తెలంగాణాలో 90 సీట్ల గెలుపుకై బిజెపి `మిషన్ 90′

తెలంగాణలో గెలుపే లక్ష్యంగా అడుగులు వేస్తున్న బిజెపి  వచ్చే ఎన్నికలలో 90 సీట్లు గెలుపొందాలని అంటూ  “మిషన్ 90” పేరుతో ఓ భారీ లక్ష్యాన్ని ఆ పార్టీ శ్రేణుల ముందు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బి ఎల్ సంతోష్ ఉంచారు. అన్ని సీట్లు గెలిచి అధికారంలోకి వచ్చే దిశగా వ్యూహరచనలు చేస్తున్నట్లు స్పష్టం చేశారు. 

తెలంగాణలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన బీజేపీ కన్వీనర్లు, ఇంఛార్జీలు, విస్తారక్ లు, పాలక్ లతో గురువారం సమావేశమైన సంతోష్ రాష్ట్రంలో పార్టీ బలోపేతం, అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలుపు కోసం అనుసరించాల్సిన కార్యాచరణపై దిశానిర్ధేశం చేశారు. 

రాబోయే ఎనిమిది నెలల్లో ఎన్నికలు రావచ్చని చెబుతూ మిషన్ 90 పై దృష్టి సారిస్తూ బూత్ కమిటీల ఏర్పాటుపై ఫోకస్ పెట్టాలని చెప్పారు. పార్టీ సంస్థాగత నిర్మాణం చేయాలని పేర్కొంటూ ముఖ్యనేతలంతా నియోజకవర్గాల్లో పర్యటించి కార్నర్ మీటింగ్ పెట్టాలని సూచించారు.

 ప్రతి నియోజకవర్గంలో పార్టీ కార్యాలయాలు ప్రారంభించాలని చెప్పారు. వచ్చే మూడు నెలల్లోపు ఉద్యమ కార్యచరణ సిద్ధం చేసుకోవాలని సూచించారు. వారానికి ఓ సారి మండలం, 15 రోజులకోసారి జిల్లా, నెలకోసారి రాష్ట్ర స్థాయిలో సమావేశమై ఆందోళన కార్యక్రమాలకు రూపకల్పన చేయాలని బీఎల్ సంతోష్ స్పష్టం చేశారు

బీఆర్ఎస్ సర్కార్ వైఫల్యాలు, కేసీఆర్ అవినీతి, కుటుంబ పాలన గురించి ప్రజలకు వివరించేందుకు చేపట్టాల్సిన కార్యక్రమాల గురించి ప్రణాళిక రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. 

జనవరి 15 నుంచి ప్రతిరోజు రెండు అసెంబ్లీ నియోజకవర్గాల్లో పర్యటిస్తానని, ఫిబ్రవరి 13,14వ తేదీల్లో ప్రధాని నరేంద్ర మోదీని రాష్ట్రానికి  ఆహ్వానించి పెద్ద ఎత్తున పోలింగ్ బూత్‌లపై సమ్మేళనం నిర్వహిస్తామని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రకటించారు.  జనవరి 7న బూత్ కమిటీలతో జాతీయ బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా వర్చువల్ సమావేశం నిర్వహించనున్నారు.

119 నియోజకవర్గాలకు పాలక్ లు 

119 అసెంబ్లీ నియోజకవర్గాలకు పాలక్‌లుగా ముఖ్య నేతలను నియమించారు. వీరంతా నెలలో మూడు రోజుల పాటు నియోజకవర్గాల్లోనే ఉండనున్నారు. నియోజకవర్గాల స్థితిగతులపై ఎప్పటికప్పుడు రాష్ట్ర నాయకత్వానికి నివేదిక ఇవ్వనున్నారు. పలువురు మాజీ మంత్రులు, మాజీ ఎంపీలు, సీనియర్లను పాలక్ లను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ నియమించారు. శేరిలింగంపల్లి పాలక్‌గా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, మేడ్చల్ పాలక్‌గా ఎంపీ లక్ష్మణ్, కుత్బుల్లాపూర్‌కు డీకే అరుణ పాలక్‌గా నియమితులయ్యారు.

జుక్కల్ నియోజకవర్గానికి వివేక్ వెంకటస్వామిని పాలక్‌గా నియమించారు. ఎల్లారెడ్డికి రఘునందన్, రామగండం, మహబూబ్‌నగర్‌ల పాలక్‌గా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, పఠాన్ చెరుకు మురళీధర్ రావు, చేవెళ్లకు జితేందర్ రెడ్డి, పరిగికి విజయశాంతి,  మెదక్‌కు ధర్మపురి అర్వింద్, ఇతర ముఖ్య నేతలకు పాలక్‌లుగా బాధ్యతలు బీజేపీ రాష్ట్ర నాయకత్వం అప్పగించింది.

జనవరి 5,6,7వ తేదీలలో ఆయా నియోజకవర్గాలకు బీజేపీ పాలక్‌లు వెళ్లనున్నారు. పాలక్‌లు ప్రతి నెలా మూడు రోజుల పాటు వారికి కేటాయించిన నియోజకవర్గాల్లో పర్యటించేలా రూట్‌మ్యాప్ సిద్దం చేసింది. ఫుల్ టైం వారికి కేటాయించిన నియోజకవర్గాల్లో పనిచేయాసేలా కార్యాచరణ సిద్దం చేశారు, బీజేపీ బూత్ కమిటీలను పూర్తి చేయాల్సిన బాధ్యత పాలక్‌లకు అప్పగించింది.