దలైలమాకు బుద్ధగయలో ఓ చైనా మహిళ నుండి ముప్పు!

ప్రస్తుతం బీహార్ లోని బుద్ధగయ పర్యటనలో ఉన్న భారత్‌లో ప్రవాస జీవితం గడుపుతున్న టిబెట్‌కు చెందిన ఆధ్యాత్మిక, రాజకీయ గురువు దలైలామాకు ఓ చైనా మహిళ నుండి ముప్పు ఏర్పడే అవకాశం ఉందని పోలీసులు అప్రమత్తమయ్యారు. 

గురువారం నుండి అక్కడ పర్యటిస్తున్న అయన ఉదయం ‘కాల చక్ర’ మైదానంలో జరిగిన సభలో  ప్రసంగించారు. కరోనా నేపథ్యంలో మూడేళ్ల తర్వాత జరుగుతున్న వార్షిక పర్యటనలో భాగంగా ఈ నెల 31 వరకు మూడు రోజుల పాటు ఆధ్యాత్మిక బోధనలు అందజేస్తారు. అంతకుముందు ప్రతి సంవత్సరం ఇక్కడికి వచ్చి, ఉపన్యాసాలు ఇస్తూ ఉండేవారు.

అయితే, దలైలామా భద్రతకు ముప్పు కలిగించేందుకు ఓ మహిళ కుట్ర పన్నినట్లు అనుమానం వ్యక్తమవుతోందని పోలీసులు వెల్లడించారు. ఆ మహిళ చైనా జాతీయురాలని, ఆమె పేరు సోంగ్ షియావోలన్ అని తెలిపారు. ఆమె రూపురేఖలతో కూడిన స్కెచ్‌ను కూడా విడుదల చేశారు.

గత రెండేళ్లుగా అనాధికారికంగా అక్కడ నివసిస్తున్న చైనా మహిళ సాంగ్ జియోలాన్‌ గురించి పోలీసులు వెతుకుతున్నారు. గూఢచారిగా  అనుమానిస్తున్న పోలీసులు ఆ చైనా మహిళ స్కెచ్‌, వీసా, పాస్‌పోర్ట్‌ వివరాలను మీడియాకు విడుదల చేశారు.

చైనా మహిళ సాంగ్‌ జియోలాన్‌ గత రెండేళ్లుగా గయలో ఉంటున్నట్లు తమకు తెలిసిందని  సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్  హర్‌ప్రీత్ కౌర్ తెలిపారు. అయితే దలైలామా గయ సందర్శన సందర్భంగా ఆ మహిళ గురించి వెతకగా ఆమె ఆచూకీ లభించలేదని చెప్పారు. ఈ నేపథ్యంలో అన్ని విభాగాలను అప్రమత్తం చేయడంతోపాటు ఆ చైనా మహిళ కోసం అన్ని చోట్ల సోదాలు చేస్తున్నట్లు వెల్లడించారు. 

ఆమె గత ఏడాదిగా గయతో పాటు దేశంలోని పలు ప్రాంతాల్లో నివసించినట్లు తెలిపారు. అయితే విదేశీ విభాగం రికార్డుల్లో ఆ చైనా మహిళ వివరాలు లేవని తెలిపారు. ఈ నేపథ్యంలో ఆమె చైనా గూఢచారి అనే అనుమానాన్ని తాము తోసిపుచ్చలేమని పేర్కొన్నారు.