పీవీ చలపతిరావు 60 ఏళ్ళు రాజకీయాలలో ఉండి ఏమి సాధించారు?

డా. వడ్డీ విజయ సారధి
 
ఈ ప్రశ్నకు జవాబుగా చెప్పబడే అంశాలను కొంచెం ఓపికగా అర్ధం చేసుకోవాలి.
 
1967 ఎన్నికల సందర్భంగా పోకల వెంకట చలపతిరావు గారు తాను చేస్తున్న ప్రభుత్వ ఉద్యోగాన్ని వదిలిపెట్టి భారతీయ జనసంఘ్ పూర్తిసమయ కార్యకర్తగా వచ్చారు. 1971లో సంస్థా కాంగ్రెస్, స్వతంత్ర పార్టీ, భారతీయ జనసంఘ్, సంయుక్త సోషలిస్టు పార్టీలు కలిసి `బృహత్తర కూటమి’ (గ్రాండ్ అలయన్స్) పేరున పోటీ చేశాయి.
 
భారతీయ జనసంఘ్ కు ఉమ్మడి ఏపీలో ఐదు చోట్ల అభ్యర్థులను నిలిపే అవకాశం వచ్చింది. అందులో చలపతిరావు కార్యక్షేత్రంగా ఉన్న కాకినాడ ఒకటి. వైద్యునిగా, శస్త్రచికిత్సా నిపునిడిగా పేరొందిన డా. పీవీఎన్ రాజు జనసంఘ్ అభ్యర్థి. ఆ ఎన్నికలలో బృహత్తర కూటమి అభ్యర్థులు ఎవ్వరు గెలవలేదు. పైగా, కాకినాడలో గెలుపొందిన కాంగ్రెస్ అభ్యర్ధికి దేశం మొత్తం మీద అత్యధిక మెజారిటీ వచ్చింది.
 
డా. పీవీఎన్ రాజుకు 10 శాతం ఓట్లు రాగా, కాంగ్రెస్ అభ్యర్థికి 80 శాతం ఓట్లు వచ్చాయి. నిజంగా ఇంతటి అవమానకరమైన ఓటమికి మొదటిసారిగా ఎన్నికలబరిలోకి దిగిన వారెవరైనా ఇక రాజకీయాలు వద్దని వెనుకకు తిరిగి వెళ్ళవలసిందే. కానీ డా. రాజు తన ఓటమిని చూడలేదు. తన కోసం అహర్నిశలు కష్టపడిన కార్యకర్తలను చూశారు. వారి నిజాయతీని చూశారు.
 
ఎప్పటికైనా ఇటువంటి నిజాయితీ గల పార్టీ అధికారంలోకి రావాలని, దానికి తాను ఓ కార్యకర్తను కావాలని నిర్ణయించుకున్నారు. పార్టీకి జిల్లా అధ్యక్షునిగా, రాష్ట్ర అధ్యక్షునిగా పనిచేశారు. 1998లో బిజెపి ఒంటరిగా పోటీచేసి ఏపీలో గెలుపొందిన నాలుగు స్థానాలలో కాకినాడ ఒకటి.
 
డా. రాజు గారిని ఆ విధంగా నిలబెట్టడానికి ముఖ్యమైన ఇద్దరు, ముగ్గురు వ్యక్తులలో పివి చలపతిరావు గారు ఒకరు. మరొకరు గోపాలరావు ఠాకూర్. అలా రాజకీయాలలో కొనసాగిన డా. రాజు 1998లో అటల్ బిహారి వాజపేయిని ప్రధానిగా చేయడంలో కృతకృత్యులయ్యారు.
 
అత్యవసర పరిస్థితి సమయంలో
 
1975లో అత్యవసర పరిస్థితి విధించబడింది. పట్టపగలే దట్టమైన చీకటి ఆవరించింది. ప్రజాస్వామ్యం హత్య చేయబడింది. పెద్ద సంఖ్యలో ప్రతిపక్షాల నాయకులు అందరూ జైళ్లలో పెట్టబడగా, ఆంధ్ర ప్రదేశ్ లో పోలీసులకు పట్టుబడకుండా తప్పించుకొని తిరిగిన ఒకే ఒక రాజకీయ నాయకుడు పివి చలపతిరావు.
 
అంతర్జాతీయంగా తనపై ఒత్తిడులు రాగలవని గ్రహించిన శ్రీమతి ఇందిరాగాంధీ 1977 జనవరిలో ఎన్నికలను ప్రకటించగా, మార్చిలో ఎన్నికలు జరిగాయి. ఆంధ్ర ప్రదేశ్ నుండి జనతా పార్టీ అభ్యర్థిగా నీలం సంజీవరెడ్డి ఒక్కరే గెలిచారు. మిగిలిన 41 స్థానాలలో కాంగ్రెస్ అభ్యర్థులే గెలిచారు.
 
మరి పివి చలపతిరావు వంటి వారు అత్యవసర పరిస్థితి కాలంలో అజ్ఞాతవాసంలో ఉంది ఏమి సాధించారు? అనే ప్రశ్న తలెత్తుతుంది.
 
1977 ఎన్నికలు జరిగిన కొన్ని నెలల తర్వాత దేశవ్యాప్తంగా కాంగ్రెస్ వ్యతిరేక ప్రభఞ్జనం ఏయే రాష్ట్రాలలో ఏ విధంగా జరిగిందో వివరిస్తూ ప్రణయ్ రాయ్ ఒక విశ్లేషణను ఇండియా టుడే పత్రికలో రాసారు. దానికి సంబంధించిన ఒక చిత్రపటాన్ని కూడా ప్రచురించారు. సెఫాలోజిస్ట్ గా ఆయనకు ఇచ్చింది ఆ ఎన్నికల్లోనే.
 
దేశం మొత్తంలో ఏపీలోనే అత్యధికంగా కాంగ్రెస్ వ్యతిరేకత
 
ఆ విశ్లేషణలో సారాంశం ఏమిటంటే దేశం మొత్తం మీద అత్యధిక కాంగ్రెస్ వ్యతిరేకత ఆంధ్ర ప్రదేశ్ లోనే నిర్మాణమైంది. అంతకు ముందు ఎన్నికలలో (1971) కాంగ్రెస్ కు  ఓటు వేసిన వారిలో సుమారు 30 శాతం మంది వ్యతిరేకంగా వేశారు. అయితే కాంగ్రెసేతర పక్షాలు ముందు నుండి బలహీనంగా ఉన్న కారణంగా , 1971 ఎన్నికలలో బృహత్తర కూటమి సంయుక్తంగా పొందిన ఓట్లు 10 నుండి 15 శాతం మించని కారణంగా అటు నుండి ఇటు వచ్చిన 30 శాతం ఓట్లను కలుపుకొన్నప్పటికీ ముఖాముఖీ జరిగిన ఎన్నికలలో జనతా పార్టీ అభ్యర్థులు విజయం సాధించలేకపోయారు.
 
కాగా, ఉత్తర ప్రదేశ్, బీహార్, మధ్య ప్రదేశ్, గుజరాత్, రాజస్థాన్, పంజాబ్, హర్యానా,
పశ్చిమ బెంగాల్ వంటి ప్రాంతాలలో ప్రతిపక్షాలకు ముందు నుండి 30 నుండి 40 శాతం వరకు ఓట్ల మూల బలం ఉంది. అక్కడ అత్యవసర పరిస్థితి అకృత్యాలకు గురైన ప్రజలు 10 నుండి 20 శాతం అటు నుండి ఇటు వైపు రావడంతో కాంగ్రెస్ ను సులభంగా ఓడించ గలిగారు.
 
ఆంధ్ర ప్రదేశ్ కు వస్తే నంద్యాలలో సంజీవరెడ్డి గెలుపొందగా, జనతా పార్టీ అభ్యర్థులు ఐదుగురు స్వల్ప తేడాతో ఓటమి చెందారు. శ్రీమతి తేళ్ల లక్ష్మీకాంతమ్మ, గౌతు లచ్చన్న, తెన్నేటి విశ్వనాథం, పివి చలపతిరావు, పి పుండరీకాంక్షచారి – ఈ ఐదుగురు వరుసగా సికింద్రాబాద్, శ్రీకాకుళం, విశాఖపట్నం, అనకాపల్లి, బొబ్బిలి స్థానాల్లో ఓడిపోవడం స్థంభించింది.
 
