పైలెట్ రోహిత్ రెడ్డికి హైకోర్టులో ఎదురుదెబ్బ

ఫాంహౌస్ కేసులో బిఆర్ఎస్ ఎమ్మెల్యే  పైలెట్ రోహిత్ రెడ్డికి ఎదురుదెబ్బ తగిలింది. ఈడీ సమన్లపై స్టే ఇవ్వాలన్న రోహిత్ రెడ్డి అభ్యర్థనను హైకోర్టు తోసిపుచ్చింది. ఈ కేసులో మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు జస్టిస్ కె. లక్ష్మణ్ ధర్మాసనం నిరాకరించింది. కేసు తదుపరి విచారణను 5వ తేదీకి వాయిదా వేసింది.
 ఆ లోగా ఈడీ కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. రోహిత్ రెడ్డి తరఫున వైసీపీ ఎంపీ, సీనియర్ న్యాయవాది నిరంజన్ రెడ్డి వాదనలు వినిపించారు. పార్టీ మారాలని తనకు వంద కోట్ల ఆఫర్ ఇచ్చారని రోహిత్ రెడ్డి ధర్మాసనానికి చెప్పింది. ఆఫర్ చేశారే తప్ప డబ్బు ఇవ్వలేదని స్పష్టం చేశారు.
ఆర్థిక వావాదేవీలు జరగనందున కేసు ఈడీ పరిధిలోకి రాదని రోహిత్ రెడ్డి తరఫు లాయర్ వాదించారు. ఈడీ ఈసీఐఆర్ మనీలాండరింగ్ చట్టానికి విరుద్ధమని కోర్టుకు విన్నవించారు. వ్యక్తిగత వివరాల కోసం ఈడీ తనను వేధిస్తోందని ఆరోపించారు.
మరోవైపు మంగళవారం విచారణకు రావాలని ఎమ్మెల్యే రోహిత్ రెడ్డికి నోటీసులు ఇచ్చినా ఆయన గైర్హాజరయ్యారని ఈడీ కోర్టుకు తెలిపింది. దీంతో ఈ నెల 30న విచారణకు రావాలని మరోసారి నోటీసులు పంపినట్లు ఈడీ తరఫు న్యాయవాది ధర్మాసనానికి చెప్పారు.
రోహిత్ రెడ్డి తరఫున వాదనలు వినిపించిన లాయర్ తన క్లయింటు రెండుసార్లు ఈడీ విచారణకు హాజరయ్యారని న్యాయమూర్తికి చెప్పింది. సమన్లలో ఈడీ అడిగిన అన్ని వివరాలు సమర్పించినట్లు చెప్పారు. వ్యక్తిగత, కుటుంబ, ప్రయివేటు సమాచారాన్ని రాబట్టేందుకే ఈడీ తనను విచారిస్తోందని ఆయన ఆరోపించారు.
ఆ విచారణను నిలిపివేయాలని రోహిత్‌రెడ్డి హైకోర్టును కోరారు. ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయస్థానం ఈడీకి కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణను జనవరి 5వ తేదీకి వాయిదా వేసింది.