బీజేపీ పరిపాలనలో లేని రాష్ట్రాల్లో కూడా అదానీ  వ్యాపారాలు

ప్రధాని నరేంద్ర మోదీతో తనకు సన్నిహిత సంబంధాలు ఉండటం వల్ల తాను లబ్ధి పొందుతున్నట్లు ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలను ప్రముఖ పారిశ్రామిక దిగ్గజం గౌతమ్ అదానీ కొట్టిపారేశారు. తాను బీజేపీయేతర పార్టీలు పరిపాలిస్తున్న రాష్ట్రాల్లో కూడా వ్యాపారం చేస్తున్నానని గుర్తు చేశారు. 

అదానీ గ్రూప్ 22 రాష్ట్రాల్లో వ్యాపార కార్యకలాపాలను నిర్వహిస్తోందని చెబుతూ ఈ రాష్ట్రాలన్నీ బీజేపీ పరిపాలనలో లేవని స్పష్టం చేశారు. ప్రతి రాష్ట్రంలోనూ గరిష్ఠ స్థాయిలో పెట్టుబడులు పెట్టాలని తాము కోరుకుంటున్నామని తెలిపారు.

దేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన టెలివిజన్ కార్యక్రమం ఇండియా టివి ప్రధాన సంపాదకుడు, చైర్మన్ రజత్ శర్మ నిర్వహించే `ఆప్ కి అదాలత్’ కార్యక్రమంలో ఈ విషయమై అదానీ స్పష్టమైన సమాధానాలు ఇచ్చారు. బహుశా ఆయన ఓ టీవీ ఇంటర్వ్యూలో ప్రత్యేకంగా మాట్లాడటం ఇదే మొదటిసారి.

‘‘మోదీ నుంచి ఎటువంటి వ్యక్తిగత సహాయాన్నీ మీరు పొందలేరు. దేశ ప్రయోజనాల కోసం విధానాల గురించి ఆయనతో మీరు మాట్లాడవచ్చు. కానీ ఒకసారి విధానం తయారైందంటే, అది అందరి కోసం, కేవలం అదానీ గ్రూప్ కోసం మాత్రమే కాదు’’ అని అదానీ తేల్చి చెప్పారు. 

నేడు 22 రాష్ట్రాల్లో కార్యకలాపాలను నిర్వహిస్తుండటం పట్ల అదానీ గ్రూప్ సంతోషం వ్యక్తం చేస్తోందని పేర్కొంటూ తమకు ఏ రాష్ట్ర ప్రభుత్వంతోనూ ఎటువంటి సమస్య లేదని స్పష్టం చేశారు. వామపక్షాల పాలనలో ఉన్న కేరళ, మమతా బెనర్జీ పాలిస్తున్న పశ్చిమ బెంగాల్, నవీన్ పట్నాయక్ నేతృత్వంలోని ఒడిశా, వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలిస్తున్న ఆంధ్ర ప్రదేశ్, కే చంద్రశేఖర్ రావు పాలిస్తున్న తెలంగాణ రాష్ట్రాల్లో కూడా తాము పని చేస్తున్నామని వివరించారు.

కాంగ్రెస్ నేత రాజీవ్ గాంధీ ప్రధాన మంత్రిగా ఉన్న కాలంలో అదానీ గ్రూప్ ప్రస్థానం ప్రారంభమైందని, అప్పటి నుంచి తన కెరీర్ ఊపందుకుందని తెలిపారు. ముప్ఫయ్యేళ్ళ క్రితం నుంచి తాము వ్యాపారం చేస్తున్నామని పేర్కొంటూ వృత్తిపరంగా తాను సాధించిన అభివృద్ధిని ఏదో ఓ రాజకీయ నాయకుడికి ముడిపెట్టకూడదని స్పష్టం చేశారు.

ప్రధాని మోదీ, తాను ఒకే రాష్ట్రం నుంచి వచ్చినందువల్ల నిరాధారమైన ఆరోపణలు చేయడానికి సులువైన లక్ష్యంగా తాను మారానని విచారం వ్యక్తం చేశారు. తనకు వ్యతిరేకంగా ఇటువంటి భావాలను ప్రచారం చేయడం దురదృష్టకరమని చెప్పారు. వచ్చిన సమాచారం గురించి పూర్తిగా తెలుసుకోకుండా ఆరోపణలు చేయడం దురదృష్టకరమని తెలిపారు.

తమ గ్రూప్ కంపెనీలు సాధిస్తున్న విజయాలను హ్రస్వ దృష్టితో చూస్తూ ఈ ఆరోపణలు చేస్తున్నారని పేర్కొన్నారు. తన విజయానికి కారణం ఏదో ఓ నాయకుడు కాదని, ముప్ఫయ్యేళ్ళలో వివిధ ప్రభుత్వాలు, వేర్వేరు నాయకులు రూపొందించి, అమలు చేసిన విధానాలు, సంస్కరణల వల్ల తాను విజయం సాధించానని అదానీ తెలిపారు.

రాజీవ్ గాంధీ ప్రధాన మంత్రిగా ఉన్న కాలంలో తన విజయపరంపర ప్రారంభమైందని తెలిస్తే చాలా మంది ఆశ్చర్యపోతారని చెప్పారు. అప్పట్లో ఎగుమతులు, దిగుమతుల విధానాన్ని రాజీవ్ గాంధీ సరళతరం చేయడంతో తన వ్యాపార విజయం ప్రారంభమైందని చెప్పారు. రాజీవ్ లేకపోతే ఓ ఔత్సాహిక పారిశ్రామికవేత్తగా తన ప్రయాణం ప్రారంభమై ఉండేది కాదని స్పష్టం చేశారు.