`ఎమ్యెల్యేల కొనుగోలు’ కేసు కేసీఆర్ మెడకు చుట్టుకుంటుందా!

`ఎమ్యెల్యేల కొనుగోలు’ అంటూ మునుగోడు ఉపఎన్నిక ముందు హడావుడి  చేసి, ఇందులో బీజేపీ కీలక నేతలను ఇరికించే  ప్రయత్నం చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఇప్పుడు కథ అడ్డం తిరుగుతున్నట్లున్నది. కేసీఆర్ అనుకొన్నది ఒకటి, జరుగుతున్నది మరొకటి. 
 
ఈ కేసు దర్యాప్తును రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని సిట్ నుండి తప్పించి, తెలంగాణ హైకోర్టు సీబీఐకి అప్పగించడంతో ఈ సందర్భంగా కేసీఆర్ చూపిన అత్యుత్సాహం ఆయన  మెడకే చుట్టుకొనేటట్లు కనిపిస్తున్నది. అవసరం అనుకొంటే విచారణ చేబట్టిన సిబిఐ కేసీఆర్ ను విచారించే అవకాశం ఉందని సిబిఐ మాజీ జెడి లక్ష్మీనారాయణ పేర్కొనడం గమనార్హం.  
 
 మునుగోడు ఉప ఎన్నిక ఫలితం రాగానే కేసీఆర్ ఈ కేసు వివరాలు, సీడిలను వెల్లడిస్తూ జరిపిన  ప్రెస్‌మీట్‌ ఈ సందర్భంగా కీలకంగా మారనున్నది. ఈ ప్రెస్ మీట్ ఆధారంగానే సిట్ నిస్పక్షపాతంగా దర్యాప్తు జరపలేదని నిర్ణయానికి హైకోర్టు వచ్చింది. దర్యాప్తును సీబీఐకి బదిలీ చేసింది.
 
 సీబీఐకి బదిలీ చేయడానికి హైకోర్టు 45  అంశాలను కారణాలుగా చూపినప్పటికీ కేసీఆర్ జరిపిన మీడియా సమావేశాన్ని ప్రధాన కారణంగా పేర్కొనడంతో ఇప్పుడు సీబీఐ విచారణలో కేసీఆర్ సహితం కీలకంగా మారే అవకాశం ఉంది.  ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం ముమ్మాటికి తప్పేనన్న న్యాయమూర్తి ఈ కేసుకు సంబంధించిన దర్యాప్తు సమాచారాన్ని సీఎం కేసీఆర్‌కు చేరవేయటంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
కేసీఆర్  ప్రెస్‌మీట్‌ను కూడా హైకోర్టు ఆర్డర్‌లో చేర్చడం ద్వారా సిట్‌ ఉనికిని హైకోర్టు ధర్మాసనం ప్రశ్నించింది. “ఈ కేసుకు సంబంధించి ఆధారాలు, మెటీరియల్‌.. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఎలా చేరాయి?” అని హైకోర్టు ప్రశ్నించింది. వీటిని ఎవరు, ఎప్పుడు, ఎలా అందజేశారన్న అంశం ఇప్పటికీ మిస్టరీగానే ఉందని తెలిపింది.
 
 ‘‘ఏ చట్టం ప్రకారం, లేదా ఏ నిబంధనల ప్రకారం ఆధారాలు మొత్తం ముఖ్యమంత్రికి చేరాయో సిట్‌ గానీ, ప్రభుత్వం గానీ వివరించలేదు. దీని వెనుక ఉన్న థియరీ ఏమిటో తెలియదు. ఈ కేసులో ఫిర్యాదుదారైన ఎమ్మెల్యే పైలట్‌ రోహిత్‌రెడ్డియే ఆధారాలను సీఎంకు ఇచ్చి ఉండవచ్చు అనే వాదనకు నిరూపణ లేదు’’ అని హైకోర్టు వ్యాఖ్యానించడం గమనార్హం. 
 
ఈ కేసులో ఫిర్యాదుదారుడైన తాండూర్ ఎమ్యెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఈ విషయంలో కేసీఆర్ ను కాపాడటం కోసం తానే ఆ సమాచారం అంతా సీఎంకు ఇచ్చానని చెప్పిన్నప్పటికీ హైకోర్టు పరిగణలోకి తీసుకోవడం లేదు. అంత తక్కువ వ్యవధిలో ఫిర్యాదుదారుడికైనా అవన్నీ ఎట్లా వచ్చాయి? అని నిలదీసింది. 
 
 అసలు.. డిఫ్యాక్టో కంప్లైనెంట్‌ అయిన రోహిత్‌రెడ్డికి ఏ దశలో, సీఆర్పీసీలోని ఏ సెక్షన్ల కింద ఆధారాలు మొత్తం అందజేశారో ప్రభుత్వం తరఫు న్యాయవాదులు తెలపలేదని హైకోర్టు పేర్కొంది. పైగా అంత తక్కువ సమయంలో ఆడియోలు, వీడియోలు వంటి పలు రకాల ఆధారాలను రోహిత్‌రెడ్డికి ఎలా అందజేశారో చెప్పలేదని తెలిపింది. 
 
