చంద్రబాబు సభలో మరోసారి తొక్కిసలాట… ముగ్గురు మృతి

ఇటీవల కందుకూరులో తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు నిర్వహించిన రోడ్ షోలో జరిగిన విషాదం మరువకముందే అలాంటిదే మరో ఘటన చోటుచేసుకుంది. గుంటూరులో నిర్వహించిన చంద్రబాబు సభలో మరోసారి తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు మహిళలు మృతి చెందగా.. పలువురు తీవ్రంగా గాయపడ్డారు.

గాయపడిన వారిని హుటాహుటిన స్థానిక ఆస్పత్రులకు తరలించారు.  ప్రవాసాంధ్రుల ఆధ్వర్యంలో జనతా వస్త్రాలు, చంద్రన్న సంక్రాంతి కానుకల పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సభలో చంద్రబాబు పాల్గొన్నారు. సభలో చంద్రబాబు ప్రసంగం ముగిసిన అనంతరం.. ఆయన అక్కడి నుంచి వెళ్లిపోయారు.  ఆ తర్వాత జనతా వస్త్రాలు, సంక్రాంతి కానుకల పంపిణీ కోసం ప్రజలు ఒక్కసారిగా ఎగబడ్డారు.

దీంతో అక్కడ తొక్కిసలాట అయితే.. సభా నిర్వాహుకులు సరైన క్రమంలో బారికేడ్లు పెట్టకపోవటం వల్ల.. ప్రజలు ఒక్కసారిగా రావటంతో.. తొక్కిసలాట జరిగిందని స్థానికులు చెబుతున్నారు.  ఉయ్యూరు ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఓ ప్రవాసాంధ్రుడు ఈ సభను ఏర్పాటు చేసినట్టు తెలుస్తోంది. ఈ సభ కోసం టీడీపీ నాయకులు, కార్యకర్తలు సుమారు వారం రోజులుగా పని చేస్తున్నారు. ఇందుకోసం పెద్దయెత్తున ప్రచార కార్యక్రమం కూడా చేపట్టారు.

వికాస్ నగర్‌లో ఏర్పాటు చేసిన ఈ సభకు సుమారు 30 వేల మంది ప్రజలు వస్తారని అంచనా వేసినా వేసినా, ఆ స్థాయిలో ఏర్పాట్లు చేయకపోవటమే ఈ తొక్కిసలాటకు కారణమైందని తెలుస్తోంది. కేవలం రెండు నుంచి మూడు వేల మంది కూర్చునేందుకు వీలుగా కుర్చీలు వేసినట్టు తెలుస్తోంది. మరోవైపు, బారికేడ్లు కూడా నామమాత్రంగా ఏర్పాటు చేసినట్లు కనబడుతుంది

అయితే చంద్రబాబు వెళ్లిపోవటంతోనే.. సంక్రాంతి కిట్ల కోసం ప్రజలంతా ఒక్కసారిగా వచ్చారు. అదే సమయంలో ఏవైతే ఇస్తామన్న సంక్రాతి కిట్లు ఇప్పుడు కాదు రేపు ఇస్తామని చెప్పటం,  ప్రస్తుతం అక్కడి నుంచి వెళ్లిపోవాలని ప్రకటించటంతో.. జనాల్లో ఒక్కసారిగా ఆగ్రహం వ్యక్తమైంది. ఈ క్రమంలోనే ఒకరినొకరు నెట్టేసుకుంటూ పంపిణీ చేసే స్థలానికి దూసుకెళ్లారు.

పంపిణీ సమయంలో కానుకలు తీసుకునేందుకు జనం ఒక్కసారిగా తోసుకొచ్చారు. క్రమపద్ధతి పాటించకుండా ఒక్కసారిగా జనం తోసుకురావడంతో పంపిణీ సమయంలో నిర్వాహకులు అదుపు చేయలేక పోయారు. దీంతో తొక్కిసలాట జరిగింది. తొక్కిసలాటలో ఒక మహిళ మృతి చెందగా, మరో ముగ్గురు గాయపడ్డారు. మహిళ మృతి చెందడంతో కానుకల పంపిణీ అధికారులు నిలిపివేశారు.

చంద్రబాబునాయుడు  ఈ దుర్ఘటన పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ముగ్గురు మహిళల మృతి తనను కలిచివేసిందని తెలిపారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. పార్టీ తరఫున మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షలు ఆర్థిక సాయం చేయనున్నట్లు ప్రకటించారు.

తొక్కిసలాటలో మరణించిన వారి కుటుంబాలకు ఉయ్యూరు ఛారిటబుల్ ట్రస్ట్ 20 లక్షల రూపాయల పరిహారం ప్రకటించింది. అదే సమయంలో క్షతగాత్రులకు అయ్యే ఖర్చు మొత్తం తామే భరిస్తామని ప్రకటించింది. మరణించిన వారి కుటుంబాలకు రూ.2లక్షల చొప్పున పరిహారం అందించాలని, గాయపడ్డవారికి రూ.50వేల చొప్పున ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు.

 గుంటూరు వికాస్ నగర్ లో జరిగిన  తొక్కిసలాట దుర్ఘటనపై ముఖ్యమంత్రి వైయస్‌.జగన్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. ఈ ఘటనలో పలువురు మరణించడం తనను కలచివేసిందన్నారు. గాయపడ్డవారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని అధికారులను ఆదేశించారు. పంపిణీ సభలో ఏర్పాటు చేసిన తొలి కౌంటర్ వద్దే తొక్కిసలాట జరిగిందని గుంటూరు ఎస్పీ  తెలిపారు. తాము సరిపడినంత బందోబస్తు ఇచ్చామని, బారికేడ్లు విరిగిపడడంతోనే ప్రమాదం జరిగిందని వివరించారు. ముందుజాగ్రత్తలు తీసుకోవాలని తాము నిర్వాహకులకు చెప్పామని ఎస్పీ స్పష్టం చేశారు.

మూడు రోజుల క్రితమే కందుకూరులో తీవ్ర విషాదం చోటుచేసుకొని ఎనిమిది మంది చనిపోగా, మళ్లీ ఈరోజు కూడా అలాంటి తరహా ఘటనే జరగటం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. అందులోనూ ఈ రోజు నూతన సంవత్సరం కూడా కావటం విషాదకరం. కందుకూరు విషాదం నుండి అటు టీడీపీ నేతలు గాని, ఇటు పోలీసులు గాని గుణపాఠం నేర్చుకొని, తగు జాగ్రత్తలు తీసుకొంటే ఈ దుర్ఘటనకు అవకాశం ఉండెడిది కాదని భావిస్తున్నారు.