షర్మిల కదలికలపై జాగ్రత్తపడాల్సింది బీజేపీనే  

శ్యాంప్రసాద్ రెడ్డి కోర్శిపాటి
 
వై ఎస్ షర్మిల తెలంగాణలో చాలా తెలివైన రాజకీయం చేస్తోంది. షర్మిల కార్యకలాపాలు, కదలికల విషయంలో జాగ్రత్తపడాల్సింది బీజేపీనే. ఎందుకంటే తెలంగాణలో షర్మిల పార్టీ బలపడితే అందరికంటే ఎక్కువగా నష్టపోయేది బిజేపీనే. బిజేపీకి, టిఆర్ఎస్ ఏ స్థాయి ప్రత్యర్ధో వైయస్సార్టీపి కూడా అదే స్థాయి ప్రత్యర్థి అనటంలో ఏమాత్రం సందేహం అవసరం లేదు. బీజేపీ షర్మిలను తేలికగా తీసుకోవడానికి లేదు. 
 
తెలంగాణలో షర్మిలకు ఏమాత్రమూ సానుకూలత లేదని, విజయావకాశాలు లేవని కొందరు వాదిస్తున్నారు. అది నిజం కూడా కావచ్చు. లేదు ఎన్నికల నాటికి షర్మిల ప్రజాదరణలో మార్పు రావచ్చు కూడా. షర్మిల పార్టీ ఇప్పటి వరకు ఏ ఎన్నికలలోనూ పోటీ చెయ్యకపోవడంతో ఆమె బలాబలాలను అంచనా వేయడం సాధ్యం కావడంలేదు. 
 
ఇది కూడా ఒకరకంగా ప్రమాదకరమే. ఒకేసారి సార్వత్రిక ఎన్నికల్లోనే షర్మిల తన శక్తియుక్తులను ప్రదర్శించే అవకాశముంది. ఇప్పుడు జరిగే చిన్న చిన్న ఎన్నికలలో పోటీ చెయ్యకపోవడం షర్మిల పార్టీ వ్యూహంలో భాగం కూడా కావచ్చు. 
 
రాజశేఖర్ రెడ్డి తనయగా షర్మిలకు కొన్ని వర్గాల ఆదరణ ఖచ్చితంగా లభిస్తుంది. మహిళ అనే సెంటిమెంటు కూడా కొంత పని చేస్తుంది. ఇక కుల సమీకరణలెలానూ ఉండనే ఉన్నాయి. షర్మిల, ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చడం ద్వారా బీజేపీ విజయావకాశాలను గణనీయంగా దెబ్బ తీయగలదు.
 
 మొన్న మునుగోడు ఎన్నికలో జరిగింది ఇదే. కాంగ్రెస్ పోటీలో ఉండడం, రాహుల్ పాదయాత్రతో అకస్మాత్తుగా కాంగ్రెస్ కి స్వల్పంగానైనా ఓట్ షేర్ పెరగడం బీజేపీని దెబ్బతీసింది.
 
షర్మిలను పెంచి పోషిస్తున్నది కమలం పార్టీయేనని, క్రైస్తవులు, రెడ్ల ఓట్లు టీఆరెఎస్ కు వెళ్ళకుండా చెయ్యడానికి స్వయంగా బీజేపీనే షర్మిలను ప్రోత్సహిస్తోందని మరికొందరు వాదిస్తున్నారు. ఇది కేవలం ఒక వర్గం మీడియా చేస్తున్న దుష్ప్రచారం మాత్రమే. 
 
షర్మిల ఉన్నా లేకపోయినా క్రైస్తవుల ఓట్లు బీజేపీకెలాగూ పడవు. షర్మిల లేకపోతే రెడ్లు, కొన్ని బీసీ వర్గాల ఓట్లలో ఎక్కువ భాగం బీజేపీకే పడతాయి. షర్మిల పోటీలో ఉండడం వల్ల ఇప్పుడు అవి షర్మిలకు షిఫ్ట్ అవుతాయి. అప్పుడు అల్టిమేట్ గా లాభపడేది టీఆరెస్సే. 
 
మరో విషయమేమిటంటే హిందుత్వ ఆధారంగా నడిచే బీజేపీ కనుసన్నల్లో ముందుకెళ్లడానికి క్రైస్తవ మూలాలున్న షర్మిల ఏమాత్రమూ ఇష్టపడరు. అలాగే క్రైస్తవ మూలాలున్న షర్మిలను బిజేపీ ఎట్టి పరిస్థితుల్లోనూ తోడు తీసుకెళ్లదు. 
 
