భారత్ లో చైనా కరోనా కొత్త వేరియంట్ కేసులు 4

ప్రస్తుతం చైనాలో కరోనా విజృంభణకు కారణమైన ఒమిక్రాన్ సబ్‌వేరియంట్  బీఎఫ్. 7 కేసులు నాలుగు నమోదయ్యయాని అధికార వర్గాలు బుధవారం వెల్లడించాయి. బీఎఫ్.7 మొదటి కేసును గుజరాత్ బయోటెక్నాలజీ రిసెర్చ్ సెంటర్ అక్టోబరులో గుర్తించినట్టు తెలిపాయి. 
 
వడోదరకు చెందిన ఎన్ఆర్ఐ మహిళకు పాజిటివ్ వచ్చింది. రెండో కేసు కూడా గుజరాత్‌లోనే నమోదయ్యిందని, మరో రెండు ఒడిశాలో గుర్తించినట్టు పేర్కొన్నాయి. కేంద్ర ఆరోగ్య మంత్రి మనుసుఖ్ మాండవియా అధ్యక్షతన జరిగిన కరోనా సమీక్షా సమావేశంలో నిపుణులు మాట్లాడుతూ  ప్రస్తుతం కరోనా కేస్‌లోడ్‌లో పెరుగుదల లేనప్పటికీ, ఇప్పటికే ఉన్న, కొత్తగా పుట్టుకొస్తున్న వేరియంట్‌లను ట్రాక్ చేయడానికి నిరంతర నిఘా అవసరమని అభిప్రాయపడ్డారు.
అధికారిక వర్గాల ప్రకారం చైనా నగరాల్లో ప్రస్తుతం అత్యధికంగా వ్యాపించే సామర్థ్యం ఉన్న ఓమిక్రాన్ స్ట్రెయిన్ వ్యాప్తిలో ఉంది. రాజధాని బీజింగ్‌లో  బీఎఫ్ .7 వేరియంట్ ఎక్కువగా కోవిడ్ ఇన్‌ఫెక్షన్ల విస్తృత పెరుగుదలకు దోహదం చేస్తోంది. ‘‘చైనాలో  బీఎఫ్. 7 అధిక వ్యాప్తికి అక్కడ జనాభాలో తక్కువ స్థాయి రోగనిరోధక శక్తి, బహుశా టీకా కూడా కారణం కావచ్చు’’ అని ఓ అధికారి వ్యాఖ్యానించారు.
చైనా, ఇతర దేశాల నుంచి భారత్‌కు వచ్చే అంతర్జాతీయ ప్రయాణికులకు ఎయిర్‌పోర్టుల్లో కరోనా పరీక్షలు చేయనున్నట్టు అధికారిక వర్గాలు వెల్లడించాయి. ఇతర కరోనా వేరియంట్ల మాదిరిగానే ఒమిక్రాన్ బిఎఫ్-7 వేరియంట్ కు కూడా నొప్పులు,  ముక్కు కారడం, గొంతు నొప్పి వంటి లక్షణాలుంటాయని నిపుణులు వెల్లడించారు.  
 
బీఎఫ్.7 అనేది ఒమిక్రాన్ బీఏ.5 సబ్ వేరియంట్. తక్కువ ఇంక్యుబేషన్ సమయం కలిగిన ఈ వేరియంట్‌కు వేగంగా వ్యాప్తి చెందే లక్షణం ఉంది. టీకాలు, కరోనా వైరస్ ద్వారా లభించిన వ్యాధి నిరోధకశక్తిని నిర్వీర్యం చేసే బలమైన ఇన్‌ఫెక్షన్ సామర్థ్యాన్ని కలిగి ఉందని నిపుణులు చెబుతున్నారు. 
 
ఈ వేరియంట్‌ను అమెరికా, బ్రిటన్, బెల్జియం, ఫ్రాన్స్, డెన్మార్క్ వంటి ఐరోపా దేశాలు సహా ఇతర దేశాల్లోనూ ఇప్పటికే గుర్తించారు. కాగా, చైనాలో హైడ్రోజన్‌ బాంబులా కరోనా విస్ఫోటం సంభవిస్తోందనీ, వచ్చే 90 రోజుల్లో 60 శాతం అక్కడ జనాభా, 10 శాతం ప్రపంచ జనాభా కరోనా  బారిన పడనున్నారని అమెరికా అంటువ్యాధి నిపుణుడు ఎరిక్‌ ఫైగెల్‌ డింగ్‌ హెచ్చరించారు. 
 
మరణాల సంఖ్య లక్షల్లో ఉంటుందని, కప్పుడు చైనాలో కరోనా కేసులు రెట్టింపు కావడానికి కొన్ని రోజులు పడితే, ఇప్పుడది గంటల్లోనే జరుగుతోందని ఆయన గుర్తు చేశారు. అత్యాధునిక వైద్య సదుపాయాలున్న చైనా రాజధాని బీజింగ్‌లో సైతం కరోనా కరాళనృత్యం చేస్తోంది.
ప్రపంచవ్యాప్తంగా గత ఆరు వారాలుగా కేసులు పెరుగుతుండగా, ఈనెల 19తో ముగిసిన వారంలో రోజుకు సగటున 5.9 లక్షల కేసులు నమోదయ్యాయి. అయితే ఇదే సమయంలో భారత్‌లో కొత్త కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతూ సగటున 158 వెలుగుచూశాయి. కరోనా ప్రారంభం నుంచి అమెరికాలో ఇప్పటి వరకు 10 కోట్లకు పైగా కేసులు నమోదైనట్టు జాన్స్‌ హాప్‌కిన్స్‌ యూనివర్సిటీ పేర్కొన్నది.