జమ్ముకశ్మీర్‌లో ముగ్గురు ఉగ్రవాదులు హతం

జమ్ముకశ్మీర్‌లోని సిధ్రా ప్రాంతంలో ఉగ్రవాదులు, భద్రతా బలగాలకు మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు.

బుధవారం ఉదయం 7.30 గంటలకు సిధ్రా ప్రాంతంలోని ఓ ట్రక్కులో నక్కిన ముష్కరులు భద్రతా బలగాలపై కాల్పులు ప్రారంభించారు. ప్రతిగా సైనికులు జరిపిన ఎదురుకాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు చనిపోయారని జమ్ము ఏడీజీపీ ముకేశ్‌ సింగ్‌ చెప్పారు. వారిని గుర్తించాల్సి ఉందన్నారు.

బసంత్ గఢ్ ప్రాంతంలో మందుగుండు సామాగ్రి. డిటోనేటర్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎన్ కౌంటర్ స్థలంలో నిషేధిత ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా (ఎల్‌ఈటీ)కి చెందిన ఒక కోడెడ్ షీట్, ఒక లెటర్ ప్యాడ్ పేజీ కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

కాగా, ఉధంపూర్‌ జిల్లాలో భారీ ఉగ్రకుట్రను భగ్నం చేసిన ఒక రోజు తర్వాత ఈ ఎన్‌కౌంటర్‌ చోటుచేసుకోవడం గమనార్హం. సోమవారం ఉధంపూర్‌ జిల్లాలోని బసంత్‌గఢ్‌ ప్రాంతంలో 15 కిలోల ఐఈడీ, 400 గ్రాముల ఆర్డీఎక్స్‌, ఐదు డిటోనేటర్లు, 7.62 ఎంఎం కాట్రిడ్జ్‌లు ఏడింటిని భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే.