నెహ్రు విధానాలు వ్యతిరేకించిన రైతు పక్షపాతి చౌదరి చరణ్ సింగ్ 

భారత  దేశం ప్రాధమికంగా వ్యవసాయ, గ్రామీణ ప్రాతిపదిక గల దేశం. మన ప్రజా ప్రతినిధులతో అత్యధికులు గ్రామాల నుండి, వ్యవసాయ కుటుంబాల నుండి వచ్చిన వారే. అయితే, ప్రధాన మంత్రిగా పదవి చేపట్టిన తొలి రైతు చౌదరి చరణ్ సింగ్. కానీ ఆయన పార్లమెంట్ లో విశ్వాస తీర్మానం ఎదుర్కొనే లోపుగానే రాజీనామా చేయవలసి రావడంతో పూర్తిస్థాయి ప్రధాని కాలేక పోయారు. 

ఆ తర్వాత సుమారు సంవత్సరం పాటు ప్రధానిగా రైతుగా ప్రజా జీవనంలోకి వచ్చిన హెచ్ డి దేవెగౌడ పనిచేశారు. వీరిద్దరూ తప్పితే రైతులు ఎవ్వరు ప్రధాని కాలేకపోయారు. అందుకనే ప్రభుత్వ విధానాలలో వ్యవసాయం, రైతుల సమస్యలు తగు ప్రాధాన్యత పొందలేకపోతున్నాయి. 

రైతుల గురించి, వ్యవసాయ రంగం గురించి ఎంతగానో ఆలోచించి, వారి సమస్యల పరిష్కారానికి కృషిచేసిన చరణ్‌ సింగ్‌ సేవలకు గుర్తుగా ప్రభుత్వం  ప్రతి ఏడాది డిసెంబర్ 23న చరణ్‌ సింగ్‌ జన్మదినోత్సవాన్ని జాతీయ రైతు దినోత్సవంగా ప్రకటించింది. ఈ రోజున  వ్యవసాయరంగంపై చర్చలు, సదస్సులు, క్విజ్‌ పోటీలు, శిక్షణా శిబిరాలు, ఎగ్జిబిషన్‌ వంటి కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.

ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా, కేంద్రంలో హోమ్, ఆర్ధిక శాఖల మంత్రిగా, కొద్దీ నెలలపాటు ప్రధాన మంత్రిగా కూడా పనిచేశారు. ఏ పదవి చేపట్టినా గ్రామాలకు, రైతుల కోసం ఆరాట పడేవారు. ఆయన ఆర్ధిక మంత్రిగా ఉన్న సమయంలో ముంబైలోని ఛాంబర్ అఫ్ కామర్స్ వారు ఆహ్వానించి, బడ్జెట్ ముందు తమ సమస్యలు చెప్పుకోవడానికి ఓ సమావేశం ఏర్పాటు చేశారు.

ఆ సమావేశానికి ఉన్నతాధికారులతో కలసి హాజరై, వారు చెప్పిన అంశాలు అన్నింటిని ఓపికగా విని, నోటు చేసుకున్నారు. దానితో తమకు అనుకూల బడ్జెట్ వస్తుందని పారిశ్రామిక, వాణిజ్య వర్గాలు భావించాయి. కానీ అందుకు పూర్తి భిన్నంగా బడ్జెట్ ప్రవేశపెట్టారు. అదేమిటని ఓ సహచరుడు అడిగితే, “వారు చెప్పారంటే అది రైతులకు, గ్రామాలకు వ్యతిరేకం. కాబట్టి, వారు చెప్పినదానికి వ్యతిరేకంగా చేస్తే రైతులకు, గ్రామాలకు మేలు జరుగుతుంది” అని చెప్పారు.

స్వతంత్రం రాగానే తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రు, తొలి ప్లానింగ్ కమిషన్ చైర్మన్  పిసి మహలనోబిస్ ల ఆర్ధిక విధానాలను తీవ్రంగా ప్రతిఘటిస్తూ, గాంధీ ఆలోచనలతో ప్రభావిత్ర్హమై  స్వతంత్ర భారతంలో ప్రత్యామ్నాయ అభివృద్ధి నమూనాను, రైతుల శ్రేయస్సు ప్రాతిపదికగా దేశం ముందుంచిన నేత చరణ్ సింగ్.  భారత ఎన్నికల రాజకీయాలలో రైతుల సమస్యలను అజెండాగా మొదట ఉత్తర ప్రదేశ్ స్థాయిలో, ఆ తర్వాత జాతీయ స్థాయిలో తీసుకు వచ్చారు.

వ్యవసాయాన్ని, గ్రామీణ రంగాన్ని నిర్లక్ష్యం కావించి, పరిశ్రమలు, వాణిజ్యాలకు నెహ్రు ఇస్తున్న ప్రాధాన్యతతో కాంగ్రెస్ లో ఉంటూనే  తీవ్రంగా విభేదించారు. స్వతంత్ర భారత దేశంలో మొదటగా వ్యవసాయ రంగంకు కీలక అప్రాధాన్యత ఇవ్వాలని వాదించారు. బలమైన వ్యవసాయరంగం లేకుండా పారిశ్రామిక రంగం అభివృద్ధికి నోచుకోలేదని ఆయన స్పష్టం చేశారు. 

