గోవా విమోచన పోరాటంలో కీలక సూత్రధారి జగన్నాథరావు జోషి

శ్రీమతి సాదినేని యామిని శర్మ 

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సిద్ధాంతంతో ప్రేరణ పొందిన జగన్నాథ రావు జోషి  పూణేలో జనసంఘ్‌తో రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. 1967 భోపాల్ నుండి, 1971లో షాజాపూర్ (మధ్యప్రదేశ్) నుండి జనసంఘ్ సభ్యునిగా రెండుసార్లు లోక్‌సభకు ఎన్నికయ్యారు. తరువాత, వారు 1978 నుండి 1984 వరకు రాజ్యసభ సభ్యునిగా పనిచేశారు. ఆయన 1984 లోక్‌సభ ఎన్నికలలో పూణే నుండి బిజెపి అభ్యర్థిగా పోటీ చేశారు.
 
వారు గొప్ప జాతీయ రాజకీయ నాయకులు,అద్భుతమైన వక్త. జోషి గోవా విమోచన ఉద్యమంలో చురుకుగా పాల్గొనడం ద్వారా `కర్ణాటక కేసరి’గా పేరొందారు . కర్ణాటకలో బిజెఎస్, బిజెపిలను బలోపేతం చేయడంలో విశేష కృషి చేశారు.  ఈ కర్ణాటక కేసరి (కర్ణాటక సింహం) గర్జన కచ్ నుండి కమ్రూప్ వరకు, కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు మారు మ్రోగింది.
జగన్నాథరావు జోషి భారతదేశ విశాలతను వివరించడానికి – అట్టక్ టు కటక్ అనే నినాదాన్ని కచ్ నుండి కమ్రూప్ అని మార్చారు. ఆయన బహుభాషావేత్త. ఇంగ్లీష్, కన్నడ, మరాఠీ, తమిళం, తెలుగు, హిందీ, భోజ్‌పురి, మార్వాడీ వంటి ఎనిమిది భాషలలో అద్భుతమైన ప్రావీణ్యం ఉండేది వారికి. వారు దేశవ్యాప్త పర్యటన చేశారు.
 
1947లో భారతదేశం బ్రిటిష్ వారి నుండి విముక్తి పొందినప్పటికీ, గోవా అప్పటికీ పోర్చుగీసులచే పాలించబడింది. జూన్ 13, 1955 జగన్నాథరావు జోషి  గోవా తీరప్రాంత నగరాన్ని పోర్చుగీస్ బారి నుండి విముక్తి చేయడానికి వేలాది మంది ఆర్ఎస్ఎస్,  జనసంఘ్ కార్యకర్తలను గోవాకు నడిపించారు.
 
ప్రధాని నెహ్రూ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి చర్యల గురించి ఆలోచించకపోవడంతో గోవా విముక్తి ఉద్యమాన్ని ప్రారంభించడం ఆర్‌ఎస్‌ఎస్, జనసంఘ్‌లకు ప్రాధాన్యత అయింది. “నెహ్రూజీ అబ్ క్యా కరే, పోలీస్ లేకర్ గోవా చలే, పోలీస్ లేకర్ గోవా చలే అనే నినాదాన్ని రూపొందించిన వ్యక్తి జగన్నాథరావు జోషి”. (నెహ్రూజీ ఇప్పుడు మనం ఏమి చేయాలి? పోలీసులను తీసుకెళ్దాం)అంటూ గొంతెత్తి గోవా విమోచనం కోసం కదం త్రొక్కారు.
 
కానీ నెహ్రూ మౌనంగా ఉండిపోయారు. అప్పుడు జగన్నాథరావు జోషి ఆర్‌ఎస్‌ఎస్,  జనసంఘ్ కార్యకర్తల సైన్యానికి నాయకత్వం వహించి గోవాలోకి వెళ్లారు. గోవా విముక్తి కోసం దేశవ్యాప్త ఉద్యమంలో భాగంగా బెంగళూరులో నిరసన ప్రదర్శన నిర్వహించారు.
 
