జడ్జీలలో 79 శాతం మంది ఉన్నత కులాల వారే!

ఉన్నత న్యాయ వ్యవస్థలో సామాజిక వైవిధ్యం సమస్యను పరిష్కరించేందుకు కొలీజియం ఎటువంటి కృషి చేయలేదని కేంద్ర న్యాయ శాఖ పార్లమెంటరీ కమిటీకు తెలిపింది. ఐదేండ్లలో (2018-2022) దేశంలోని అన్ని హైకోర్టులలో నియమించిన జడ్జీలలో 79 శాతం మంది ఉన్నత కులాలకు చెందినవారేనని తెలిపింది.

కేంద్ర న్యాయ శాఖ బీజేపీ ఎంపీ సుశీల్‌ మోదీ నేతృత్వంలోని పార్లమెంటరీ కమిటీకి ఈ మేరకు సమర్పించిన ఒక నివేదిక ప్రకారం ఐదేండ్లలో వెనుకబడిన తరగతులు, మైనారిటీలకు చెందిన వారికి అతి తక్కువ ప్రాధాన్యం లభించిందని కేంద్రం తెలిపింది.

గత మూడు దశాబ్దాలలో కొలీజియం వ్యవస్థ ఉన్నత న్యాయస్థానాలలో సామాజిక వైవిధ్యం సమస్యను పరిష్కరించలేకపోయిందని పేర్కొంది. గత ఐదేండ్ల కాలంలో 537 మందిని హైకోర్టులకు జడ్జీలుగా నియమిస్తే వారిలో 424 (79%) మంది ఉన్నత కులాల వారు, 57 (11%) మంది ఓబీసీలు, 15 (2.8%) మంది ఎస్సీలు, ఏడుగురు (1.3%) ఎస్టీలని వివరించింది.

మరో 20 మంది జడ్జీలు ఏ కులానికి చెందినవారో తెలియరాలేదని పేర్కొంది. ఈ నియామాకాల్లో ఓబీసీల పట్ల స్పష్టమైన వివక్ష కనిపిస్తున్నట్టు ప్రభుత్వం తన నివేదికలో తెలిపింది. దేశ జనాభాలో ఓబీసీలు 35 శాతం మంది ఉండగా, ఆ వర్గానికి చెందిన వారు జడ్జీలుగా 11 శాతం మాత్రమే నియమితులయ్యారని పేర్కొంది.

న్యాయస్థానాల్లో నియామకాలు జరిపే ముందు సామాజిక వైవిధ్యం, సామాజిక న్యాయం పాటించాల్సిన ప్రాథమిక బాధ్యత సుప్రీంకోర్టు, హైకోర్టు కొలీజియంలకు ఉంటుందని తెలిపింది. న్యాయమూర్తుల నియామకాల్లో రిజర్వేషన్లను పాటించే అవకాశం లేదని, సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు చేసిన వారినే ప్రభుత్వం జడ్జీలుగా నియమిస్తుందని తెలిపింది.

జడ్జీల నియామకాల్లో సామాజిక న్యాయం పాటించి అణగారిన వర్గాల వారికి అవకాశం ఇచ్చే అంశాన్ని పరిశీలించాలని తాము సుప్రీం కోర్ట్‌, హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులకు, ఎప్పటి నుంచో విజ్ఞప్తి చేస్తున్నామని పేర్కొంది.

”రాజ్యాంగ న్యాయస్థానాలకు న్యాయమూర్తుల నియామకంలో న్యాయవ్యవస్థ ప్రధాన పాత్ర వహించడం ప్రారంభించి దాదాపు 30 ఏళ్లు అవుతోంది. అయితే, సామాజిక వైవిధ్యం ఆవశ్యకతను ప్రస్తావిస్తూ ఉన్నత న్యాయవ్యవస్థను కలుపుకొని,  ప్రతినిధిగా చేయాలనే ఆకాంక్ష ఇంకా నెరవేరలేదు,” అని కేంద్ర న్యాయశాఖ తెలిపింది. 

న్యాయమూర్తుల నియామకానికి ప్రతిపాదనలు పంపేటప్పుడు ఉన్నత న్యాయస్థానాలలో న్యాయమూర్తుల నియామకంలో సామాజిక వైవిధ్యాన్ని నిర్ధారించడం కోసం ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీలు, మహిళలకు చెందిన అర్హులైన అభ్యర్థులను పరిగణనలోకి తీసుకోవాలని ప్రభుత్వం హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులను కోరుతూనే ఉందని పేర్కొంది.

న్యాయ శాఖ మోదీ ప్రభుత్వం నెలకొల్పిన నేషనల్‌ జ్యుడీషియల్‌ అపాయింట్‌మెంట్స్‌ కమిషన్‌ (ఎన్‌జాక్‌) విషయాన్ని కూడా ప్రస్తావించింది.  ఎన్‌జాక్‌ సభ్యుల్లో ఇద్దరు ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వర్గాలకు చెందిన వారు లేదా మైనారిటీలు లేదా ఓ మహిళ ఉండాలని ప్రతిపాదిస్తే సుప్రీంకోర్టు ఆ చట్టాన్ని కొట్టివేసిందని కేంద్రం వెల్లడించింది.

ఇలా ఉండగా, న్యాయమూర్తుల నియామకంలో కొలీజియంకు, కేంద్ర ప్రభుత్వంకు మధ్య ఏర్పడిన ప్రతిష్టంభనను ప్రస్తావిస్తూ ఇరువురు ఈ విషయమై ఓ అవగాహనకు రావాలని గత డిసెంబర్ లో ఈ కమిటీ పార్లమెంట్ ముందుంచిన నివేదికలో సూచించింది. ఈ విషయమై ప్రతిష్టంభన ప్రారంభమై ఏడేళ్లు అవుతున్నప్పటికీ ఒక అవగాహనకు రాలేక పోవడం పట్ల తాజాగా ఈ కమిటీ అసంతృప్తి వ్యక్తం చేసింది. అదే విధంగా, నిర్ణీత కాలంలో ఖాళీల భర్తీ పట్ల కూడా తగు చర్య తీసుకోవడం లేదని పేర్కొన్నది.