మంగళవారం మధ్యాహ్నం తీర్పు కాపీ వెబ్‌సైట్‌లో వెలుగుచూసింది. వెనువెంటనే డి.ఓ.పి.టి.అధికారులు హైకోర్టు తీర్పును అమలు చేస్తూ మంగళవారం సాయంత్రం 3.30 గంటలకల్లా ఆయన రిలీవ్ చేయడమే కాకుండా ఈనెల 12వ తేదీలోగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో రిపోర్టు చేయాలని కూడా ఆదేశించింది.
ఈ మొత్తం వ్యవహారమంతా కొద్ది గంటల వ్యవధిలోనే జరిగిపోవడంతో హైకోర్టు తీర్పుపై మాజీ సి.ఎస్. సోమేశ్‌కుమార్ సుప్రీంకోర్టుకు వెళ్ళి స్టే తెచ్చుకునే అవకాశాలు కూడా లేకుండా పోయిందని కొందరు సీనియర్ అధికారులు వివరించారు. డి.ఓ.పి.టి.వెంటనే స్పందించి ఆయనను తెలంగాణ కేడర్ నుంచి రిలీవ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేయడం, ఆ ఉత్తర్వులను ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలకు పంపించడంతో సోమేశ్‌కుమార్‌కు వేరే మార్గం లేకుండా పోయింది.
ఇలా ఉండగా, రెండు తెలుగు రాష్ట్రాల్లోని ఐ.ఎ.ఎస్, ఐ.పి.ఎస్.తదితర ఆలిండియా సర్వీస్ (ఎ.ఐ.ఎస్) అధికారుల్లో కొత్త టెన్షన్ మొదలయ్యింది. తెలంగాణ రాష్ట్ర హైకోర్టు మంగళవారం చీఫ సెక్రటరీ సోమేశ్‌కుమార్‌కు వ్యతిరేకంగా ఇచ్చిన తీర్పు బ్యూరోక్రాట్లలో హాట్ టాపిక్‌గా మారింది. ఈ తీర్పుతో ఒక రాష్ట్ర కేడర్‌కు చెందిన ఆలిండియా సర్వీస్ అధికారులు ఎవ్వరైనా సరే తప్పనిసరిగా వారివారి సొంత రాష్ట్ర కేడర్‌లకు వెళ్ళిపోవాల్సిందేనని బ్యూరోక్రాట్లలో వాడీవేడీ చర్చ జరుగుతోంది.
ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ కేడర్‌కు చెందిన కొందరు ఐ.ఎ.ఎస్., ఐ.పి.ఎస్.అధికారులు తప్పనిసరిగా ఈ తీర్పు పరిధిలోకి వస్తారని, వారంతా తిరిగి ఏపీ కేడర్‌కు వెళ్ళిపోవాల్సిందేనని అంటున్నారు. అందుచేతనే సి.ఎస్. సోమేశ్‌కుమార్‌తో పాటుగా తెలంగాణ రాష్ట్ర డి.జి.పి.గా ఇటీవలనే నియమితులైన అంజనీకుమార్ కూడా ఏపీ రాష్ట్రానికి వెళ్ళిపోవాల్సిందేనని భావిస్తున్నారు.
అయితే, కొద్దిరోజులు సమయం పడుతుండవచ్చునేమోగానీ క్యాట్ ఉత్తర్వులను అడ్డంపెట్టుకొని కేడర్‌ను మార్చుకొని తెలంగాణలో కొనసాగుతున్న అధికారులందరూ వారివారి సొంత రాష్ట్రాలకు (కేడర్) వెళ్ళిపోవాల్సిందేనని అంటున్నారు. అంతేగాక తెలంగాణ కేడర్‌కు చెందిన అధికారులు కూడా ఏపీలో కొందరు కొనసాగుతున్నారని, వారు కూడా తప్పనిసరిగా వెనక్కు (తెలంగాణకు) రావాల్సిందేనని కూడా ఆ అధికారులు వివరించారు.
రాష్ట్ర విభజన సమయంలో ఏపీకి కేటాయించిబడి ఇప్పటి వరకూ తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతున్న ఐ.ఎ.ఎస్. అధికారుల్లో చీఫ్ సెక్రటరీ సోమేశ్‌కుమార్‌తో పాటుగా ఎ.వాణీ ప్రసాద్, వాకాటి కరుణ, డి.రొనాల్డ్ రాస్, ఎం.ప్రశాంతి, అమ్రాపాలి ఉన్నారు. అదే విధంగా ఐ.పి.ఎస్.అధికారుల్లో రాష్ట్ర డి.జి.పి.అంజనీ కుమార్‌తో పాటుగా అభిలాష బిస్త్, సంతోష్ మెహ్రా కూడా ఏపి కేడర్‌కు చెందిన వారే.
దీంతోపాటుగా తెలంగాణ రాష్ట్ర కేడర్ ఐ.ఎ.ఎస్.అధికారి అయిన వై.శ్రీలక్ష్మీ కూడా ఎపిలో పనిచేస్తున్నారని, ఆమెను కూడా వెనక్కు రప్పించేందుకు కూడా అవకాశాలున్నాయని అంటున్నారు. ఐ.ఎ.ఎస్, ఐ.పి.ఎస్.అధికారులను వారివారి సొంత కేడర్ స్టేట్‌లకు వెళ్ళేటట్లుగా చేయాలని డి.ఓ. పి.టి సీరియస్‌గా తీసుకొందని సోమేశ్ కుమార్ వ్యవహారం వెల్లడి చేస్తుంది.
More Stories
దావోస్ నుండి వట్టిచేతులతో తిరిగి వచ్చిన చంద్రబాబు
ఇన్‌కాయిస్‌కు సుభాష్ చంద్ర బోస్ పురస్కారం
20 మున్సిపాలిటీలు గ్రేటర్ హైదరాబాద్ లో విలీనం?