దలైలామాపై గూఢచర్యం అనుమానంతో చైనా మహిళా అరెస్ట్ 

టిబెట్‌కు చెందిన ఆధ్యాత్మిక, రాజకీయ గురువు దలైలామాపై గూఢచర్యం చేస్తున్నట్లు అనుమానించిన చైనా మహిళను బీహార్‌ పోలీసులు ఎట్టకేలకు అదుపులోకి తీసుకున్నారు. ఆమె కార్యకలాపాల గురించి ప్రశ్నిస్తున్నారు. వార్షిక సందర్శనలో భాగంగా బీహార్‌లోని బుద్ధ గయను దలైలామా గురువారం సందర్శించారు. ఉదయం ‘కాల చక్ర’ మైదానంలో జరిగిన సభలో ఆయన ప్రసంగించారు. ప్రసంగం స్థలం వద్దనే ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

కరోనా నేపథ్యంలో మూడేళ్ల తర్వాత జరుగుతున్న ఈ వార్షిక పర్యటనలో భాగంగా ఈ నెల 31 వరకు మూడు రోజుల పాటు ఆధ్మాత్మిక బోధనలు, ప్రసంగాలు చేయనున్నారు. దలైలామాపై గూఢచర్యం కోసం చైనాకు చెందిన మహిళ సాంగ్‌ జియోలాన్‌ గత రెండేళ్లుగా గయలో ఉంటున్నట్లు స్థానిక పోలీసులకు సమాచారం అందింది.

దీంతో ఆ మహిళ గురించి బుధవారం వెతకగా ఆమె ఆచూకీ లభించలేదు. ఈ నేపథ్యంలో అన్ని విభాగాలను అలెర్ట్‌ చేశారు. స్పైగా అనుమానిస్తున్న ఆ చైనా మహిళ స్కెచ్‌, వీసా, పాస్‌పోర్ట్‌ వివరాలను మీడియాకు విడుదల చేశారు.

. ఆ మహిళ కోసం వెతకగా చివరకు పోలీసులకు చిక్కింది. దీంతో ఆమెను గయ పోలీస్‌ స్టేషన్‌కు తీసుకెళ్లి వివరాల గురించి ఆరా తీస్తున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో దలైలామాకు కేంద్ర బలగాలతో భద్రత కల్పించారు. ఆయన బస, బోధనలు చేసే ప్రాంగణంలో వందలాది సీసీటీవీ కెమేరాలు ఏర్పాటు చేశారు.