దేశంలో ఎక్కడైనా సరే తనకు ముందూ వెనకగానో, సమాంతరంగానో మరో పార్టీ మనుగడ సాగించడం బీజేపీకి ఏ విధంగానూ లాభించదు కూడా. ఆంధ్రలో చంద్రబాబుతో, బీహార్ లో నితీష్ తో, మహారాష్ట్రలో శివసేనతో ఎదురైన చేదు అనుభవాలు ఆ విషయంలో బీజేపీకి గట్టి గుణపాఠాలు. 
 
కనుక బీజేపీ మరోసారి అలాంటి తప్పిదం చెయ్యదుగాక చెయ్యదు. మీడియా ప్రభావంతో బీజేపీ అభిమానులెవరైనా ఇలాంటి భ్రమలలో ఉంటే ఇప్పటికైనా నిజం తెలుసుకుంటే మంచిది. షర్మిల వెనుక క్రిస్టియన్ మాఫియా ఉంది. డబ్బుకి కొదవలేదు కనుక సహజంగానే మీడియా అండ లభిస్తుంది. నిజం చెప్పాలంటే తెలుగు రాష్ట్రాలు రెండింటినీ అన్నా చెల్లెళ్ళిద్దరూ లిటరల్ గా పంచుకున్నారు. రెండు చోట్లా ఒకే వ్యూహం నడుస్తోంది.
 
 అదే పాదయాత్ర, అదే రాజశేఖర్ రెడ్డి బిడ్డ, అదే సానుభూతిని గెయిన్ చేసుకునే ప్రయత్నాలు, ఇలా…. ఒకవైపు రాజకీయ చతురుడు, మాటల మాంత్రికుడు, మాయల మరాఠీ కేసీఆర్. ముస్లింలు, క్రైస్తవులు, కమ్యూనిస్టుల బీజేపీ వ్యతిరేక ధోరణి ఎలాగూ ఉండనే ఉంది. మునుగోడులో తెరాస విజయంలో కమ్యూనిస్టుల ఓట్లు కీలకంగా మారిన సంగతి మనకు తెలిసిందే. 
 
ఈ నేపథ్యంలో ఎంతో జాగ్రత్తగా అడుగులేస్తేనే బీజేపీ తెలంగాణలో విజయం సాధించగలుగుతుంది. అన్నిటికంటే ముఖ్యంగా, మీడియా మాయలో పడకుండా బీజేపీ నేతలందరూ చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. మీడియా అనేక భ్రమలు కల్పిస్తుంది, అపోహలు రేపుతుంది, కార్యకర్తలు, నేతల మధ్య విభేదాలు సృష్టిస్తుంది. 
 
ఏమీ లేకపోయినా మనకు తెలియకుండా లోపల్లోపల ఏదో జరిగిపోతోందనే భావనను కల్పిస్తుంది. అభద్రతా భావనను, ఆందోళనను సృష్టిస్తుంది. మీకు తెలియకుండానే మీరు మీ పార్టీ ప్రయోజనాలకు విరుద్ధంగా పనిచేసేలా చేస్తుంది. 
 
 సీనియర్, జూనియర్ విభేదాలు, వర్గ పోరు, కుల పట్టింపులు, ఆధిపత్య పోరు అన్నిటికీ అతీతంగా బీజేపీ నేతలందరూ సమైక్యంగా, ఉద్యమ స్ఫూర్తితో, అత్యంత వ్యూహాత్మకంగా పనిచెయ్యాలి. ఎందుకంటే, దేశంలోనే కాదు ప్రపంచంలో ఎక్కడ, ఏ మూల తీవ్రవాద కార్యకలాపాలు జరిగినా వాటి మూలాలు హైదరాబాద్ లో, తెలంగాణలో బయటపడుతున్న నేపథ్యంలో జాతీయవాద బీజేపీ అవసరం తెలంగాణకు ఎంతో ఉంది. 
 
తెలంగాణలో బీజేపీ విజయం, దేశానికి కూడా ఎంతో ఉపయోగకరం, అత్యావశ్యకం. దేశ రక్షణ దిశగా మనం వేసే అతిపెద్ద ముందడుగు. అదే సమయంలో, తెలంగాణలో బీజేపీ విజయం నల్లేరు మీద బండి నడక కానే కాదు. బీజేపీ కార్యకర్తల అవిరళ కృషితోనే అది సాధ్యం. బీజేపీ కార్యకర్తలారా బహుపరాక్.