జూన్ నాటికి అయోధ్య విమానాశ్రయం పనులు పూర్తి

అయోధ్యలో రామాలయం నిర్మాణం పూర్తి కావడానికి చాలా ముందుగానే విమానాశ్రయ ప్రాజెక్ట్ పనులు 2023 జూన్ నాటికి పూర్తవుతాయని ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అంచనా వేసింది.  ఇప్పటికే 52 శాతం అభివృద్ధి పనులు పూర్తి కావడంతో,  మొత్తం ఎయిర్‌పోర్టు ప్రాజెక్టు పనులు వచ్చే ఏడాది జూన్‌ నాటికి పూర్తవుతాయని తెలిపింది. ఈ ఎయిర్‌పోర్ట్ అభివృద్ధి ప్రాజెక్ట్ విలువ రూ.242 కోట్లు.
ఇందులో టెర్మినల్ భవనం నిర్మాణం, ఎయిర్‌సైడ్ సౌకర్యాల అభివృద్ధి వంటివి కీలకంగా ఉన్నాయి. మొత్తం 6,000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో కొత్త టెర్మినల్ భవనాన్ని నిర్మిస్తున్నట్లు ఎఎఐ తెలిపింది.  ఏడాదికి 6 లక్షల మంది ప్రయాణికులు ప్రయాణించేందుకు వీలయ్యే సామర్థ్యం కలిగివుంటుందని తెలిపారు. రద్దీ సమయాల్లో ఒకేసారి 300 మంది ప్రయాణికులకు సేవలందించేలా రూపొందిస్తున్నట్లు వివరించింది.
 
ఈ విమానాశ్రయం రూపకల్పన విషయంలో అయోధ్య రామమందిరాన్ని స్ఫూర్తిగా తీసుకున్నారు. ఎయిర్‌పోర్ట్‌లో అడుగడుగునా ఆధ్యాత్మిక భావం కలిగేలా ఉంటుందని అధికారులు తెలిపారు. రాకపోకలు సాగించే ప్రయాణికుల్లో భక్తిభావం ఉప్పొంగేలా చేస్తామని వివరించారు.
 
ఈ ఎయిర్‌పోర్ట్ టెర్మినల్‌కి ఉండే గ్లాస్ ముఖభాగం నిర్మాణం విషయంలో ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారు. టెర్మినల్‌లో ఉండే ప్రయాణికులు.. అయోధ్యలోని రాజభవనంలోనే ఉన్నాననే భావన కలిగేలా నిర్మిస్తున్నట్లు తెలిపారు. అయోధ్యలో 2023 డిసెంబర్ నాటికి రామాలయ నిర్మాణం పూర్తవుతుంది.
అంతకంటే ముందుగానే ఎయిర్‌పోర్ట్ నిర్మాణ పనులు పూర్తవుతాయి. ఇది రామాలయానికి 7 కిలోమీటర్ల దూరంలో ఉంటుందని తెలుస్తోంది.  అందువల్ల ఎయిర్‌పోర్ట్ నుంచి రామజన్మభూమికి భక్తులు నేరుగా వచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నారు. తద్వారా చాలా త్వరగా స్వామివారిని దర్శించుకునేందుకు వీలు కలుగనుంది.