కేంద్ర ప్రభుత్వ నిధులకు మ్యాచింగ్ గ్రాంట్లు ఇవ్వని కేసీఆర్ 

తెలంగాణాలో పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు కేంద్రం విడుదల చేస్తున్న నిధులకు కేసీఆర్ ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంట్లు విడుదల చేయకపోవడంతో ఆయా పథకాల అమలులో ఇబ్బందులు ఎదురవుతున్నాయని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి విమర్శించారు.  పేదల సొంత ఇల్లు కల నెరవేర్చడానికి కేంద్ర ప్రభుత్వం సహకరిస్తున్నా కేసీఆర్‌ ప్రభుత్వ నిర్వాకం వల్ల సాకారం దాల్చడం లేదని ఆరోపించారు.
 
  ‘‘స్మార్ట్‌ సిటీస్‌ మిషన్‌ కార్యక్రమంలో వరంగల్‌, కరీంనగర్‌ నగరాలకు ఎంపిక చేశాం. వరంగల్‌ కు రూ.500 కోట్లు, కరీంనగర్‌కు రూ.500 కోట్లు కేటాయించాం. ఒక్కో నగరానికి రూ.196 కోట్ల చొప్పున మొత్తం రూ.392 కోట్ల ను 2020-21 నాటికే విడుదల చేశాం. అందుకు సమానమైన మ్యాచింగ్‌ గ్రాంట్‌ను తెలంగాణ ప్రభుత్వం పూర్తిగా విడుదల చేయలేదు” అని తెలిపారు. 
 
వరంగల్‌కు రూ.50 కోట్లు, కరీంనగర్‌కు రూ.186 కోట్లు మొత్తంగా రూ.236 కోట్లను మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం మ్యాచింగ్‌ గ్రాంట్లు ఇస్తే మిగిలిన నిధులను కూడా విడుదల చేయడానికి కేంద్రం సిద్ధంగా ఉందని తెలిపారు. అమృత్‌ పథకంలో భాగంగా 12 పట్టణాలకు రూ. 833.36 కోట్లను విడుదల చేసినట్టు పేర్కొన్నారు. 
 
అమృత్‌ 2.0 పథకం కింద 143 పట్టణాల్లో రూ. 2,780 కోట్లతో మురుగునీటి నిర్వహణ, శుభ్రమైన తాగునీరు అందిస్తామని తెలిపారు. ప్రాజెక్టుల డీపీఆర్‌లు అందించటానికి ఇప్పటికే రూ.100 కోట్ల నిధులను విడుదల చేశామని చెప్పారు.  కాగా, ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన పథకం కింద కేంద్రం ఇచ్చిన నిధులను కిషన్‌రెడ్డి వివరించారు. మొత్తం రూ. 4,465.81 కోట్లను కేటాయించగా, ఇప్పటి వరకు రూ.3,128.14 కోట్లు విడుదలయ్యాయి. 2,49,465 ఇళ్లను మంజూరు చేయ గా, 2,39,422 ఇళ్ల పనులు ప్రారంభమయ్యాయి.
 వాటిలో 2,15,443 ఇళ్ల పనులు పూర్తయ్యాయంటూ నివేదికలు వచ్చా యి. అయితే రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి చేపట్టిన ఇళ్ల నిర్మాణ పనుల నివేదికల లెక్కలకు, వాస్తవిక లెక్కలకు పొంతన లేదని కిషన్ రెడ్డి విమర్శించారు. డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్ల పేరిట తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న ఆలస్యంతో ప్రజలు సొంతింటి కలకు దూరమవుతున్నారని విమర్శించారు. సొంతంగా ఇంటిని నిర్మించుకోవాలనుకునే వారికి గతంలో రూ.5 లక్షలు ఇస్తామన్న రాష్ట్ర ప్రభుత్వం, ఇప్పుడు రూ.3 లక్షలే ఇస్తామని చెబుతోందని ఆరోపించారు.