తెలంగాణ ఇంఛార్జీ డీజీపీగా అంజనీ కుమార్

తెలంగాణ ఇంఛార్జీ డీజీపీగా 1990 బ్యాచ్కు చెందిన అంజనీకుమార్ ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుత డీజీపీ మహేందర్ రెడ్డి పదవీకాలం డిసెంబర్ 31తో ముగియనుండటంతో అంజనీ కుమార్ కు ఇంఛార్జ్ బాధ్యతలు అప్పగించారు.

అంజనీ కుమార్ ఇప్పటిదాకా విజిలెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్, యాంటీ కరప్షన్ బ్యూరో డైరక్టర్ జనరల్‌గా ఉన్నారు. హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌గా కూడా పనిచేశారు. అడిషనల్ డీజీపీగా కూడా వ్యవహరించారు.  ఆయన బదిలీతో ఖాళీ అయిన ఏసీబీ డైరెక్టర్ జనరల్ పదవికి హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్న రవి గుప్తాను ఎంపిక చేశారు.

దీంతో పాటు విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్మెంట్ డీజీగా అదనపు బాధ్యతలు అప్పగించారు.  అడిషనల్ డీజీపీగా ఉన్న 1992 బ్యాచ్కు చెందిన డాక్టర్ జితేంద్రను హోం శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా నియమించారు. ఆయన ప్రిజన్ అండ్ కరెక్షనల్ సర్వీసెస్ డైరెక్టర్ జనరల్ గా అదనపు బాధ్యతలు ఇచ్చారు. తదుపరి ఆదేశాలు వెలువడే వరకు అదే స్థానంలో కొనసాగనున్నారు.

రాచకొండ సీపీగా ఉన్న 1995 బ్యాచ్ కు చెందిన మహేశ్ భగవత్ ను సీఐడీ అడిషనల్ డీజీపీగా నియమించారు. హైదరాబాద్ అడిషనల్ సీపీగా ఉన్న1997 బ్యాచ్ కు చెందిన దేవంద్రసింగ్ చౌహాన్ ను రాచకొండ కమిషనర్ గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. 

అడిషనల్ డీజీపీగా సేవలందిస్తున్న 1997 బ్యాచ్ కు చెందిన సంజయ్ కుమార్ జైన్ ను లాఅండ్ ఆర్డర్ అడిషనల్ డీజీపీగా నియమించారు. దీంతో పాటు స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ ఫైర్ సర్వీస్ డైరెక్టర్ జనరల్ గా అదనపు బాధ్యతలు అప్పగించారు.