మహిళా సాధికారతతోనే దేశ సమగ్ర వికాసం

దేశ సమగ్ర వికాసానికి మహిళా సాధికారత అవసరమని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తెలిపారు. ఏకలవ్య ఆదర్శ పాఠశాలల ద్వారా గిరిజనులకు నాణ్యమైన విద్య అందుతున్నదని చెప్పారు. భద్రాచలం పర్యటనలో భాగంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాములవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపిన అనంతరం సమ్మక్క, సారలమ్మ గిరిజన పూజారుల సమ్మేళనంలో పాల్గొన్నారు. 
 
ఈ సందర్భంగా ఏకలవ్య ఆదర్శ పాఠశాలలను వర్చువల్‌గా ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ తెలంగాణలో తన పర్యటన తీపి జ్ఞాపకంగా మిగులుతుందని చెప్పారు. భద్రాద్రి రాముడి దర్శనం ఆధ్యాత్మిక అనుభూతిని కలిగించిందని తెలిపారు. ‘నా తెలంగాణ కోటి రతనాల వీణ’ అన్న దాశరథి వ్యాఖ్యలను రాష్ట్రపతి ప్రస్తావించారు.
 
రామాయణంలో భద్రాచలానికి ప్రత్యేక అనుబంధం ఉందని రాష్ట్రపతి చెప్పారు. సీతారాములు, లక్ష్మణుడు ఇక్కడ కొంతకాలం గడిపారని తెలిపారు. ఆధ్యాత్మిక కేంద్రాలకు వచ్చేవారి సంఖ్య బాగా పెరుగుతున్నదని వెల్లడించారు. ఆధ్యాత్మిక క్షేత్రాల అభివృద్ధికి పర్యాటకశాఖ దృష్టి సారించిందని పేర్కొన్నారు. గిరిజనుల అభివృద్ధికి వనవాసి కల్యాణ పరిషత్‌ ఎంతో కృషి చేస్తున్నదని రాష్ట్రపతి కొనియాడారు.
 
గిరిజన బిడ్డ రాష్ట్రపతి కావడం మనకు గర్వకారణమని మంత్రి సత్యవతి రాథోడ్‌ తెలిపారు. ఆసిఫాబాద్‌, మహబూబాబాద్‌ జిల్లాల్లో ఏకలవ్య పాఠశాలల ఏర్పాటు హర్షణీయమని చెప్పారు. గురుకుల స్కూళ్ల ద్వరా పిల్లలకు నాణ్యమైన విద్య అందుతున్నదని ఆమె వెల్లడించారు.
భద్రాద్రి స్వామివారిని దర్శించుకున్న రాష్ట్రపతి
తొలుత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము భద్రాద్రి రామయ్యను దర్శించుకున్నారు. ప్రధాన ఆలయంలో శ్రీసీతారామచంద్ర స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. అంతకు ముందు ఆలయం వద్ద రాష్ట్రపతికి ఆలయ అర్చకులు, అధికారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. దర్శనానంతరం రాష్ట్రపతికి అర్చకులు స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. 
 
శ్రీలక్ష్మి తాయారు అమ్మవారి ఆలయంలో వేద పండితుల చేత వేదాశీర్వచనం అందించి స్వామివారి జ్ఞాపిక శాలువాతో రాష్ట్రపతిని ఆలయ అర్చకులు ఘనంగా సత్కరించారు. భద్రాద్రి రామయ్య సన్నిధిలో భారత రాష్ట్రపతికి సీతారామచంద్ర స్వామి వారి జ్ఞాపికను మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అందజేశారు. 
 
అనంతరం రామాలయంలో ఏర్పాటు చేసిన ప్రసాద్ పథకంలో భాగంగా సుమారు రూ.41 కోట్లతో చేపట్టనున్న అభివృద్ధి పనుల శిలాఫలకాన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆవిష్కరించారు. ఆమెవెంట గవర్నర్‌ తమిళిసై, మంత్రులు పువ్వాడ అజయ్‌, సత్యవతి రాథోడ్‌ ఉన్నారు.
 
రామప్ప ఆలయాన్ని దర్శించుకున్న రాష్ట్రపతి
 
ములుగు జిల్లాలోని ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు పొందిన రామప్ప ఆలయాన్ని బుధవారం భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దర్శించుకున్నారు. అంత‌కు ముందు రాష్ట్రప‌తికి ఆల‌య అధికారులు, అర్చ‌కులు పూర్ణ‌కుంభంతో స్వాగ‌తం ప‌లికారు. రామప్పలో రుద్రేశ్వర స్వామిని దర్శించుకున్నారు. 
 
అనంత‌రం భద్రకాళి ప్రధాన పూజారి శేషు ప్ర‌త్యేక పూజ‌లు నిర్వహించారు. ములుగు జిల్లా రామప్ప పర్యటనలో భాగంగా హెలిప్యాడ్ కి చేరుకున్న రాష్ట్ర‌ప‌తికి మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్యే సీతక్క, ములుగు జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య, ఐటిడిఏ పీఓ అంకిత్, ములుగు ఎస్పీ సంగ్రామ్ సింగ్ జి పాటిల్ ఘ‌న స్వాగ‌తం ప‌లికారు. 
 
రాష్ట్రపతి వెంట తెలంగాణ రాష్ట్ర గవర్నర్ శ్రీమతి తమిళి సై సౌందర్య రాజన్, కేంద్ర సహాయ మంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రివర్యులు శ్రీమతి సత్యవతి రాథోడ్, తదితరులు ఉన్నారు.