
సాంకేతిక ప్రయోజనాలు మారుమూల ప్రాంతాలకు, పేదలలోని నిరుపేదలకు చేరాలని, దీనిని సామాజిక న్యాయ సాధనంగా ఉపయోగించుకోవాలని భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము సూచించారు. హైదరాబాద్‌లోని జి. నారాయణమ్మ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ ఫర్ ఉమెన్ విద్యార్థులు, అధ్యాపకులను ఉద్దేశించి, బిఎమ్ మలానీ నర్సింగ్ కళాశాల, మహిళా దక్షతా సమితికి చెందిన సుమన్ జూనియర్ కళాశాల విద్యార్థులను ఉద్దేశించి ఆమె ప్రసంగించారు.
కంప్యూటర్లు, వైద్య పరికరాలు, ఇంటర్నెట్, స్మార్ట్ పరికరాలు డిజిటల్ చెల్లింపు వ్యవస్థలతో సహా సాంకేతిక పురోగతిలో ఇంజనీరింగ్ రంగం పెద్ద పాత్ర పోషించిందని రాష్ట్రపతి చెప్పారు. ఊహాతీతమైన, గతంలో లేని సమస్యలకు సత్వర, సుస్థిరమైన పరిష్కారాలు అవసరమయ్యే నేటి ప్రపంచంలో ఒక వృత్తిగా ఇంజనీరింగ్ పాత్ర చాలా క్లిష్టమైనదని ఆమె తెలిపారు.
ప్రపంచాన్ని మెరుగైన నివాసయోగ్య ప్రదేశం గా మార్చే శక్తి ఇంజనీర్లకు ఉందని చెబుతూ వారు కనుగొనే పరిష్కారాలు,భవిష్యత్తులో వారు రూపొందించే సాంకేతికతలు ప్రజల జీవన నాణ్యత ఆధారితంగా, పర్యావరణ అనుకూలమైనవిగా ఉండాలని ముర్ము సూచించారు. ఇటీవల కాప్ 27లో, భారతదేశం పుడమిని ఓ సురక్షిత గ్రహంగా ఉంచే తన భవిష్య దృష్టి కోణాన్ని పర్యావరణ హిత జీవన శైలి అనే ఒక పద మంత్రంలో పునరుద్ఘాటించిందని ఆమె గుర్తు చేశారు.
మనం మన వాతావరణ లక్ష్యాలను సాధిస్తున్నామని, వాటిని ఉన్నతీకరణ చేస్తున్నామని చెబుతూ మనం పునరుత్పాదక శక్తి, ఇ-మొబిలిటీ, ఇథనాల్-మిశ్రమ ఇంధనాలు, హరిత హైడ్రోజన్‌లో కొత్త ప్రయత్నాలను చేస్తున్నామని ఆమె గుర్తు చేశారు. ఈ కార్యక్రమాలు సాంకేతిక ఆవిష్కరణల ద్వారా పర్యావరణ పరంగా మెరుగైన ఫలితాలను సాధించవచ్చని ఆమె అభిలాష వ్యక్తం చేశారు.
నేటి ప్రపంచంలో సాంకేతికత సామాజిక, ఆర్థిక, రాజకీయ, విద్యా, పర్యావరణ, భౌగోళిక రాజకీయ కోణాలను కలిగి ఉందని రాష్ట్రపతి చెప్పారు. ఇది నిరంతరం అభివృద్ధి చెందుతోందని, ప్రతి రంగాన్ని ప్రభావితం చేస్తుందని ఆమె తెలిపారు. ఇంజనీర్లు వినూత్న సాంకేతికతలతో ప్రజల ప్రయోజనాల కోసం ముందుకు వస్తారని, ప్రజల జీవన నాణ్యతను మెరుగుపరుస్తారని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు.
వెనుకబడిన వర్గాలు, వృద్ధులు, దివ్యాంగులు, ప్రత్యేక మద్దతు అవసరమయ్యే ఇతర వ్యక్తుల కోసం ఇంజనీరింగ్ పరిష్కారాల గురించి కూడా ఆలోచించాలని ఆమె మార్గదర్శనం చేశారు. ఇంజినీరింగ్, క్నాలజీలో మహిళల పాత్ర గురించి రాష్ట్రపతి ప్రస్తావిస్తూ, పెద్ద కంపెనీలకు నాయకత్వం వహిస్తున్న, స్టార్టప్‌లను ప్రారంభించి, టెలికాం, ఐటీ, ఏవియేషన్ యంత్రాల రూపకల్పన, నిర్మాణ పనులు, కృత్రిమ మేధస్సు వంటి అన్ని రంగాలలో ప్రధానమైన నాయకత్వ స్థానాలను అధిరోహించి సహకరిస్తున్న ఎందరో స్ఫూర్తిదాయకమైన మహిళల ఉదాహరణలు మనకు ఉన్నాయని ఆమె గుర్తు చేశారు.
సైన్స్ శాఖలను చేపట్టేందుకు మరింత మంది మహిళలు ముందుకు రావాల్సిన అవసరం ఉందని ఆమె ఉద్ఘాటించారు. సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, గణితం భారత ఆర్థిక వ్యవస్థకు చాలా ముఖ్యమైనవని ఆమె పేర్కొన్నారు. యువతులను సాంకేతిక నిపుణులుగా, ఆవిష్కర్తలుగా తీర్చిదిద్దడం ద్వారా దేశాన్ని పటిష్టమైన ఆర్థిక వ్యవస్థ వైపు నడిపించవచ్చని రాష్ట్రపతి తెలిపారు.
మహిళలు సాంకేతిక రంగాలలో విభిన్న దృక్కోణాన్ని, నైపుణ్యాలను కలిగి ఉంటారని చెబుతూ మహిళల గ్రహణ సామర్థ్యాలు వివిధ స్థాయిలలో జ్ఞానం, సాంకేతికతలను గ్రహించే శక్తి అధికంగా కలిగి ఉంటారని ఆమె చెప్పారు. మహిళలు తమకు ఎదురయ్యే సవాళ్లను అధిగమించి కెరీర్‌లో ఎదగాలని ఆమె సూచించారు.
విద్యార్థులు స్వయం సాధికారతతో పాటు ఇతరులకు కూడా సాధికారత కల్పించాలని రాష్ట్రపతి సూచించారు. కేవలం తమ విజయం, సంతోషాలతో సంతృప్తి చెందకూడదని చెబుతూ దేశం పట్ల, మొత్తం మానవాళి పట్ల వారికి కర్తవ్యం ఉందని ముర్ము స్పష్టం చేశారు. వారు తమ ప్రతిభను, సాంకేతిక సామర్థ్యాలను విస్తృత ప్రయోజనం కోసం ఉపయోగించాలని హితవు చెప్పారు.
More Stories
తెలంగాణలోని ఎనిమీ ప్రాపర్టీస్ పై మర్చిలోగా లెక్క తేల్చాలి
టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డిపై కేసు
భారత్ కు అమెరికా ఎఫ్-25 ఫైటర్ జెట్ లు .. చైనా, పాక్ కలవరం