఆపరేషన్‌ చేపట్టారు. ఈ సందర్భంగా నక్సల్స్‌ తారసపడటంతో రెండు వర్గాల మధ్య ఎదురుకాల్పులు మొదలయ్యాయి. అదే సమయంలో నక్సల్స్‌ మందుపాతర పేల్చడంతో ఐదుగురు సీఆర్‌పీఎఫ్‌ జవాన్‌లు తీవ్రంగా గాయపడ్డారు.