రెండేళ్లలో 113 సార్లు భద్రతను పట్టించుకోని రాహుల్

రాహుల్ గాంధీకి స‌రైన రీతిలో సెక్యూర్టీ క‌ల్పించ‌డం లేద‌ని కాంగ్రెస్ పార్టీ చేసిన తీవ్ర ఆరోప‌ణ‌ల‌పై సెంట్ర‌ల్ రిజ‌ర్వ్ పోలీసు ఫోర్స్ ఘాటుగా స్పందించింది. కాంగ్రెస్ పార్టీ చేసిన ఆరోప‌ణ‌ల‌ను సీఆర్పీఎఫ్ ఖండించింది. ఇటీవ‌ల అనేక సార్లు రాహుల్ గాంధీయే సెక్యూర్టీ ఉల్లంఘ‌న‌ల‌కు పాల్ప‌డిన‌ట్లు సీఆర్పీఎఫ్ వెల్ల‌డించింది. ఈ విష‌యాన్ని ఆయ‌న‌కు ఎప్ప‌టిక‌ప్పుడు తెలియ‌జేసిన‌ట్లు కూడా సీఆర్పీఎఫ్ ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలిపింది.
2020 నుంచి రాహుల్ గాంధీ 113 సార్లు సెక్యూర్టీ ఆంక్ష‌ల‌ను ఉల్లంఘించిన‌ట్లు కేంద్ర రిజ‌ర్వ్ బ‌ల‌గాల శాఖ తెలిపింది. ఢిల్లీలో భార‌త్ జోడో యాత్ర సాగుతున్న స‌మ‌యంలో.. రాహుల్ గాంధీయే సెక్యూర్టీ మార్గ‌ద‌ర్శ‌కాల‌ను ఉల్లంఘించిన‌ట్లు పేర్కొన్న‌ది. మార్గ‌ద‌ర్శ‌కాల ప్ర‌కారం స‌హ‌క‌రిస్తేనే రాహుల్‌కు ర‌క్ష‌ణ ఉంటుంద‌ని సీఆర్పీఎఫ్ తెలిపింది.
కాంగ్రెస్ ఎంపీ హోదాలో ఉన్న రాహుల్ గాంధీకి ప్రస్తుతం జడ్ ప్లస్ సెక్యూరిటీ కల్పిస్తున్నారు. అయితే భారత్ జోడో యాత్రలో ఉన్న సమయంలోనూ ఆయన పక్కనే సీఆర్పీఎఫ్ భద్రతను కూడా కల్పిస్తున్నారు. కానీ భారత్ జోడో యాత్రలో తాజాగా పలుమార్లు భద్రతా ఉల్లంఘనలు చోటు చేసుకున్నట్లు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ కేంద్రానికి ఫిర్యాదు చేశారు.
డిసెంబ‌ర్ 24వ తేదీన ఢిల్లీలో జ‌రిగిన భార‌త్ జోడో యాత్ర‌లో సెక్యూర్టీ ఉల్లంఘ‌న జ‌రిగిన‌ట్లు కాంగ్రెస్ పార్టీ కేంద్ర హోంశాఖ మంత్రికి ఆయన లేఖ రాశారు. యాత్ర‌కు వ‌చ్చిన భారీ జ‌నాన్ని పోలీసులు ఆప‌లేక‌పోయిన‌ట్లు ఆ లేఖ‌లో ఆరోపించారు.  దీంతో సీఆర్పీఎఫ్ దీనిపై స్పందిస్తూ రాహుల్ కు ప్రస్తుతం పూర్తిస్ధాయిలో భద్రత కల్పిస్తున్నట్లు కేంద్రానికి తెలిపింది.
ఎక్కడికక్కడ రాష్ట్ర పోలీసులతో, భద్రతా సంస్ధలతో సమన్వయం చేసుకుంటూ ఈ భద్రత కల్పిస్తున్నట్లు పేర్కొంది. అదే సమయంలో రాహుల్ గాంధీ సీఆర్పీఎఫ్ సూచించిన భద్రతా నిబంధనల్ని పలుమార్లు పాటించడం లేదని, ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘిస్తున్నట్ల కూడా హోంశాఖకు రాసిన లేఖలో సీఆర్పీఎఫ్ తెలిపింది.
 2020 నుంచి చూసుకుంటే ఇప్పటివరకూ ఇలాంటి 113 ఉల్లంఘనలు చోటు చేసుకున్నట్లు హోంశాఖకు వెల్లడించింది. వీటిపై రాహుల్ ను ఎప్పటికప్పుడు హెచ్చరిస్తున్నట్లు కూడా తెలిపింది. దీనిపై సీఆర్పీఎఫ్ తరఫున చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొంది. దీంతో రాహుల్ తాము చెప్పిన నిబంధనలు పాటించకుండా, జోడో యాత్రకు భద్రత అడుగుతున్నట్లు చెప్పకనే చెప్పినట్లయింది.