నెహ్రు రెండో పంచవర్ష ప్రణాళికలో ప్రభుత్వ రంగ సంస్థలకు ప్రాధాన్యత ఇవ్వడాన్ని ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు. పారిశ్రామికీకరణ ద్వారా వ్యవసాయ అభివృద్ధి సాధ్యం కాదని హెచ్చరించారు. ప్రభుత్వ ఉద్యోగాలలో రైతుల పిల్లలకు 50 శాతం రిజర్వేషన్ కల్పించాలని 1939లోనే కాంగ్రెస్ పార్లమెంటరీ ప్యానల్ ముందు ప్రతిపాదన ఉంచారు. 

ప్రధాన మంత్రిగా ఆయన ఒక సభలో పరిశ్రమలే అభివృద్ధికి దారితీసే బీహార్ దేశంలో బాగా అభివృద్ధి చెందిన దేశం అయి ఉండవలసింది, కానీ వ్యవసాయ ప్రతిపాదిక గల పంజాబ్ కాదని ఈ సందర్భంగా చెప్పారు. రైతుల అనుకూల విధానాలకు రాజకీయంగా త్యాగాలకు సహితం వెనుకాడలేదు. 

1952లో ఉత్తర ప్రదేశ్ వ్యవసాయ మంత్రిగా తాను తీసుకొచ్చిన జమీందారీ, భూసంస్కరణల బిల్లు తన మొత్తం జీవితంలో సాధించిన గొప్ప విజయంగా భావిస్తూ ఉండేవారు. కౌలుదారులకు భూములపై యాజమాన్య హక్కులు కలిగించిన ఈ చట్టం గ్రామీణ భారతంలో ఓ విప్లవానికి దారితీసింది. 

నెహ్రు ప్రతిపాదించిన ఉమ్మడి, సహకార వ్యవసాయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ 1959లో నాగపూర్ లో జరిగిన కాంగ్రెస్ సమావేశాలలో గంటకు పైగా ప్రసంగం ఉద్వేగంగా చేశారు. అదే సంవత్సరం నెహ్రు ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ ఓ పుస్తకం కూడా వ్రాసారు. పొలం దున్నేవారికే భూమి హక్కు ఉండాలని స్పష్టం చేశారు. కాంగ్రెస్ విధానాలతో విసిగిపోయి, బయటకు వచ్చి 1967లో ఉత్తర ప్రదేశ్ లో మొదటి కాంగ్రెసేతర ప్రభుత్వం ఏర్పాటు చేసి, ముఖ్యమంత్రి అయ్యారు.      

రైతు కుటుంబానికి చెందిన చరణ్‌ సింగ్‌ 1902లో ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌ జిల్లాలోని నూర్‌పూర్‌ గ్రామంలో జన్మించారు. సైన్సులో పట్టా పుచ్చుకొని, ఆగ్రా విశ్వవిద్యాలయం నుంచి పోస్టు గ్రాడ్యుయేషన్‌ చేశారు. న్యాయవిద్యను అభ్యసించి వకీలుగా ఘజియాబాదులో జీవితాన్ని ప్రారంభించారు. 

1929లో మీరట్‌కి చేరి తదనంతరం కాంగ్రెసు పార్టీలో చేరారు. బ్రిటీష్‌ ప్రభుత్వం నుంచి స్వాతంత్య్రం కోసం అతను అహింసా పోరాటంతో మహాత్మా గాంధీని అనుసరించారు. అనేకసార్లు జైలుశిక్ష అనుభవించాడు. ఉప్పు చట్టాల వివాదాల కారణంగా బ్రిటీష్‌ వారు 6 నెలల జైలుకు పంపించారు. 

తన 34వ ఏట ఉత్తర ప్రదేశ్‌ శాసనసభకు ఛత్రౌలి నియోజకవర్గం నుంచి ఎన్నికయ్యారు. రైతుల కష్టం తెలుసుకున్న ఆయన అసెంబ్లీలో వ్యవసాయ ఉత్పత్తుల మార్కెట్‌ బిల్లును ప్రవేశపెట్టారు. వ్యాపారులు, రైతుల ప్రయోజనాలను కాపాడడానికి ఈ బిల్లు ఉద్దేశం. తర్వాత చాలా రాష్ట్రాలు ఈ బిల్లును ఆమోదించాయి. 

దేశానికి రైతు వెన్నెముక లాంటివాడని భావించి రైతు యాజమాన్య వ్యవస్థను సంరక్షించి స్థిరీకరించేందుకు పోరాడారు. చౌదరి చరణ్‌ సింగ్‌ చేసిన అనేక ఉద్యమాల వల్ల జమీందారీ చట్టం రద్దు అయ్యింది. కౌలుదారీ చట్టం అమల్లోకి వచ్చింది. రైతులకు బ్యాంకు రుణాలు అందించే విధానం ప్రవేశపెట్టారు. ఆయన కేంద్ర ఆర్ధిక మంత్రిగా ఉన్న సమయంలోనే మన ప్రాంతంలోని పుగాకు రైతువులను వేధిస్తున్న ఎక్సయిజ్ సుంకాన్ని పుగాకుపై రద్దు చేశారు.