యువతలో కొత్త ఆశలు నింపిన మోదీ ఆధ్వర్యంలోని సంస్కరణలు 

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సారథ్యంలో ప్రభుత్వం తీసుకువచ్చిన సంస్కరణలు యువతలో కొత్త ఆశలను నింపాయని కేంద్ర సైన్స్-టెక్నాలజీ శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు. దేశ యువత భవిత కోసం ప్రభుత్వం గత ఎనిమిదిన్నర ఏళ్లలో అనేక మార్గాలను సృష్టించిందని పేర్కొన్నారు. 

ఉత్తరప్రదేశ్ గజ్రౌలాలోని వెంకటేశ్వర యూనివర్సిటీలో “కొత్త యువ వోటర్లతో సంవాదం” పేరిట జరిగిన కార్యక్రమంలో డాక్టర్ జితేంద్ర సింగ్ మాట్లాడుతూ, ప్రపంచ దేశాల కూటమిలో భారతదేశ ఖ్యాతి పెరిగిందని, భారతదేశాన్ని అర్థం చేసుకోవడానికి, అనుసంధానం కావడానికి ప్రపంచం మొత్తం ఇప్పుడు ఆసక్తిగా చూస్తోందని చెప్పారు.

ప్రపంచం మొత్తం భారతదేశ యువతవైపు ఆశాభావంతో చూస్తోందని. ఎందుకంటే యువతే దేశానికి అభివృద్ధి ఛోదక శక్తి అని, భారతదేశం ప్రపంచ వృద్ధికి ఛోదకశక్తి అని ప్రధాని నరేంద్ర మోదీ ఒక యువ స్నాతకోత్సవ కార్యక్రమంలో చేసిన వ్యాఖ్యలను కేంద్రమంత్రి ఈ సందర్భంగా ఉటంకించారు. 

విశాల దృక్పథానికి, భావిస్ఫోరక కార్యక్రమాలకు, ప్రగతిశీల అభిప్రాయాలకు నవభారతదేశం ప్రసిద్ధి చెందిందని ఆయన చెప్పారు, మన దేశ అభివృద్ధి యువత భుజస్కందాలపై ఆధారపడి ఉందని స్పష్టం చేశారు. అనేక దశాబ్దాలుగా దేశంలో అస్థిర ప్రభుత్వాలు, సంకీర్ణ ప్రభుత్వాలు ఉన్నాయని, ఇవి భారత భవిష్యత్తుపై ప్రజల్లోనే కాకుండా ప్రపంచత దేశాల్లో కూడా భయాందోళనలకు కారణమయ్యాయని జితేంద్ర సింగ్ యువ ఓటర్లకు గుర్తు చేశారు.

కానీ, 2014లో, భారతదేశంలోని ప్రజలు స్థిరమైన ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారని, విధానాల్లో పని సంస్కృతిలో ఈ ప్రభుత్వం సుస్థిరతను తీసుకువచ్చిందని, మార్పుకు బలమైన పునాది వేసిందని చెప్పారు.  2015 స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో ఎర్రకోట నుంచి “స్టార్ట్-అప్ ఇండియా స్టాండ్ అప్ ఇండియా” కోసం ప్రధాని మోదీ  పిలుపునిచ్చారని, దీనితో భారతదేశం భవిష్యత్తు దార్శనికతకు పూర్తి విశ్వసనీయత ఏర్పడిందని కేంద్ర మంత్రి గుర్తు చేశారు.

దీని ఫలితంగా భారతదేశంలో 2014లో కేవలం 350గా ఉన్న స్టార్టప్‌ల సంఖ్య 2022లో 85 యునికార్న్‌ స్థాయి సంస్థలతో కలసి మొత్తం 80,000కి పెరిగిందని తెలిపారు. “ఈ శతాబ్దాన్ని భారతదేశం వశం చేయడానికి, మనదేశ యువత విద్యతో పాటు నైపుణ్యంలోనూ సమానంగా ప్రావీణ్యం పొందడం అత్యవసరం” అని డాక్టర్ జితేంద్ర సింగ్ చెప్పారు.

యువత నైపుణ్యాభివృద్ధికి, కొత్త సంస్థల ఏర్పాటుకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని మంత్రి తెలిపారు. 1950లో దేశంలో తొలి పారిశ్రామిక శిక్షణా సంస్థ (ఐ.టి.ఐ.) నిర్మాణం తర్వాత ఏడు దశాబ్దాల్లో కేవలం 10 వేల ఐ.టి.ఐ.లు మాత్రమే ఏర్పాటయ్యాయని, అయితే, గత ఎనిమిదేళ్ల మోదీ ప్రభుత్వ హయాంలో దేశ వ్యాప్తంగా దాదాపు 5 వేల ఐ.టి.ఐ.లు ఏర్పడ్డాయని చెప్పారు. 

గత 8 సంవత్సరాల్లో ఐ.టి.ఐ.లో 4 లక్షలకు పైగా కొత్త సీట్లు అందుబాటులోకి వచ్చాయని కేంద్రమంత్రి తెలిపారు. భారతదేశ పారిశ్రామిక విజయంలో పారిశ్రామిక శిక్షణా సంస్థల పాత్ర గొప్పదని చెబుతూ  కోడింగ్, కత్రిమ మేధోపరిజ్ఞానం (ఎ.ఐ.), రోబోటిక్స్, త్రీడీ ప్రింటింగ్, డ్రోన్ సాంకేతక పరిజ్ఞానం, టెలీమెడిసిన్ వంటి కొత్త కోర్సులను ఐ.ఐ.టి.లు అందిస్తున్నన్నందుకు సంతోషం వ్యక్తం చేశారు.