పెద్ద నోట్ల రద్దు నిర్ణయాన్ని సమర్థించిన సుప్రీంకోర్టు

పెద్ద నోట్ల రద్దుపై సుప్రీం రాజ్యాంగ ధర్మాసనం సంచలన తీర్పు ఇచ్చింది. అయిదుగురు సభ్యులు ఉన్న ధర్మాసనం సుదీర్ఘ విచారణ తరువాత పెద్ద నోట్ల రద్దు పైన తీర్పును వెలువరించింది. కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని జస్టిస్ గవాయి సమర్ధించారు. నోట్లను రద్దు చేస్తూ 2016 నవంబర్ 8న కేంద్రం ఇచ్చిన నోటిఫికేషన్ సరైనదేనని జస్టిస్ గవాయి తీర్పు చెప్పారు.
 
జస్టిస్ గవాయితో సహా నలుగురు న్యాయమూర్తులు ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్ధించారు. కానీ, మరో న్యాయమూర్తి నాగరత్న జస్టిస్ గవాయ్ తీర్పుతో విభేదించారు.  2016 నవంబర్ 8న దేశ వ్యాప్తంగా పెద్ద నోట్లను రద్దు చేస్తూ ప్రధాని ప్రకటన చేసారు. దీనికి సంబంధించి ఆర్బీఐ నోటిఫికేషన్ జారీ చేసింది. పెద్ద సంఖ్యలో సాధారణ ప్రజలు ఈ నిర్ణయంతో బ్యాంకుల ముందు బారులు తీరారు. దీని పైన రాజకీయంగానూ పెద్ద ఎత్తున ఆరోపణలు వెల్లువెత్తాయి.
 
దీంతో, కేంద్ర నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టులో 58 పిటీషన్లు దాఖలయ్యాయి. కాంగ్రెస్ పార్టీ ప్రముఖ నేత మాజీ ఆర్దిక మంత్రి చిదంబరం పిటీషనర్ల తరపు వాదనలు వినిపించారు. కేంద్రం తీసుకున్న నిర్ణయంలోని విధాన పరమైన అంశాలను ప్రస్తావించారు. ప్రభుత్వం పెద్ద నోట్ల రద్దులో సరైన విధానం అనుసరించలేదంటూ సుప్రీం ధర్మాసనం ముందు తన వాదనలు వినిపించారు.
 
ఇక, కేంద్రం సుప్రీం ధర్మానసం ముందు తన నిర్ణయాన్ని సమర్దించుకుంది. అపోహలతో కూడిన వాదనలను పిటీషనర్లు చేస్తున్నారంటూ అటార్నీ జనరల్ కోర్టుకు నివేదించారు. దీంతో అటు పిటీషనర్లు..ఇటు ప్రభుత్వ వాదనలు విన్న రాజ్యంగ ధర్మాసనం 2016లో కేంద్ర పెద్ద నోట్ల రద్దు నిర్ణయానికి సంబంధించిన రికార్డులను తమకు సమర్పించాలంటూ గత డిసెంబర్ 8న కేంద్రం, ఆర్బీఐని అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది.
 
రద్దు సమయంలో ఆర్బీఐకి కేంద్రం రాసిన లేఖలు..ఆర్బీఐ నిర్ణయాలతో పాటుగా నోట్ల రద్దు ప్రకటనలకు సంబంధించి పైళ్లను సమర్పించాలని ఆదేశించింది. అనంతరం తీర్పును నేటికి రిజర్వ్ చేసింది. దీనికి సంబంధించి అయిదుగురు సభ్యుల ధర్మాసనం ఒకే రకమైన తీర్పు ఇస్తుందా.. భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతాయా అనే ఉత్కంఠ కొనసాగింది.
 
సెంట్రల్ బోర్డు నిర్ణయం తీసుకున్న మీదటే ప్రభుత్వం డిమానిటైజేషన్ నిర్ణయాన్ని తీసుకోవాల్సి ఉంటుందని.. కానీ ఇక్కడ రివర్స్‌లో ప్రభుత్వ నిర్ణయానంతరం సెంట్రల్ బోర్డుకు తెలపడం జరిగిందంటూ పిటిషనర్ల తరుఫు న్యాయవాదులు పి. చిదంబరం, ప్రశాంత్ భూషణ్ వాదించారు.
 
 అయితే నోట్ల రద్దు వల్ల ప్రజలు ఇబ్బందులు పడ్డారన్నది సరికాదని కేంద్రం తరుఫు న్యాయవాదులు వాదించారు. విస్తృత ఆర్థిక, సామాజిక ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని చూస్తే ఈ ప్రక్రియ సరైనదేనని పేర్కొన్నారు. నల్లధనానికి అడ్డుకట్ట వేసేందుకే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందంటూ అటార్ని జనరల్ వాదించారు.
 
దీని పైన తీర్పు వెలువరించిన రాజ్యంగ ధర్మాసనం పెద్ద నోట్ల రద్దుకు వ్యతిరేకంగా దాఖలైన 58 పిటీషన్లను కొట్టి వేసింది. డీమానిటైజేషన్పై నిర్ణయం తీసుకునే అధికారం కేంద్రానికి ఉందని స్పష్టం చేసింది. కేంద్ర ప్రభుత్వం, ఆర్బీఐ మధ్య సంప్రదింపుల తర్వాతే నోట్ల రద్దు నిర్ణయం తీసుకుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
 
రాజ్యాంగ ధర్మాసనంలోని నలుగురు సభ్యులు పెద్దనోట్ల రద్దును సమర్థించారు. జస్టిస్ నాగరత్న కేంద్రం నిర్ణయంతో విభేదించారు. పెద్ద నోట్ల రద్దు చేస్తూ నరేంద్ర మోడీ ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్‌ చట్టబద్ధమైనదేనని సుప్రీం కోర్టు అభిప్రాయపడింది. ఈ నోటిఫికేషన్‌ విడుదల చేసే ముందు తగిన చర్యలు తీసుకున్నారని చెప్పింది. అలాగే రద్దు చేసిన నోట్ల బదిలీ కోసం ఇచ్చిన గడువు హేతుబద్ధం కాదని చెప్పలేమని పేర్కొంది.