19న హైదరాబాద్ లో వందేభారత్ రైలుకు మోదీ ప్రారంభం

తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న అత్యధిక  వేగంగా పోయే వందేభారత్ రైలును ప్రారంభించడానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 19న హైదరాబాద్ కు రానున్నారు. సికింద్రాబాద్ నుండి విజయవాడ వరకు వెళ్లే ఈ రైలు రెండు తెలుగు రాష్ట్రాల మధ్య అనుసంధానంగా నిలుస్తుంది. దేశవ్యాప్తంగా ప్రధాని ప్రారంభిస్తున్న వందేభారత్ రైళ్లలో ఇది ఎనిమిదవది కాగలదు.

బాగా ద్దీతో కూడుకుని ఉన్న ఈ రెండు నగరాల మధ్య వందేభారత్ ఎక్స్‌‌ప్రెస్ ను ప్రవేశపెట్టడానికి దక్షిణమధ్య రైల్వే అధికారులు ఇదివరకే పంపిన ప్రతిపాదనలను రైల్వేబోర్డు ఆమోదించి, ఈ ఎక్స్‌ప్రెస్‌ను మంజూరు చేసింది. దక్షిణాదిన చెన్నై, బెంగళూరు తర్వాత ఈ రైలును ప్రధాని ప్రారంభిస్తున్న మూడో మెట్రో నగరం హైదరాబాద్ కాగలదు. 

హై టెక్నాలజీ  హంగులతో వచ్చిన  వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను దశలవారీగా అన్ని జోన్లలో ప్రవేశపెడుతున్నారు. వందే భారత్ రైలు గంటకు 160 కి.మీ వేగంతో వెళ్లగలదు. రెండు నిమిషాల్లోనే 160 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది.  

ఈ సందర్భంగా రూ.699 కోట్ల వ్యయంతో చేపట్టే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆధునీకరణ పనులతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాలు కూడా ప్రధాని శ్రీకారం చుడతారు. ఈ సందర్భంగా జరిగే బహిరంగ సభ ఓ రకంగా ఈ సంవత్సరం చివరిలో జరుగనున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీ అజెండాను వెల్లడించే సభగా మారే అవకాశం ఉంది.