 ఇలా అతి స్వల్ప తేడాతో డిపోయినా ఐదుగురిలో నలుగురు పీవీ చలపతిరావు ఎమ్యెల్సీగా ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రాంతానికి చెందిన వారు.
 
విశాఖలో బిజెపి అఖండ విజయం
 
ఆ తర్వాత 1983 ఎన్నికలలో కాంగ్రెస్ చిత్తుగా ఓడిపోయింది అంటే భారతీయ జనతా పార్టీ అందుకు నేలను సిద్ధం చేసి ఉంచింది. 1980లో ప్రారంభించిన భాజపా ఆంధ్ర ప్రదేశ్ లో మొదటగా మున్సిపల్ కార్పొరేషన్  ఎన్నికల్లో పోటీ చేసింది. ఆ ఎన్నికలలో విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ లో మెజారిటీ డివిజన్లను గెలుచుకోవడమే కాకుండా, మేయర్, డిప్యూటీ మేయర్, స్టాండింగ్ కమిటీ చైర్మన్ పదవులను గెలుచుకొంది. ఆ సమయంలో పీవీ చలపతిరావు పార్టీ రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్న విషయం విస్మరించలేము.
 
రాజమండ్రి లోక్ సభ స్థానాన్ని రెండు సార్లు, నరసాపురం స్థానాన్ని రెండు సార్లు,  కాకినాడ, విశాఖపట్నం స్థానాలను ఒకొక్కసారి భాజపా గెల్చుకోవడం, విశాఖపట్నం జిల్లాలోని పాడేరు రిజర్వేడ్ స్థానంలో 1978లో జనతా పార్టీ అభ్యర్థిని, విశాఖపట్నంలోని వివిధ స్థానాలలో భాజపా అభ్యర్థులను గెలిపించుకోవడం – వీటన్నింటి వెనుక చలపతిరావు, ఆయన సహచర కార్యకర్తలు చేసిన కృషి ఎంతైనా ఉంది.
 
అనకాపల్లి మునిసిపాలిటీల్లో 1977 వరకు (జనతా పార్టీ విలీనమయ్యే వరకు) జనసంఘ్ చాలా బలీయమైన శక్తిగా ఉండెడిది. ఇవ్వన్నీ చలపతిరావు అంకితభావంతో తన పార్టీకి అందించిన సేవలు.
 
మా ఇద్దరికీ గల బంధాన్ని ఓ మాట ప్రత్యేకంగా చెప్పవలసి ఉంది. అత్యవసర పరిస్థితిని ఎన్నికలు ప్రకటించిన తర్వాత సడలించడం జరిగింది. వివిధ రాజకీయ పక్షాలకు చెందిన డెటెన్యూలను విడుదల చేశారు. ఆర్ఎస్ఎస్ కార్యకర్తలంగా నిర్బంధింపబడిన కొంతమంది ఇంకా జైల్లోనే ఉండిపోయాము. అటువంటి సమయంలో అనకాపల్లిలో జరిగిన ఓ పెద్ద బహిరంగసభలో జనతా పార్టీ అభ్యర్థిగా ప్రకటింపబడిన అజ్ఞాత వీరుడు చలపతిరావు ప్రత్యక్షమయ్యారు. తనకు తానుగా పోలీసులకు అందుబాటులోకి వచ్చారు.
 
ఆయనను అరెస్ట్ చేసి విశాఖపట్నం సెంట్రల్ జైలుకు తీసుకు వచ్చారు. అప్పుడు హాస్పిటల్ బారాక్స్ లో ఆయన, నేను రెండు, మూడు రోజులు కలిసి ఉన్నాము. అటుపిమ్మట, జనతా పార్టీ అభ్యర్హ్దిగా ప్రకటించిన అనంతరం ఆయనను విడుదల చేయగా, ఎన్నికల ప్రచారం నిమిత్తం ప్రజాజీవనంలోకి వెళ్లిపోయారు. వారి సుదీర్ఘకాలపు అజ్ఞాత జీవితం తర్వాత, స్థిమితంగా కూర్చొని మాట్లాడుకోవడానికి అవకాశం దొరికిన మొదటి బృందంలో నేనూ ఒక్కడిని. కాబట్టి, పత్రికలపై ఆంక్షలు తొలగిన తర్వాత పత్రికలకు ఆ విషయాలు తెలియచెప్పే అవకాశం నాకు కలిగింది.