కుంగిపోతున్న జోషిమఠ్ పై ప్రధాని కార్యాలయంలో అత్యున్నత సమీక్ష

ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని జోషిమఠ్ పట్టణం ఆందోళనకర రీతిలో కుంగిపోతున్న ఘటనపై ప్రధాని కార్యాలయం సమీక్ష నిర్వహించింది. పట్టణంలోని 600కు పైగా ఇళ్లు, భవనాలు, రోడ్లు కుంగిపోవడం వెనుక కారణాలను అన్వేషించడం కోసం సంబంధిత రంగాల నిపుణులతో కమిటీని ఏర్పాటు చేసి అధ్యయనం చేయాల్సిందిగా ఆదేశించింది. 
 
ప్రధాన మంత్రి ప్రిన్సిపల్ సెక్రటరీ డా. పీకే మిశ్రా నేతృత్వంలో ఆదివారం  జరిగిన అత్యున్నతస్థాయి సమావేశంలో కేబినెట్ సెక్రటరీ, హోంశాఖ కార్యదర్శి, కేంద్ర ప్రభుత్వానికి చెందిన మరికొందరు ఉన్నతాధికారులతో పాటు నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ (ఎన్డీఎంఏ) సభ్యులు ప్రత్యక్షంగా పాల్గొన్నారు. 
 
కాగా, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఉత్తరాఖండ్ చీఫ్ సెక్రటరీ, డీజీపీ, జోషిమఠ్ జిల్లా అధికారులు, ఐఐటీ (రూర్కీ) నిపుణులు, నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్మెంట్, జియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా, వాడియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హిమాలయన్ జియాలజీ అధికారులు, నిపుణులు పాల్గొన్నారు.
ఆందోళనకరంగా కుంగిపోతున్న జోషిమఠ్ గురించి ప్రధాని ఆందోళన వ్యక్తం చేశారని, ఈ అంశంపై రాష్ట్ర ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామితో ఇప్పటికే మాట్లాడారని వెల్లడించారు. పగుళ్లు బారిన, బీటలువారి ఇళ్లు, భవనాల్లో నివసిస్తున్న ప్రజలను ఖాళీ చేయించి తాత్కాలికంగా ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలకు తరలించినట్టు ఉత్తరాఖండ్ ప్రభుత్వ ఉన్నతాధికారులు వెల్లడించారు.
పట్టణంలో 350 మీటర్ల మేర కుంగిపోతోందని తెలిపారు. సహాయ చర్యల్లో రాష్ట్ర ప్రభుత్వ విపత్తు నిర్వహణ సిబ్బందితో పాటు ఎన్డీఆర్ఎఫ్ బృందం ఒకటి ఉందని వెల్లడించారు. జిల్లా ఎస్పీ, ఎస్డీఆర్ఎఫ్ కమాండెంట్ జోషిమఠ్‌లోనే ఉండి పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారని తెలిపారు.
ఘటనాస్థలాన్ని ప్రత్యక్షంగా పరిశీలించేందుకు ఎన్డీఎంఏ సభ్యులు, బోర్డర్ మేనేజ్మెంట్ కార్యదర్శి సోమవారం జోషిమఠ్ సందర్శించాలని సమావేశంలో నిర్ణయించారు.
అలాగే నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ, నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్మెంట్, జియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా, ఐఐటీ-రూర్కీ, వాడియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హిమాలయ్ జియాలజీ, నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హైడ్రోలజీ, సెంట్రల్ బిల్డింగ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ నుంచి నిపుణులతో ఒక కమిటీని ఏర్పాటు చేసి కుంగిపోవడం వెనుక కారణాలను అన్వేషించాలని నిర్ణయించారు.
 అలాగే నిర్ణీత కాలవ్యవధిలో జోషిమఠ్ పునర్నిర్మాణం వంటి ప్రత్యామ్నాయ చర్యలు సిఫార్సు చేయాలని కూడా సూచించారు. నిరంతర భూకంప పర్యవేక్షణ చేపట్టాలని నిర్ణయించారు. జోషిమఠ్ కోసం రిస్క్ సెన్సిటివ్ అర్బన్ డెవలప్మెంట్ ప్లాన్ రూపొందించాలని కూడా సమీక్షలో నిర్ణయించారు.
జోషిమఠ్ పరిస్థితిపై ఇప్పటికే ఉత్తరాఖండ్ ముఖ్యమంమత్రితో సమీక్షించిన ప్రధాని మోదీ తాత్కాలిక పునరావాస కేంద్రాల్లో ఉన్న ప్రజలకు తగిన వసతి, భోజన సదుపాయాలు కల్పించాలని కేంద్రం సూచించింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం నుంచి అవసరమైన సహాయం అందజేస్తామని వెల్లడించింది.  మొత్తంగా ఈ సమావేశంలో స్వల్పకాలిక, దీర్ఘకాలిక ప్రణాళికలపై సమాలోచనలు జరపడంతో పాటు నిపుణుల సలహాలు తీసుకున్నారు.