‘ఆస్కార్‌’ లిస్ట్ లో ‘ఆర్‌ఆర్‌ఆర్’లోని ‘నాటు నాటు’ పాట

ఎస్‌ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్‌చరణ్ హీరోలుగా తెరకెక్కిన ‘ఆర్‌ఆర్‌ఆర్’ ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ.1200 కోట్లకు పైగా వసూళ్లు చేసి పలు రికార్డులు సృష్టించింది. ఇప్పుడు ఆస్కార్స్‌లోని ‘బెస్ట్ ఓరిజినల్ సాంగ్’ విభాగంలో పోటీ పడేందుకు ‘ఆర్‌ఆర్‌ఆర్’లోని ‘నాటు నాటు’ సాంగ్ షార్ట్ లిస్ట్ కావడం విశేషం.
ఈ విభాగంలో ప్రపంచవ్యాప్తంగా మొత్తం 81 పాటలు పోటీపడగా  అందులో నుంచి టాప్ 15 పాటలను అవార్డుల కమిటీ ఎంపిక చేసింది. అందులో ‘నాటు నాటు’ పాటకి కూడా చోటు దక్కడం విశేషం. ఈ 15 పాటల నుంచి కేవలం 5 పాటలు మాత్రం ఆస్కార్స్ అఫిషీయల్ నామినేషన్స్‌కి అర్హత సాధిస్తాయి.
ఇక ఆస్కార్‌లో సత్తా చాటేందుకు ఆర్‌ఆర్‌ఆర్ మూవీతో కలిసి మొత్తం నాలుగు భారతీయ సినిమాలు నాలుగు విభాగాల్లో స్థానాలను దక్కించుకున్నాయి. ఉత్తమ అంతర్జాతీయ సినిమా విభాగంలో ‘లాస్ట్ ఫిల్మ్ షో’ (చెల్లో షో), బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ‘ఆర్‌ఆర్‌ఆర్’ నుంచి ‘నాటు నాటు’, ఉత్తమ డాక్యుమెంటరీ విభాగంలో ‘ఆల్ దట్ బ్రీత్స్’, ఉత్తమ షార్ట్ ఫిల్మ్ విభాగంలో ‘ది ఎలిఫెంట్ విష్పరర్’ ఈ జాబితాలో చోటు సంపాదించుకున్నాయి.
షార్ట్ లిస్ట్‌లో ఎంపికైన చిత్రాలకు జనవరి 12 నుంచి 17 వరకు ఓటింగ్ నిర్వహించనున్నారు. ఈ ఓటింగ్ ఆధారంగా జనవరి 24న ఆస్కార్ నామినేషన్‌లో నిలిచిన సినిమాలను ప్రకటిస్తారు. అనంతరం మార్చి 12న విజేతలకు ఆస్కార్ అవార్డులు అందజేస్తారు.
పాక్ నుండి తెలుగమ్మాయి చిత్రం 
ఇలా ఉండగా, పాకిస్థాన్ నుండి మొదటిసారిగా ఆస్కార్ అవార్డ్స్ లో అవార్డ్స్‌లో షార్ట్‌లిస్ట్ అయిన మొదటి పాకిస్తానీ చిత్రంగా తెలుగమ్మాయి నిర్మించిన  సినిమా ‘జాయ్ ల్యాండ్’ ఘనతను దక్కించుకుంది. ఈ చిత్రం ఆ దేశంలో అనేక ఇబ్బందులు, ఆటుపోట్లను ఎదుర్కొంది.
 
సినిమాపై తీవ్రమైన విమర్శలు రావడంతో ప్రభుత్వం కూడా నిషేధాన్ని విధించింది. అన్నింటిని దాటుకుని అకాడమీ అవార్డ్ కోసం ఈ మూవీ పోటీ పడుతోంది. ఈ సినిమాకు హైదరాబాద్ లో పుట్టిన తెలుగమ్మాయి అపూర్వ చరణ్ నిర్మాతగా వ్యహరించడం చెప్పుకోదగ్గ విశేషం.
 
అయితే, ఆమె కుటుంబం అమెరికాకు మారడంతో ఆమె అక్కడే పెరిగింది. ఆమె 20కిపైగా షార్ట్ ఫిలింస్‌ను నిర్మించింది. స్నేహితులు ద్వారా ఈ కథ గురించి ఆమెకు తెలిసింది. అనంతరం కథ, కథనాలు నచ్చడంతో సినిమా నిర్మించేందుకు అంగీకరించింది. 
 
ఈ చిత్రాన్ని తొలిసారిగా కాన్స్ ఫిలిం ఫెస్టివల్‌లో ప్రదర్శించారు. ఆ సమయంలో స్టాండింగ్ ఒవియేషన్ దక్కించుకుంది. జ్యూరి మన్ననలు పొందింది. ఫిలిం ఫెస్టివల్‌లో ఉత్తమ స్త్రీ వాద చిత్రంగా నిలిచింది. ఇంటర్నేషన్ అవార్డ్స్‌లో సత్తా చాటుతుండటంతో పాకిస్తానీ ప్రభుత్వం అధికారికంగా ఈ చిత్రాన్ని ఆస్కార్స్‌కు పంపిచగా షార్ట్‌లిస్ట్ అయ్యింది. బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిలిం కేటగిరిలో పోటీపడుతుంది.