తెలంగాణాలో బిజెపి యుపి ఎత్తుగడలు… 10 వేల గ్రామాలలో సభలు

వచ్చే ఎన్నికలలో తెలంగాణాలో అధికారంలోకి రావాలని పట్టుదలతో పనిచేస్తున్న బిజెపి నాయకత్వం గత ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో అమలు చేసిన వ్యూహాన్ని ఇక్కడ అమలు చేసేందుకు సిద్ధం అవుతోంది. ప్రజాగోస -బీజేపీ భరోసా యాత్ర పేరుతో మరోసారి ప్రజల్లోకి వెళ్లడం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా బీజేపీ అనుకూల వాతావరణం ఏర్పడేటట్లు చూసేందుకు సమాయత్తం అవుతున్నారు.

భరోసా కార్యక్రమంలో 10 వేల గ్రామాల్లో సభలు నిర్వహించాలని  నిర్ణయించారు. ఉత్తర ప్రదేశ్ ఎన్నికలలో బిజెపి వ్యూహాన్ని రూపొందించి, అమలు పరచిన అప్పటి ఆ రాష్ట్ర ఇంచార్జ్, ప్రస్తుతం బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్ బన్సల్ ఇప్పడు తెలంగాణాలో సహితం బిజెపి ప్రచార వ్యూహాన్ని రూపొందిస్తున్నారు. ఆయనే స్వయంగా పర్యవేక్షిస్తున్నారు.

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో రెండు సార్లు అధికారంలోకి రావడానికి అత్యంత కీలకమైన బైక్ ర్యాలీలను ఇప్పటికే తెలంగాణలో కూడా చేపట్టింది. 28 నియోజకవర్గాల్లో ప్రజాగోస -బీజేపీ భరోసా పేరుతో బైక్ ర్యాలీలు నిర్వహించింది. ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా జనవరి 20 నుంచి ప్రజాగోస బీజేపీ భరోసా పేరుతో మరోసారి ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్దమయింది.

అయితే ఈసారి గ్రామీణ ప్రాంతాలే లక్ష్యంగా ప్రజల్లోకి బీజేపీ వెళ్లనుంది. మొత్తం 10వేల గ్రామాల్లో పార్టీ గ్రామ సభలు నిర్వహించి ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్తామని ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు.

బీజేపీ భరోసా యాత్రలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వ విజయాలు, కేంద్ర ప్రభుత్వ పథకాలు, కేసీఆర్ వైఫల్యాలను ప్రజలకు తెలియజేయాలని బీజేపీ నాయకులు చెబుతున్నారు. కార్యక్రమంలో గ్రామీణ యువత ఎక్కువగా పాల్గొనేలా ప్రణాళిక రూపొందిస్తున్నారు.  కేసీఆర్ సర్కారుపై వ్యతిరేకతతో ఉన్న ప్రజలను  గ్రామ సభలతో తమవైపు తిప్పుకుంటామని బీజేపీ నేతలు చెబుతున్నారు.

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఇదే విధంగా గ్రామసభలు నిర్వహించి రెండోసారి అధికారంలోకి వచ్చింది బీజేపీ. ఉత్తర ప్రదేశ్ లో గ్రామ సభల బాధ్యత అంతా బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ సునీల్ బన్సల్ పర్యవేక్షించారు. అక్కడ విజయవంతం కావడంతో తెలంగాణలో కూడా ఉత్తర ప్రదేశ్ ప్రణాళికను అమలు చేసేందుకు బీజేపీ సిద్ధమౌతోంది.

పైగా, బిజెపికి మద్దతు ఎక్కువగా పట్టణ ప్రాంతాల నుండే వస్తున్నది. గ్రామీణ ప్రాంతాలలో మద్దతుదారులు ఉన్నప్పటికీ తగు యంత్రాంగం లేదు. ఈ కార్యక్రమం ద్వారా ఆ లోటు భర్తీ చేయడంపై దృష్టి సారిస్తున్నారు.

15 నుంచి గద్వాలలో మోదీ  పేరుతో జాతీయ క్రికెట్ టోర్నీ

ఇలా ఉండగా, ఈనెల 15వ తేదీ నుంచి గద్వాలలో జాతీయ స్థాయి క్రికెట్ టోర్నమెంట్ జరగనున్నట్లు బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ తెలిపారు. ఆజాది కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమంగా భాగంగా క్రికెట్ పోటీలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు.   ప్రధాని మోదీ పేరుతో కప్ ఇస్తున్నట్లు ప్రకటించారు. తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో టోర్నమెంట్ జరగబోతోందని డీకే అరుణ తెలిపారు. దేశంలోని 20 రాష్ట్రాలతో పాటు  విదేశాల నుంచి కూడా టీమ్స్ వస్తాయని ఆమె వివరించారు.