ఉజ్బెకిస్థాన్‌ లో బాలల మృతితో యూపీలోని సిరప్ ఉత్పత్తి ఆపివేత

ఉజ్బెకిస్థాన్‌ లో భారత్‌లో తయారైన దగ్గు మందు తాగి తమ దేశానికి చెందిన 18 మంది చిన్నారులు మరణించారని ఫిర్యాదు రావడంతో ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని ప్ఫర్మ‌సీ కంపెనీ మారియ‌న్ బ‌యోటెక్ సంస్థ త‌యారు చేస్తున్న డాక్‌-1 మ్యాక్స్ ద‌గ్గు సిర‌ప్ ఉత్ప‌త్తిని నిలిపివేయాల‌ని ప్ర‌భుత్వం ఆదేశాలు జారీ చేసింది. 

ప్రొపైలీన్‌ గ్లైకాల్ ఉన్న డ్ర‌గ్స్‌ను మారియ‌న్ బ‌యోటెక్ సంస్థ త‌క్ష‌ణ‌మే ఉత్ప‌త్తిని ఆపేయాల‌ని ప్ర‌భుత్వం పేర్కొన్న‌ది. ఆ ద‌గ్గు మందు తాగిన చిన్నారులు శ్వాస‌కోస సంబంధిత వ్యాధుల‌తో బాధ‌ప‌డిన‌ట్లు తెలుస్తోంది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ‌శాఖ జోక్యం చేసుకోవ‌డంతో  సెంట్ర‌ల్ డ్ర‌గ్స్ స్టాండ‌ర్డ్ కంట్రోల్ ఆర్గ‌నైజేష‌న్, యూపీ డ్ర‌గ్స్ కంట్రోలింగ్ అండ్ లైసెన్సింగ్ అథారిటీలు డిసెంబ‌ర్ 27వ తేదీన మారియ‌న్ బ‌యోటెక్ కంపెనీలో త‌నిఖీలు చేప‌ట్టాయి. 

ప్లాంట్ నుంచి సేక‌రించిన శ్యాంపిళ్ల‌ను టెస్టింగ్ కోసం పంపించారు. కొన్ని నెల‌ల క్రితం గాంబియాలో కూడా మేడిన్ ఇండియా ద‌గ్గు సిర‌ప్‌లు తీసుకోవ‌డం వ‌ల్లే 76 మంది చిన్నారులు మృతిచెందిన విష‌యం తెలిసిందే. భారతీయ ఫార్మాస్యూటికల్స్ మరియన్ బయోటెక్ తయారుచేసిన ‘డాక్‌-1 మాక్స్‌’ సిరప్‌ తాగిన పిల్లలు తీవ్రమైన శ్వాసకోశ ఇబ్బందులతో మరణించినట్లు ఉజ్బెకిస్థాన్ ఆరోగ్య శాఖ వెల్లడించింది. 

అయితే, వైద్యుల సూచనలు తీసుకోకుండా ఎక్కువ మోతాదులో సిరప్‌ను తాగడం వల్లే ఇలా జరిగినట్టు తెలుస్తోంది. ఉత్తర్‌ ప్రదేశ్‌లోని నోయిడా‌లో కార్యకలాపాలు నిర్వహిస్తోన్న మరియన్ బయోటెక్  2012లో ఉజ్బెకిస్థాన్‌లో రిజిస్టరు చేయించుకుంది. ఉజ్బెకిస్థాన్‌ ప్రకటనపై భారత్ విచారణ ప్రారంభించింది.

 డాక్-1 మాక్స్ సిరప్‌‌ను ల్యాబొరేటరీలో పరీక్షించగా అందులో ఇథిలీన్ గ్లైకాల్ అనే విష రసాయం ఉన్నట్టు నిర్ధారణ అయ్యిందని ఉజ్బెకిస్థాన్ పేర్కొంది. ఈ దగ్గు మందును వైద్యుల సూచనలు తీసుకోకుండానే పిల్లల తల్లిదండ్రులు ఔషధ దుకాణాల్లో కొని అధిక మోతాదులో వాడినట్టు తెలిపింది.

‘‘అస్వస్థతతో పిల్లలు ఆస్పత్రిలో చేరడానికి 2 నుంచి 7 రోజుల ముందు ఈ సిరప్ వారితో తాగించారని గుర్తించాం. మోతాదుకు మించి రోజుకు మూడు నుంచి నాలుగుసార్లు 2.5 నుంచి 5 ఎంఎల్ సిరప్ ఇచ్చినట్టు తేలింది. జలుబు నుంచి ఉపశమనం కోసం దీనిని ఆ చిన్నారుల తల్లిదండ్రులు వినియోగించారు’’ అని ఉజ్బెకిస్థాన్ ఆరోగ్య శాఖ తన ప్రకటనలో వెల్లడించింది. 

18 చిన్నారులు ప్రాణాలు కోల్పోవడంతో డాక్స్ 1 మాక్స్ సిరప్‌లు, టాబ్లెట్స్‌ను తమ దేశంలోని అన్ని ఫార్మసీల నుంచి ఉపసంహరించింది. పరిస్థితిని సరైన సమయంలో అంచనా వేయడంలో విఫలమైన ఏడుగురు అధికారులను కూడా విధుల నుంచి తొలగించింది.

ఇక, ఈ ఆరోపణలపై సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్, యూపీ డ్రగ్స్ నియంత్రణ విభాగం, లైసెన్సింగ్ అథారటీలు సంయుక్తంగా విచారణ ప్రారంభించాయి. అటు, మరియన్ బయోటెక్ కంపెనీ తన తయారీ యూనిట్ నుంచి దగ్గు సిరప్ నమూనాలను సేకరించి పరీక్షలకు పంపామని, నివేదికల కోసం వేచి ఉన్నామని తెలిపింది. 

భారత్‌లో తయారైన దగ్గు మందు వాడి పిల్లలు చనిపోవడం ఈ ఏడాదిలో ఇది రెండోది. పశ్చిమాఫ్రికా దేశం గాంబియాలో మైడెన్‌ ఫార్మా తయారు చేసిన దగ్గు మందు తాగి 70 మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. అయితే, కేంద్ర ఆరోగ్య శాఖ నిర్వహించిన పరీక్షల్లో ఆయా దగ్గు, జలుబు మందుల్లో ఎలాంటి హానికారకాలు లేవని వెల్లడైంది. దీంతో భారత ఫార్మా ప్రతిష్టను దెబ్బతీసే లక్ష్యంతోనే ఆరోపణలు చేస్తున్నట్టు కేంద్ర సర్కారు పేర్కొనడం గమనార్హం.