యాదాద్రీశుడిని దర్శించుకున్న రాష్ట్రపతి ముర్ము

యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారిని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శుక్రవారం దర్శించుకున్నారు. యాదాద్రీశుడికి ప్రత్యేక పూజలు చేశారు. యాదగిరిగుట్ట పర్యటనలో భాగంగా శుక్రవారం ఉదయం యాదాద్రికి చేరుకున్న రాష్ట్రపతికి మంత్రులు ఇంద్రకరణ్‌ రెడ్డి, జగదీశ్‌ రెడ్డి, సత్యవతి రాథోడ్‌, కార్యనిర్వాహక అధికారి గీత పుష్పగుచ్చాలతో ఆహ్వానం పలికారు.

ఆలయం వద్ద అర్చకులు, అధికారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం గర్భాలయంలో స్వయంభువు లక్ష్మీ నరసింహస్వామివారిని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దర్శించుకున్నారు. దర్శనానంతరం రాష్ట్రపతికి ఆలయ ప్రధాన అర్చకులు వేదాశీర్వచనం అందిచంగా, మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి, ఆలయ అధికారులు స్వామివారి చిత్రపటం, తీర్థ ప్రసాదాలను అందజేశారు.

తర్వాత యాదాద్రి ప్రధాన ఆలయ పరిసరాలను రాష్ట్రపతి పరిశీలించారు. అద్దాల మండపం, ఫొటో ఎగ్జిబిషన్‌ను తిలకించారు. రాష్ట్రపతి వెంట గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ ఉన్నారు. కాగా, యాదగిరిగుట్టను సందర్శించిన ఐదో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కావడం గమనార్హం.రాష్ట్రపతితో పాటు గవర్నర్ తమిళి సై సౌదర రాజన్ యాదాద్రికి వచ్చారు.

శీతాకాల విడిది కోసం హైదరాబాద్ కు వచ్చిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన  ఇవాళ్టితో  ముగియనుంది. గత మూడు రోజుల నుంచి ద్రౌపది ముర్ము వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈనెల 26వ తేదీన హైదరాబాద్ కు వచ్చారు. బొల్లారంలోని యుద్ధ స్మారకం దగ్గర నివాళులర్పించారు. 

డిసెంబర్ 27న నారాయణగూడలోని కేశవ్ మెమోరియల్ విద్యా సంస్థను సందర్శించి విద్యార్థులు, ఫ్యాకల్టీతో సమావేశమయ్యారు. డిసెంబర్ 28న భద్రాచలం సీతారామచంద్ర స్వామిని దర్శించుకున్నారు. ప్రసాద్ పథకాన్ని ప్రారంభించారు. అనంతరం వరంగల్ లోని రామప్ప ఆలయాన్ని దర్శించారు. 

డిసెంబర్ 29న నారాయణమ్మ కాలేజ్ ను సందర్శించారు. సాయంత్రం శంషాబాద్, ముచ్చింతల్ లోని రామానుజాచార్య విగ్రహాన్ని సందర్శించారు. ఇవాళ యాదగిరిగుట్టు లక్ష్మీ నరసింహస్వామి దర్శనం తర్వాత తిరిగి హైదరాబాద్ కు రానున్నారు. మధ్యాహ్నం ఒంటి గంటకు బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో ఏర్పాటు చేసిన విందులో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పాల్గొననున్నారు.