పోలీసుల దర్యాప్తులో భాగంగా సేకరించిన సాక్ష్యాలు ముఖ్యమంత్రి ప్రెస్‌మీట్‌లో ఎలా ప్రత్యక్షమయ్యాయనే విషయంపై ప్రభుత్వ న్యాయవాదులు వివరణ ఇవ్వలేదని ధర్మాసనం గుర్తు చేసింది. ఎవిడెన్స్‌ మెటీరియల్‌ లీకేజీపై ప్రతివాదులు చాలా తెలివిగా వ్యూహాత్మక మౌనం పాటించారని పేర్కొంది. ఎవిడెన్స్‌లను ముఖ్యమంత్రి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తితోపాటు అన్ని రాష్ట్రాల చీఫ్‌ జస్టి్‌సలకు పంపించారని గుర్తు చేసింది. 
 
 ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడం తీవ్ర నేరమైనప్పటికీ చట్టంలో పేర్కొన్న నిబంధనలు, ప్రొసీజర్‌ ఉల్లంఘనకు గురయ్యాయా, లేదా అన్న అంశాన్ని ప్రధానంగా పరిశీలించాల్సి ఉందని హైకోర్టు స్పష్టం చేయడం గమనార్హం. ముఖ్యమంత్రి ప్రెస్‌మీట్‌లో మాట్లాడిన అంశాలపై తాము ఎలాంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం లేదని, అయితే ఆధారాలు పబ్లిక్‌ డొమైన్‌లో పెట్టిన తీరు మాత్రం నిందితుల హక్కులకు భంగం కలిగించేదేనని తెలిపింది. 
 
ఈ కేసుకు సంబంధించిన మొత్తం ఘటనలు క్రిమినల్‌ లా ప్రాథమిక సూత్రాలకు విరుద్ధంగా జరిగాయని కూడా నిర్ధారించింది. .దర్యాప్తు సంస్థ తన పరిధి దాటి వ్యవహరించిందని హైకోర్టు తేల్చి చెప్పడం ద్వారా సిట్ పనితీరుపై ఆక్షేపణ వ్యక్తం చేసిన్నట్లయింది. కోర్టుకు ఇవ్వాల్సిన డాక్యుమెంట్లను పబ్లిక్‌ చేశారని హైకోర్టు మండిపడింది.
“ఈ కేసుకు సంబంధించిన సాక్ష్యాలను సీఎం కేసీఆర్‌కు ఎవరు ఇచ్చారో చెప్పడంలో సిట్ విఫలమైంది. ఇన్వెస్టిగేషన్ అధికారుల దగ్గర ఉండాల్సిన ఆధారాలన్నీ మీడియాకి ప్రజల వద్దకు వెళ్లిపోయాయి. దర్యాప్తు సమాచారాన్ని మీడియాతో సహా ఎవరికీ చెప్పకూడదు. దర్యాప్తు ప్రారంభ దశలోనే కీలక ఆధారాలు బహిర్గతమయ్యాయి. సిట్ చేసిన ఇన్వెస్టిగేషన్ ఫేర్ ఇన్వెస్టిగేషన్‌లాగా అనిపించలేదు. దర్యాప్తు ఆధారాలు బహిర్గతం చేయడం వల్ల విచారణ సక్రమంగా జరగదు.” అని ధర్మాసనం అభిప్రాయపడింది.
 
 హైకోర్టు ఆర్డర్ కాపీ బుధవారం చేరడంతో సిబిఐ లాంఛనంగా ఈ కేసును చేపట్టిన్నట్లయింది. ఇక సిట్ నుండి కేసుకు సంబంధించిన సమాచారం అంతా స్వాధీనం చేసుకోనుంది. ఇక ఏక్షణం అయినా ఎఫ్ఐఆర్ ఫైల్ చేసే అవకాశం ఉంది. మోయినాబాద్ పోలీస్ స్టేషన్ నుంచి సీబీఐ వివరాలు సేకరించి, తన సొంత దర్యాప్తుకు శ్రీకారం చుట్టనున్నది. 
హైకోర్టు ఉత్తరువులో కేసీఆర్ ప్రెస్ మీట్ ను ప్రముఖంగా ప్రస్తావించడంతో సీబీఐ దర్యాప్తులో భాగంగా కేసీఆర్ ను సహితం విచారించే అవకాశం ఉన్నట్లు తెలుస్తున్నది. అయితే కేసీఆర్ ను కాపాడటం కోసమా అన్నట్లు కేసీఆర్ కు ఆ సమాచారం అంతా తానే ఇచ్చినట్లు ఏ ఈ కేసులో ఫిర్యాదుదారుడైన తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి చెబుతున్నారు.
మరోవంక, ఎమ్మెల్యేల కొనుగోలు కేసు సీబీఐ బదిలీపై తెలంగాణ   అప్పిల్ పిటిషన్ వేసేందుకు సిద్ధమవుతున్నది. సింగిల్ బెంచ్ తీర్పును సవాల్ చేస్తూ.. రేపు హైకోర్టు డివిజన్ బెంచ్‌లో పిటిషన్ వేయనుంది. ఈ కేసు చూపి కేంద్రంలోని బిజెపి ప్రభుత్వాన్ని గడగడలాడించాలని కేసీఆర్ అనుకున్నారు. అయితే రంగంలోకి సిబిఐ,  ఈడీ దిగుతారని అంచనా వేయలేకపోయారు. దానితో దీని వెనుక ఉన్న కుట్ర, కుతంత్రాలు, ఇందులో సంబంధం గల వారి చీకటి వ్యవహారాలు  అన్ని ఇప్పుడు బైటపడి అవకాశం ఏర్పడింది.