శివాజీ చరిత్ర నుండి నేర్చుకున్నాడు , దానిలో జీవించలేదు

“ఛత్రపతి శివాజీ చరిత్ర నుండి నేర్చుకున్నాడు. కానీ చరిత్రలో జీవించలేదు” అని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) ప్రచార ప్రముఖ్  సునీల్ అంబేకర్ తెలిపారు. “ఛత్రపతి శివాజీ పాలనా యంత్రాంగం: ఆధునిత భారత్ కు పాఠాలు” అంశంపై  సంస్కృత అధ్యయన కేంద్ర, శ్రీ శివాజీ స్ఫూర్తి కేంద్రంల  ఆధ్వర్యంలో,  భారతీయ చరిత్ర పరిశోధన మండలి మద్దతుతో జరిగిన జాతీయ సదస్సులో ఆయన కీలక ప్రసంగం చేశారు.

ఆదిల్షాహీ పాలనతో పోరాడిన తర్వాత, శివాజీ మొత్తం పాలనా వ్యవస్థను మార్చారని అంబేకర్ తెలిపారు. స్వాతంత్య్రానంతరం వలస పాలకులు ఏర్పర్చిన వ్యవస్థలను మార్చడానికి సుదీర్ఘకాలం పడుతున్నదని గుర్తు చేస్తూ వలస రాజరిక మనస్తత్వాన్ని తిరస్కరించడానికి నేటికీ కూడా శివాజీ అనుసరించిన పరిపాలన విధానం సహేతుకమైనదే అని ఆయన స్పష్టం చేశారు. మన సంస్థలు,  సంస్కృతిపై శివాజీ ముద్రలు అలాగే ఉన్నాయని చెప్పారు. 

శ్రీ శైలంలో ఛత్రపతి శివాజీని అధ్యయనం చేయడానికి అంతర్జాతీయ కేంద్రం ఏర్పాటు చేయాలని న్యూఢిల్లీలోని భారతీయ సాంస్కృతిక సంబంధాల మండలి అధ్యక్షులు డాక్టర్ వినయ్ ప్రభాకర్ సహస్రబుద్ధే సూచించారు. మరాఠా సామ్రాజ్యాన్ని విస్తరించడంలో సహాయపడిన శివాజీ అమలు చేసిన పాలనా సూత్రాల నుండి ప్రపంచ సమాజం నేర్చుకోవాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. 
 
శివాజీ అనుసరించిన పాలనా విధానాల కారణంగా భారతదేశంలో సంవత్సరాల తరబడి విజయవంతంగా  ఆ సామ్రాజ్యం పాలించిందని ఆయన తెలిపారు. శివాజీ తనకు లభించిన అధికారంతో సొంత ప్రయోజనాలు పొందకుండా, ఉపభోగ్శూన్య స్వామి సూత్రాలను అనుసరించి తన రాజ్యాధికారంలో లోతైన ధర్మకర్తత్వ విధానాన్ని అనుసరించాడని ఆయన పేర్కొన్నారు.  శివాజీ సమానత్వ ఆలోచన, సైనిక నైపుణ్యం, రైతులకు, సామాన్య ప్రజలకు అనుకూలమైన న్యాయమైన ఆదాయ వ్యవస్థలలో ప్రావీణ్యం సంపాదించాడని ఆయన వివరించారు.  కానీ ఎప్పుడు ఉచితాలుగా భావించేటట్లు చేయలేదని చెప్పారు. 
 
భారతదేశంలోని గణనీయమైన భాగాన్ని ప్రోత్సహించి, మరాఠా రాజ్యాన్ని స్థాపించిన గొప్ప పరిపాలకుడు చత్రపతి శివాజీ మహారాజ్ వ్యూహాన్ని అధ్యయనం చేయవలసిన అవసరం ఉందని ముగింపు ప్రసంగం చేస్తూ డా. అనిరుద్ దేశ్‌పాండే తెలిపారు. శివాజీ గురించి చాలా సాహిత్యం అందుబాటులో ఉందని పేర్కొంటూ, ప్రజల పట్ల అత్యున్నత స్థాయి భక్తి కలిగిన పాలకుడు అని చెప్పారు.  స్వరాజ్యం కోసం శివాజీ జరిపిన రాజీలేని కృషి నేటికీ అనుసరణీయమని చెబుతూ ఆధునిక పాలనా నిర్వహణలో శివాజీ నుండి ఎన్నో అనుభవాలను నేర్చుకోవలసి ఉందని స్పష్టం చేశారు. 

శ్రీ శైలంలో శ్రీ శివాజీ స్ఫూర్తి కేంద్రంలో రెండు రోజుల పాటు  జరిగిన ఈ సదస్సులో వివిధ ప్రాంతాల నుండి 85 మందికి పైగా ప్రతినిధులు హాజరయ్యారు.   సంస్కృత ఫౌండేషన్ అధ్యక్షుడు, మాజీ ఐఏఎస్ అధికారి డా. సి ఉమామహేశ్వరరావు, శివాజీ స్ఫూర్తి కేంద్ర వ్యవస్థాపక సభ్యుడు రఘురామయ్య తదితరులు కూడా ప్రసంగించారు.
 
“శివాజీ పాలనా యంత్రాంగం,  పౌరసేవల వ్యవస్థ” అంశంపై జరిగిన సదస్సులో  పూణేలోని భండార్కర్ ఓరియంటల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (బిఓఆర్ఐ)కి చెందిన డా. ఎస్ ఎల్ బా పట్ మాట్లాడుతూ మొదట శివాజీ ‘వాటనాదారి’ (జాగీర్దారి’) వ్యవస్థను ‘వేటనాదారి’గా మార్చడం ప్రారంభించాడని, ఇది రాష్ట్ర ఉద్యోగుల లాంటి వ్యవస్థ అని తెలిపారు. ఆ తర్వాత అతను భాష ‘శుద్ధి’ చేపట్టి పర్షియన్ పదాల స్థానంలో సంస్కృత పదాలతో 1100 పదాల అధికారిక నిఘంటువు తయారు చేశారని చెప్పారు.  ఒక ప్రజల భాషను మార్చడం వారి ‘జాతీయత’ని మార్చినట్లే అని గ్రహించి, మరాఠీ భాష పునర్-భారతీకరణ ఓ ముఖ్యమైన చర్య అని వివరించారు. 
 
భోపాల్ కు చెందిన గిరీష్ జోషి ప్రసంగిస్తూ ప్రజలకు సమర్థవంతమైన సేవలందించడమే ఛత్రపతి శివాజీ పాలన లక్ష్యమని అని పేర్కొన్నారు.  శివాజీ అలా చేయడం దైవిక సేవ అని, సనాతన విలువలు, విశ్వాసాన్ని పునరుద్ధరించాలనే దేవుని సంకల్పాన్ని అమలు చేయడానికి అతను ఒక సాధనమని చెప్పారు.  పాలనలో  పారదర్శకత పాటిస్తూ వృద్ధులను, రోగులను, వికలాంగులను ఆదుకున్నాడని, బంధుప్రీతి అనేడిదే లేదని స్పష్టం చేశారు. అన్నింటికంటే, అందరికీ న్యాయమైన పాలన అందించారని తెలిపారు.
బిలాస్‌పూర్‌లోని జిజి యూనివర్శిటీకి చెందిన డాక్టర్ ప్రధాన్ మాట్లాడుతూ ఆధునిక హిందూ స్వరాజ్యాన్ని సృష్టించిన ఘనత శివాజీకి దక్కుతుందని తెలిపారు. సమ్మిళిత ప్రజాస్వామ్యం ఛత్రపతి శివాజీ మంత్రంగా కనిపిస్తుందని పేర్కొంటూ అతను సమర్థవంతమైన పాలన కోసం అధికార ఆదేశాల ముఖ్యమైన పొరను సృష్టించాడని చెప్పారు.
 
మొదటి భారత నౌకాదళం నిర్మాత  
“శివాజీ సైనిక వ్యూహం” అంశంపై  వైస్ అడ్మిరల్ మురళీధర్ పవార్ మాట్లాడుతూ  శివాజీ తన సైనిక ఉపకరణాన్ని అభివృద్ధి చేయడంలో అసాధారణమైన నైపుణ్యాన్ని కలిగి ఉన్నాడని,  సముద్ర వాణిజ్యాన్ని కాపాడటానికి కొంకణ్, గోవా తీరాల వెంబడి శక్తివంతమైన నౌకాదళ ఉనికిని స్థాపించాడని వివరించారు. శివాజీ నిర్మించిన  శక్తివంతమైన నౌకాదళం కారణంగా మరాఠాలు బ్రిటిష్, పోర్చుగీస్, డచ్‌లకు వ్యతిరేకంగా నిలబడగలిగారని చెప్పారు.
 
 శివాజీ సురక్షితమైన తీరం విలువను, పశ్చిమ కొంకణ్ తీరప్రాంతాన్ని నౌకాదళ దాడుల నుండి రక్షించవలసిన అవసరాన్ని అర్థం చేసుకున్నాడని చెప్పారు. శక్తివంతమైన నౌకాదళాన్ని సృష్టించడం ద్వారా తన సామ్రాజ్యాన్ని పటిష్టం చేయడానికి, రక్షించడానికి ప్రణాళిక వేసుకున్నాడని పేర్కొన్నారు. కళ్యాణ్, భివండి, గోవా వంటి నగరాల్లో, శివాజీ వాణిజ్యం , యుద్ధ నౌకాదళం నిర్మాణం కోసం నౌకలను నిర్మించారని తెలిపారు. 
 
 అనేక సముద్ర కోటలు, స్థావరాలను కూడా నిర్మించాడని చెబుతూ దక్కన్‌లోని ఎనిమిది లేదా తొమ్మిది ఓడరేవులను స్వాధీనం చేసుకున్న తర్వాత, విదేశీయులతో వ్యాపారం చేయడం ప్రారంభించాడని వివరించారు.