కరోనా ముప్పుపై ప్రజలంతా అప్రమత్తం ..  ప్రధాని హితవు 

కరోనా మహమ్మారి ముప్పు ఇంకా తొలగిపోలేదని, ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ప్రధాని నరేంద్ర మోదీ హెచ్చరించారు. మాస్క్‌ని ధరిస్తూ.. కరోనా నివారణ జాగ్రత్తలు తీసుకోవాలని స్పష్టం చేశారు. చైనా సహా పలు దేశాల్లో కరోనా కేసులు భా,రీగా పెరగుతున్న నేపథ్యంలో  మనదేశంలో కరోనా తాజా పరిస్థితిపై ప్రధాని గురువారం ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. 
 
ఈ సమావేశంలో కేంద్ర హోంశాఖ, ఆరోగ్య శాఖ అధికారులతో పాటు పలు రాష్ట్రాల ఆరోగ్య శాఖ మంత్రులు పాల్గొన్నారు. కరోనా పట్ల ఏ మాత్రం అలసత్వం వద్దని, అందరూ అప్రమత్తంగా ఉండాలని ప్రధాని స్పష్టం చేశారు. కరోనా పరీక్షలను పెంచడంతో పాటు జీనోమ్ సీక్వెన్సింగ్‌పై ఫోకస్ పెట్టాలని రాష్ట్రాలకు సూచించారు. అంతేకాదు ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు  హాస్పిటల్స్‌లో ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను పెంచుకోవాలని తెలిపారు.
 
 బెడ్‌లు, ఆక్సిజన్‌, వెంటిలేటర్లు, వీలైనంత ఎక్కువ మంది వైద్యులు, నర్సులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. వృద్ధులు, వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉన్న వారు కరోనా వ్యాక్సిన్ ప్రికాషన్ డోస్ తీసుకునేలా అవగాహనా కార్యక్రమాలు నిర్వహించాలని ప్రధాని సూచించారు. వ్యాక్సినేషన్‌ను వేగవంతం చేయాలని చెప్పారు. 
 
రాబోయే పండుగల సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. కరోనాను ఎదుర్కొనే ప్రవర్తనను ఎల్లవేళలా అనుసరించాలని కోరారు. రద్దీగా ఉండే బహిరంగ ప్రదేశాల్లో మాస్కులు ధరించాలని, ముందస్తు టీకా డోసులు వేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
 
ఈ సందర్భంగా కరోనాపై పోరాటంలో ముందున్న డాక్టర్లు, నర్సులు, ఇతర సిబ్బంది నిస్వార్థ సేవను ప్రధాని మోదీ  ప్రశంసించారు. అంతర్జాతీయ విమానాశ్రయాల్లో కొనసాగుతున్న నిఘా చర్యలను మరింత పటిష్టం చేయాలని అధికారులను ఆయన ఆదేశించారు. చైనా, జపాన్ వంటి దేశాల నుంచి వచ్చే ప్రయాణికుల పట్ల ప్రత్యేకంగా దృష్టిసారించాలని సూచించారు.
 
ఈ సమావేశంలో దేశంలో కరోనా తాజా పరిస్థితి, ప్రపంచ దేశాల్లో పరిస్థితి గురించి కేంద్ర ఆరోగ్యశాఖ, నీతి ఆయోగ్ ప్రజెంటేషన్ ఇచ్చినట్లు ప్రధాన మంత్రి కార్యాలయం తెలిపింది. మనదేశంలో సగటు రోజువారీ కేసులు 153కి తగ్గుముఖం పట్టాయని పేర్కొంది. ఇన్‌ఫెక్షన్ రేటు 0.14 శాతానికి తగ్గుముఖం పట్టడంతో కొత్త కేసుల సంఖ్య చాలా తక్కువగా ఉందని వెల్లడించింది. 
 
గత 6 వారాలుగా ప్రపంచ వ్యాప్తంగా సగటున రోజుకు 5.9 లక్షల కేసులు నమోదయ్యాయినట్లు పేర్కొంది. మనదేశంలో కరోనా ప్రస్తుతానికి అదుపులోనే ఉన్నప్పటికీ.. ఇతర దేశాల్లో కరోనా వ్యాప్తి బాగా పెరిగినందున.. అందరూ అప్రమత్తంగా ఉండాలని కేంద్రం సూచించింది.
అయితే, ఎలాంటి భయాందోళనలకు గురికావాల్సిన అవసరం లేదని పేర్కొంటూ, ఇంట్లో చికిత్స పొందడంతోనే రోగులు కోలుకుంటున్నారని వివరించారు.  కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా, ఆరోగ్య శాఖ మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయా, పౌరవిమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా, విదేశాంగ మంత్రి ఎస్‌ జైశంకర్‌, నీతి ఆయోగ్‌ అధ్యక్షులు వికె పాల్‌ ఇతర అధికారులు పాల్గొన్నారు.