2036 ఒలింపిక్స్‌ నిర్వహణకు భారత్ సిద్ధం

ఒలింపిక్స్‌ నిర్వహణకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని, 2036 ఒలింపిక్స్‌కు సంబంధించి భారత్‌ బిడ్‌ వేస్తుందని కేంద్ర క్రీడా శాఖ మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌వెల్లడించాయిరు. జీ-20 పగ్గాలు చేపట్టిన భారత్‌కు ఒలింపిక్స్‌ నిర్వహణ కూడా తెలుసునని ఆయన చెప్పారు. తయారీ, ఇతర రంగాలలో దూసుకుపోతున్న భారత్‌.. క్రీడలలో మాత్రం వెనుకబడి ఉండాల్సిన అవసరం లేదని ఆయన గుర్తు చేశారు.

‘భారత్‌కు ఇటీవలే జీ-20 సారథ్యం దక్కింది. దీనిని భారత్‌ విజయవంతంగా నిర్వహించగలిగినప్పుడు ఒలింపిక్స్‌ నిర్వహణ కూడా కష్టమేమీ కాదు. ఇండియన్‌ ఒలింపిక్‌ అసోసియేషన్‌ (ఐవోఏ)తో కలిసి ఆ దిశగా కృషి చేస్తాం..” అని తెలిపారు.

దీన్ని సాధించేందుకు ఇండియన్ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) కి రోడ్‌మ్యాప్ ఇస్తామని చెప్పారు. భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) క్రీడల నిర్వహణకు ప్రభుత్వం మద్దతు ఇస్తుందని పేర్కొంటూ గుజరాత్ రాజధాని అహ్మదాబాద్ ప్రపంచ స్థాయి క్రీడా మౌలిక సదుపాయాలతో ఆతిథ్య నగరంగా మారుతుందని ఠాకూర్ చెప్పారు.

గతంలో 1982 ఆసియా క్రీడలు, 2010 కామన్వెల్త్ క్రీడలకు భారత్ ఆతిథ్యం ఇచ్చిందని కేంద్ర మంత్రి గుర్తుచేశారు. ఇప్పుడు భారత్ ఒలింపిక్స్‌కు ఆతిథ్యం ఇవ్వడానికి సిద్ధమైందని తెలిపారు.

2032 వరకూ ఒలింపిక్స్‌ వేదికలు ఖరారై ఉన్నాయన్న విషయం తెలుసని అంటూ,   2036 ఒలింపిక్స్‌ కోసం భారత్ కచ్చితంగా బిడ్డింగ్‌ ప్రక్రియలో పాల్గొంటుందని విశ్వాసం వ్యక్తం చేశారు.  భారత్‌లో కొంతకాలంగా క్రీడలకు కేంద్ర ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తున్నదని పేర్కొంటూ  ఒలింపిక్స్‌ నిర్వహణను ఘనంగా చేపడతామనే నమ్మకముందని తెలిపారు. 

`తయారీ, సేవలు వంటి రంగాలలో భారత్‌ అగ్రస్థానంలో ఉంది. ప్రతీ రంగంలోనూ భారత్‌ పేరు మార్మోగి పోతున్నప్పుడు క్రీడల్లో మాత్రం ఎందుకు వెనుకబడాలి? 2036 ఒలింపిక్స్‌ బిడ్‌ కోసం భారత్ తీవ్రంగా కృషి చేస్తోంది’ అని తెలిపారు.

కాగా, ఒలింపిక్స్‌కు ఆతిథ్యం ఇవ్వడానికి గుజరాత్ రాష్ట్రం చాలాసార్లు ఆసక్తి చూపిందని, అక్కడ హోటళ్ళు, హాస్టల్స్, ఎయిర్‌పోర్ట్‌, స్పోర్ట్స్ కాంప్లెక్స్ వంటి మౌలిక సదుపాయాలు ఎన్నో ఉన్నాయని చెప్పారు. గుజరాత్‌లో ఒలింపిక్స్‌ నిర్వహించేందుకు సిద్ధమని ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తన మేనిఫెస్టోలో ప్రస్తావించింది.