గిరిజన-ఆదివాసీ ప్రజలకు గతంలో ఎప్పుడూ దక్కని గౌరవం 

దేశంలో గిరిజన-ఆదివాసీ ప్రజలకు గతంలో ఎప్పుడూ దక్కని గౌరవాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అందజేస్తున్నారని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు. ఆదివాసీల సాధికారత అంశంపై ఓ మీడియా సమావేశంలో మాట్లాడుతూ గిరిజన జనాభా సంక్షేమానికి ఉద్దేశించిన కేంద్ర ప్రాయోజిత పథకాలకు కేంద్రం పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేసిందని తెలిపారు.
గిరిజనుల సర్వతోముఖాభివృద్ధికి అధిక ప్రాధాన్యతనిస్తున్నట్టు వెల్లడించారు. 2014-15లో రూ. 19,437 కోట్ల మేర ఉన్న ఎస్టీసీ నిధుల కేటాయింపును 2022-23లో రూ. 87,585 కోట్లకు పెంచిన విషయాన్ని ఈ సందర్భంగా కేంద్ర మంత్రి గుర్తుచేశారు. గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖకు సైతం 2014-15లో రూ. 3,832 కోట్లు ఉన్న బడ్జెట్‌ను 2022-23లో రూ. 8,407 కోట్లకు పెంచినట్టు తెలిపారు.
‘సబ్‌కా సాథ్, సబ్‌కా వికాస్, సబ్‌కా ప్రయాస్’ అనేది కేవలం నినాదం కాదని, బాధ్యతాయుతమైన నిబద్ధత అని తెలిపారు. గిరిజనుల సంస్కృతిని పరిరక్షించడం, వారి గుర్తింపు, విద్య, ఆరోగ్యం, స్వయం ఉపాధి వంటి అంశాలను స్పృశించడం ద్వారా గిరిజన జనాభా అభ్యున్నతికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చేస్తున్న కృషికి ఇది ప్రతిబింబమని వెల్లడించారు.
గిరిజనుల విద్య గురించి మాట్లాడుతూ, జాతీయ నూతన విద్యా విధానం-2020లో స్థానిక భాష – మాతృభాషలో విద్య ముఖ్యాంశమని, తద్వారా గిరిజన-ఆదివాసీలకు ఎక్కువ ప్రయోజనం కల్గుతుందని వివరించారు. గిరిజన జనాభా కోసం ఉద్దేశించిన ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలల్లో లక్ష మందికి పైగా విద్యార్థులు చదువుతున్నారని తెలిపారు.
 ‘ప్రధాన్ మంత్రి ఆది ఆదర్శ్ గ్రామ్ యోజన’ని ప్రస్తావిస్తూ, గణనీయమైన గిరిజన జనాభా ఉన్న గ్రామాలను మోడల్ గ్రామం (ఆదర్శ్ గ్రామ్)గా మార్చే లక్ష్యంతో కనీసం 50% గిరిజన జనాభా ఉన్న 36,428 గ్రామాలను కవర్ చేయాలని భావిస్తున్నట్లు ప్రధాన్ చెప్పారు. ఈ పథకం ద్వారా ఆయా గ్రామాలలో మౌలిక సదుపాయాలను మిషన్ మోడ్‌లో కల్పించనున్నట్టు వెల్లడించారు.
ఈ పథకం కింద వచ్చే ఐదేళ్లలో ఏటా 7,500 గ్రామాలను ఎంపిక చేయనున్నట్టు ధర్మేంద్ర ప్రధాన్ చెప్పారు. వ్యవసాయ ఉత్పత్తులకు కనీస మద్ధతు ధర అందజేస్తున్నట్టుగా 87 చిన్న అటవీ ఉత్పత్తి వస్తువులు 273 గిరిజన సమూహాలతో సహా గిరిజన స్వయం సహాయక బృందాల కోసం ‘వన్ ధన్ కేంద్రాలు’ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం జీవనోపాధి అవకాశాలను కల్పిస్తోందని తెలిపారు. ప్రధానంగా గిరిజన ప్రాంతాల్లో పండించే పౌషక విలువలతో కూడిన మినుములను ప్రోత్సహించడంపై ప్రధాని దృష్టి కేంద్రీకరించినట్లు మంత్రి వివరించారు.
స్వాతంత్ర్య పోరాటంలో గిరిజన నాయకులకు గుర్తింపునిస్తూ గిరిజన మ్యూజియంలను ప్రారంభించడంతో పాటు జనజాతీయ గౌరవ్ దివాస్, ఇతర కార్యక్రమాలతో సహా ఆదివాసీల గొప్ప వారసత్వ చరిత్రను గౌరవించడానికి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాల గురించి కూడా ప్రధాన్ వెల్లడించారు.
వన్ ధన్ వికాస్ కేంద్రాలు, శోధించదగిన గిరిజన డిజిటల్ డాక్యుమెంట్ రిపోజిటరీ అభివృద్ధి, మొట్టమొదటి జాతీయ గిరిజన పరిశోధనా సంస్థ ఏర్పాటు వంటి ఇతర కార్యక్రమాల గురించి కూడా ఆయన వివరించారు.