నేటి నుండి బీజేపీ పార్లమెంట్ విస్తారక్ ల సమావేశం

2024 లోక్ సభ ఎన్నికలలో దక్షిణాదిన అత్యధిక ఎంపీ సీట్లు గెలుపొందడంతో పాటు తెలంగాణాలో అధికారంలోకి రావడం కోసం ప్రత్యేక దృష్టి సారించిన బిజెపి ఆ దేశంలో  హైదరాబాద్ శివారులో రెండు రోజుల పాటు కీలక సమావేశాలు జరుపుతున్నారు. బీజేపీ పార్లమెంట్ విస్తారక్ (పూర్తి సమయ కార్యకర్తలు)ల సమావేశాలు బుధవారం నుండి జరుగుతున్నాయి.
శామీర్ పేటలోని ఓ రిసార్ట్ లో బుధవారం మధ్యాహ్నం 2 గంటలకు సమావేశాలు ప్రారంభం కానున్నాయి.   పార్టీ సంస్థాగత జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ గురువారం జరుగనున్న ముగింపు సమావేశాలకు హాజరుకానున్నారు. దక్షిణాది రాష్ట్రాలతో పాటు గోవా, అండమాన్ నికోబార్, లక్షద్వీప్, గుజరాత్, మహారాష్ట్ర, మధ్య ప్రదేశ్, యూపీకి చెందిన కొన్ని పార్లమెంట్ నియోజకవర్గాలకు చెందిన బీజేపీ విస్తారక్ లు ఇందులో పాల్గొననున్నారు.
మొత్తం 16  రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాలలకు చెందిన 92 మంది విస్తారక్ లు ఈ సమావేశాలకు హాజరు కానున్నారు. పార్టీని సంస్థాగతంగా ఎలా బలోపేతం చేయాలి? పార్లమెంట్ నియోజకవర్గాల్లోని బూత్ కమిటీలు, శక్తి కేంద్రాల పనితీరు, అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్టీ పటిష్టతకు ఏయే అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి?
విస్తారక్ ల బాధ్యతలు, విధులు, తమ పరిధిలోని నాయకులతో సంబంధాలు, సమన్వయంపై దిశా నిర్దేశం చేసేందుకు ఢిల్లీ నుంచి ఆరుగురు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శులు రానున్నారు. రాష్ట్ర సంస్థాగత, రాజకీయ వ్యవహారాల ఇంచార్జీలు సునీల్ బన్సల్, తరుణ్ చుగ్ తో పాటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కూడా  సమావేశాల్లో  పాల్గొననున్నారు.
మరోవంక, తెలంగాణలోని మొత్తం 119 అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన బీజేపీ కన్వీనర్లు, ప్రభారీలు(ఇంచార్జీలు), విస్తారక్ లు, పాలక్ లతో గురువారం మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు బీఎల్ సంతోష్​, సునీల్ బన్సల్, తరుణ్ చుగ్ ఇతర ముఖ్య నేతలు సమావేశం కానున్నారు.
రాష్ట్రంలో పార్టీని ఎలా బలోపేతం చేయాలి? అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలుపు కోసం ఎలాంటి కార్యాచరణ ఉండాలనే దానిపై చర్చించనున్నారు. బీఆర్ఎస్ సర్కార్ వైఫల్యాలు, కేసీఆర్ అవినీతి, కుటుంబ పాలనకు వ్యతిరేకంగా ప్రజల్లో చేపట్టాల్సిన ప్రోగ్రాంలపై ప్లాన్ రూపొందించనున్నారు. బీజేపీ చేరికల కమిటీ సమావేశం కూడా బుధవారం ఇక్కడే జరుగనుంది.
పార్టీలో చేరికలనువేగవంతం చేయడం, బూత్ నుంచి అసెంబ్లీ స్థాయి వరకు ప్రధాన పార్టీల ముఖ్య నాయకులను చేర్చుకోవడంపై ఇందులో చర్చించనున్నారు. బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులతో కూడా తరుణ్ చుగ్, సునీల్ బన్సల్ ప్రత్యేకంగా సమావేశం కానున్నారు.
ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో తీవ్ర ఆరోపణలు గుప్పించి ఎలాగైనా అరెస్టు చేసి, ఆయనను విచారించాలని తెలంగాణ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తున్న సమయంలో బీఎల్ సంతోష్ ఈ సమావేశాలకు హైదరాబాద్ కు రావడం ఆసక్తి కలిగిస్తున్నది. ఈ విషయమై సిట్ జారీచేసిన నోటీసులపై రాష్ట్ర హైకోర్టు  స్టే ఇవ్వడం, మరోవంక అసలు ఈ కేసును సీబీఐ దర్యాప్తుకు బదిలీ చేస్తూ హైకోర్టు ఆదేశాలు జారీచేయడం జరిగింది. ఇంకోవంక, ఈ కేసు దర్యాప్తులు ఈడీ కూడా రంగప్రవేశం చేయడంతో తెలంగాణ ప్రభుత్వ అంచనాలు, ప్రయత్నాలు తలకిందులయ్యాయి.