సోమేశ్ కుమార్ తెలంగాణ క్యాడర్ కేటాయింపు రద్దు

సోమేశ్ కుమార్ తెలంగాణ క్యాడర్ కేటాయింపు రద్దు చేస్తూ హైకోర్టు తీర్పు ఇచ్చింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా తెలంగాణ‌లో సోమేశ్ కుమార్ కొన‌సాగింపును ర‌ద్దు చేస్తూ హైకోర్టు సీజే జ‌స్టిస్ ఉజ్జ‌ల్ భూయాన్ బెంచ్ తీర్పు వెల్ల‌డించింది. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు వెళ్లాల‌ని సోమేశ్ కుమార్‌ను కోర్టు ఆదేశించింది.

రాష్ట్ర విభ‌జ‌న స‌మ‌యంలో సోమేశ్ కుమార్‌ను కేంద్రం ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వానికి కేటాయించింది. దీంతో సోమేశ్ కుమార్ క్యాట్‌ ను ఆశ్ర‌యించారు. ఈ క్ర‌మంలో కేంద్రం ఉత్త‌ర్వులు నిలిపివేసి తెలంగాణ‌లో కొన‌సాగేలా క్యాట్ ఉత్త‌ర్వులు జారీ చేసింది. ఇక క్యాట్ మ‌ధ్యంత‌ర ఉత్వ‌ర్వుల‌తో సోమేశ్ కుమార్ తెలంగాణ‌లో కొన‌సాగుతున్నారు.

ఈ క్ర‌మంలో క్యాట్ ఉత్త‌ర్వులు కొట్టేయాల‌ని 2017లో కేంద్రం హైకోర్టును ఆశ్ర‌యించింది. క్యాట్ మ‌ధ్యంత‌ర‌ ఉత్త‌ర్వుల‌ను కొట్టివేస్తూ హైకోర్టు సీజే ధ‌ర్మాస‌నం మంగ‌ళ‌వారం తీర్పు వెల్ల‌డించింది. 2019, డిసెంబ‌ర్ నుంచి తెలంగాణ సీఎస్‌గా సోమేశ్ కుమార్ కొన‌సాగుతున్నారు. అయితే సోమేష్ కుమార్ న్యాయవాది అభ్యర్థన మేరకు తీర్పు అమలు మూడు వారాలపాటు నిలిపివేశారు

తక్షణమే రాజీనామా చేయాలి

హైకోర్టు తీర్పు దృష్ట్యా సోమేశ్ కుమార్ తక్షణమే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పదవికి రాజీనామా చేయాలని, ఆ బాధ్యతల నుండి తప్పిస్తూ ఏపీకి బదిలీ చేయాలని బీజేపీ డిమాండ్ చేసింది. 2014 రాష్ట్ర విభజన తర్వాత డీఓపీటీ ఇచ్చిన ఆదేశాలను తుంగలో తొక్కి ఏపీకి చెందిన ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు తెలంగాణలో కీలక బాధ్యతలు ఇవ్వడం అనైతికం, అప్రజాస్వామికం అని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ విమర్శించారు.

తెలంగాణకు కేటాయించిన ఎందరో అధికారులు సీనియారిటీ లిస్టులో ఉండగా ఆంధ్రప్రదేశ్ కు కేటాయించబడ్డ సోమేశ్ కుమార్ ను ప్రధాన కార్యదరాశిగా నియమించడం ద్వారా ముఖ్యమంత్రి కేసీఆర్ రాజకీయ లబ్ది పొందారని ఆరోపించారు. 317 జీవో సహా అనేక ఉద్యోగ, ప్రజా వ్యతిరేక ఉత్తర్వులను సోమేశ్ కుమార్ ద్వారా విడుదల చేయించారని ధ్వజమెత్తారు.
 
 అదే విధంగా హెచ్ఎండీఏ, రెవిన్యూ, ఇరిగేషన్, హోం తదితర శాఖల్లో తమకు అనుకూలమైన అధికారులను నియమించుకుని పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడేందుకు సోమేశ్ కుమార్ ను పావుగా వాడుకున్నారని పేర్కొన్నారు. 
డీవోపీటీ ఆదేశాల మేరకు ఏపీకి కేటాయించబడ్డ అధికారులను ఆ రాష్ట్రానికి బదలాయించాలని,. అట్లాగే తెలంగాణకు కేటాయించిన అధికారులను స్వరాష్ట్రానికి తీసుకురావాలని డిమాండ్ చేశారు.
 
కేసీఆర్ తన `ప్రత్యేక ప్రయోజనాల’ కోసమే తెలంగాణ క్యాడర్ కానీ అధికారులను అందలం ఎక్కిస్తున్నట్లు బిజెపి చేస్తున్న ఆరోపణలకు ఈ తీర్పు అడ్డం పడుతుందని బిజెపి రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి కె కృష్ణసాగర్ రావు స్పష్టం చేశారు. తెలంగాణకు కేటాయించని అధికారుల పట్ల కేసీఆర్ ఎందుకు ప్రత్యేక అభిమానం చూపుతున్నారని ఆయన ప్రశ్నించారు. తెలంగాణ క్యాడర్ కు చెందిన ఇతర అధికారులపై పెత్తనం చేసే విధంగా ఇటువంటి అధికారులకు ఎందుకని కీలకమైన పదవులు అప్పగిస్తున్నారని ఆయన నిలదీశారు.