ప్రధాని మోదీ మాతృమూర్తి హీరాబెన్‌ మృతి

ప్రధాని నరేంద్ర మోడీకి మాతృవియోగం కలిగింది. మోడీ తల్లి హీరాబెన్ కన్నుమూశారు. రెండు రోజుల క్రితం ఆమె అనారోగ్యానికి గురికావడంతో అహ్మదాబాద్‌లోని యు.ఎన్‌.మెహతా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కార్డియాలజీ అండ్‌ రీసెర్చ్‌ సెంటర్‌ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతున్న హీరాబెన్‌ ఆరోగ్యం విషమించడంతో ఇవాళ ఉదయం తుదిశ్వాస విడిచారు.

 ఇటీవలే హీరాబెన్ వందో పుట్టినరోజు జరుపుకున్నారు. అస్వస్థతకు గురైన హీరాబెన్​ ఆస్పత్రిలో కోలుకుంటున్నట్లు యూఎన్ మెహతా ఆస్పత్రి వర్గాలు గురువారం రాత్రే ప్రకటించాయి. అనారోగ్యంతో బాధపడుతున్న హీరాబెన్ బుధవారం ఆస్పత్రిలో చేర్పించిన సంగతి తెలిసిందే. ఆమె ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకున్న ప్రధాని మోదీ.. హుటాహుటిన ఆస్పత్రికి వెళ్లి తన తల్లితో మాట్లాడారు. దాదాపు గంటన్నర సేపు ఆమె వద్దే ఉన్నారు. ఆ తర్వాత ఢీల్లికి వెళ్లారు. 

మాతృమూర్తి మరణంతో ప్రధాని మోడీ  ఢిల్లీ నుంచి అహ్మదాబాద్‌ బయల్దేరారు. మరోవైపు ఈరోజు తాను పాల్గొనాల్సిన కార్యక్రమాలన్నింటినీ మోడీ రద్దు చేసుకున్నట్లు తెలుస్తోంది.  ఇటీవల గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో పోలింగ్ కేంద్రానికి వచ్చిన ఆమె ఓటు హక్కు కూడా వినియోగించుకున్నారు.

గాంధీనగర్‌లోని శ్మశానవాటికలో ప్రధాని మోదీ తల్లి హీరాబెన్ అంత్యక్రియలు నిర్వహించారు.ప్రధాని మోదీ తన తల్లి అంత్యక్రియల చితికి నిప్పంటించి, చేతులు జోడించి అంతిమ నివాళులు అర్పించారు. సోదరుడు సోమాభాయ్,ఇతర కుటుంబ సభ్యులతో కలిసి ప్రధాని మోదీ తల్లి అంత్యక్రియలు జరిపారు. అంత్యక్రియలు జరిగుతున్న ఘటనాస్థలికి రావద్దని కుటుంబసభ్యులకు స్థలం ఇవ్వాలని బీజేపీ కార్యకర్తలను ప్రధాని కోరారు.

తన తల్లి మరణంపై నరేంద్ర మోదీ భావోద్వేగ ట్వీట్ చేశారు. తన తల్లి ఫొటోను షేర్ చేస్తూ నిండునూరేళ్లు పూర్తి చేసుకుని ఈశ్వరుడి చెంతకు చేరిందని  భావోద్వేగానికి గురయ్యారు. 

“దేవుడి పాదాల వద్ద అద్భుతమైన శతాబ్ధం ఉంది. సన్యాసి జీవితం, నిస్వార్థ కర్మయోగి, విలువలకు కట్టుడి ఉండే జీవితం వంటి త్రిమూర్తి లక్షణాలు అమ్మలో ఉన్నాయి. 100వ పుట్టిన రోజు సందర్భంగా నేను అమ్మను కలిసినప్పుడు ఆమె ఓ విషయం చెప్పింది. తెలివితో పని చేయండి, స్వచ్చతతో జీవించండి అని చెప్పారు. ఆ విషయాన్ని నేను ఎప్పుడూ గుర్తుంచుకుంటాను” అంటూ మోదీ  ట్విట్టర్‌లో పేర్కొన్నారు. 

హీరాబెన్‌ మోదీ మృతిపట్ల పలువురు సంతాపం తెలిపారు. కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌, రాజ్యసభలో విపక్షనేత, కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, గుజరాత్ సీఎం భూపేంద్ర పాటిల్‌, మధ్యప్రదేశ్‌ సీఎం శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌, అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ, ఉత్తరప్రదేశ్‌ సీఎం యోగీ ఆదిత్యనాథ్‌, కేంద్ర మాజీ మంత్రి, డెమోక్రటిక్‌ ఆజాద్‌ పార్టీ చైర్మన్‌ గులాం నబీ ఆజాద్‌, కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ వాద్రా సంతాపం తెలిపారు. హీరాబెన్‌ మృతిపట్ల దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.‘ ‘ప్రధాని నరేంద్ర మోదీ తల్లి హీరాబెన్ మరణ వార్త చాలా బాధాకరం. ఈ క్లిష్ట సమయంలో మోదీకి, అతని కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను’’ అని రాహుల్ గాంధీ ట్వీట్‌లో పేర్కొన్నారు