కరోనా ప్రమాద ఘడియలు …రానున్న 40 రోజులు భారత్‌కు కీలకం

కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. చైనాలో  కరోనా కేసులు రోజు రోజుకీ పెరుగుతుండటంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది.  ప్రస్తుతం దేశంలో ఎక్కడా పెద్దగా కరోనా కేసులు నమోదు కానప్పటికీ, వచ్చే జనవరి నెల మధ్య కాలం నాటికి కరోనా మహమ్మారి విజృంభించే అవకాశం ఉన్నది.
బుధవారం కేంద్ర ఆరోగ్యశాఖ వర్గాలే స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించాయి. గతంలో కరోనా విజృంభించిన తీరును బట్టి వచ్చే జనవరి మాసం మధ్యలో కేసులు పెరిగే అవకాశం ఉందని ఆరోగ్యశాఖ అంచనా వేసినట్లు ఆ శాఖ వర్గాలు పేర్కొన్నాయి. జనవరిలో కరోనా వైరస్‌ విజృంభించే అవకాశాలు ఉన్న నేపథ్యంలో రానున్న 40 రోజులు చాలా కీలకమని తెలిపాయి.
 “ఇంతకు ముందు కరోనా వేవ్ తూర్పు ఆసియాను తాకిన 30-35 రోజుల తర్వాత భారతదేశంలో వైరస్ వ్యాప్తి మొదలవ్వడం గమనించవచ్చు… ఇది ఒక ట్రెండ్‌. దీని ప్రకారం జనవరిలో కేసులు పెరిగే అవకాశం ఉంది” అని ఆరోగ్య శాఖ అధికారులు పేర్కొన్నారు. అయితే, ఇన్‌ఫెక్షన్ తీవ్ర తక్కువగా ఉంటుందని, ఒక వేళ నాలుగో వేవ్ వచ్చినా ఆస్పత్రులు చేరే బాధితులు, మరణాలు కూడా స్వల్పంగా ఉంటాయని స్పష్టం చేశారు.  
 
దానితో  చైనా, జపాన్‌, దక్షిణకొరియా లాంటి దేశాల్లో కరోనా విజృంభిస్తుండటంతో దేశంలో అదే పరిస్థితి వస్తే ఎదుర్కోవడానికి భారత్ సిద్ధమైంది. అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో పరిస్థితిని అదుపులో పెట్టేలా ఏర్పాట్లు చేశారు. బుధవారం కూడా దుబాయ్‌ నుంచి తమిళనాడుకు వచ్చిన ఇద్దరిలో కరోనా మహమ్మారిని గుర్తించారు.
చెన్నై ఎయిర్‌పోర్టులో వారి శాంపిల్స్‌ సేకరించి జీనోమ్‌ సీక్వెన్సింగ్‌ కోసం పంపించారు. ఈ రెండు కేసులతో కలిపి డిసెంబర్‌ 24 నుంచి 26 మధ్య దేశంలో కరోనా బారినపడిన అంతర్జాతీయ ప్రయాణికుల సంఖ్య 39కి చేరింది. మొత్తం 498 విమానాల నుంచి 1780 మంది శాంపిల్స్‌ సేకరించారు. అందులో 39 మందికి కరోనా పాజిటివ్‌ వచ్చింది.
ఈ క్రమంలో మహమ్మరి కట్టడికి కేంద్రం  మరిన్ని కీలక సూచనలతో పాటు, హెచ్చరికలనూ జారీ చేసింది. మాస్క్ లు తప్పనిసరిగా ధరించాలని, శానిటైజర్లు వాడాలని చెప్పింది. రానున్న 40 రోజులు మరింత అప్రమత్తంగా ఉండాలని, కరోనా  నిబంధనలు పాటిస్తూ వ్యక్తిగత శుభ్రత పాటించాలని కేంద్రం సూచించింది.
ఐదు దేశాల ప్రయాణికులపై ప్రత్యేక ఆంక్షలు 
విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులు పెద్ద సంఖ్యలో కరోనా వైరస్ బారిన పడుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఐదు దేశాల నుంచి వచ్చే ప్రయాణికుల కోసం కొత్త నియమ నిబంధనలను కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రవేశ పెడుతున్నది. చైనా, జపాన్, దక్షిణ కొరియా, హాంకాంగ్, థాయ్‌లాండ్ దేశాల నుంచి భారత్‌కు వచ్చే వారికి ఆర్టీపీసీఆర్ నెగెటివ్ రిపోర్టులను తప్పనిసరి చేయనుంది. 
 
ఇప్పటికే ఎయిర్ సువిధ వ్యవస్థను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇందులో తమ వివరాలన్నింటినీ పొందుపర్చాల్సి ఉంటుందని తెలిపింది. విదేశాల నుంచి భారత్‌కు వచ్చే ప్రతి ప్రయాణికుడు కూడా ఎయిర్ సువిధలో తమ వివరాలను రిజిస్టర్ చేయించుకోవాల్సి ఉంటుంది.
ప్రస్తుతం పలు దేశాల్లో కరోనా కేసులకు ఒమిక్రాన్ సబ్-వేరియంట్ బీఎఫ్.7గా భావిస్తున్నారు. ఈ రకం వేరియంట్ వ్యాప్తి తీవ్రత చాలా అధికమని, ఒకరి నుంచి 18 మంది వరకూ వ్యాపిస్తుందని అధికార వర్గాలు పేర్కొన్నాయి.