సత్యాగ్రహంలో అరెస్ట్, ఏకాంత నిర్బంధం 
జూన్ 13, 1955న, కర్ణాటకకు చెందిన ఆర్‌ఎస్‌ఎస్ స్వయంసేవక్ లతో కలిసి భారతీయ జనసంఘ్ నాయకుడు జగన్నాథరావు జోషి గోవా సత్యాగ్రహాన్ని ప్రారంభించారు. జోషి వెంట మహిళలతో సహా సుమారు 3 వేల మంది కార్యకర్తలు గోవా సరిహద్దుకు చేరుకోగానే వారిపై పోర్చుగీస్ సేనలు లాఠీచార్జ్ , కాల్పులు జరిపాయి.   
 
అనుమతి లేకుండా గోవాలోకి ప్రవేశించారు అన్న కారణంతో జగన్నాథరావు జోషిని పోర్చుగీస్ సైన్యం అరెస్టు చేసి ఫోర్ట్ అగ్వాడా జైలుకు తరలించారు. డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ కాశ్మీర్‌లోకి ప్రవేశించినప్పుడు అనుమతి లేకుండా ప్రవేశించారని వారిని శ్రీనగర్ సెంట్రల్ జైలులో ఖైదు చేసినట్టుగా జోషిని అరెస్ట్ చేశారు.
 
అనుమతి లేకుండా గోవాకు ఎందుకు వచ్చారని జోషి గారిని న్యాయమూర్తి ప్రశ్నించిన్నప్పుడు జగన్నాథరావు జోషి సింహంలా గర్జిస్తూ, “నువ్వు (పోర్చుగీస్) గోవాకు ఎందుకు వచ్చావని అడగడానికి నేను గోవాకు వచ్చాను. గోవా నా మాతృభూమిలో ఒక భాగం.  నా మాతృభూమిలో ఏ ప్రాంతానికైనా వెళ్లే హక్కు నాకు ఉంది” అంటూ గర్జించారు. 
ఈ గర్జన డాక్టర్ ముఖర్జీ  షేక్ అబ్దుల్లాతో కాశ్మీర్ భారతమాతలో అంతర్భాగమని, భారత్‌లోని ఏ భాగానికైనా వెళ్లే హక్కు తనకు ఉందని అన్న మాటలను గుర్తు చేస్తాయి. జోషి ఈ ప్రకటన మీడియాలో సంచలనం సృష్టించింది. వందలాది మంది ఆర్‌ఎస్‌ఎస్, బిజెఎస్ కార్యకర్తలతో పాటు ఆయన జైలు పాలైనప్పటికీ, జోషిని మాత్రం ఏకాంత నిర్బంధానికి గురి చేశారు. 

ఆగష్టు 15, 1955న, గోవాలో మోహరించిన పోర్చుగీస్ సైన్యం 5,000 మందికి పైగా సత్యాగ్రహిలపై కాల్పులు జరిపింది, సుమారు 51 మంది మరణించారు. ఇలాంటి అనేక ఉద్యమాలు 1961 వరకు కొనసాగాయి. సుధీర్ ఫడ్కే ‘బాబుజీ’, సంగీత విద్వాంసుడు, గోవా ఉద్యమానికి ప్రసిద్ధి చెందిన వాలంటీర్, సాంస్కృతిక పరంగా పనిచేశారు. 

సరస్వతి ఆప్టే ‘తాయ్’ నేతృత్వంలోని గోవా విమోచన ఉద్యమంలో రాష్ట్ర సేవిక సమితి కూడా పాల్గొంది. పూణేలో గుమిగూడిన అన్ని సత్యాగ్రహి సమూహాలకు ఆహారం మొదలైనవి ఏర్పాటు చేసింది. జన్ సంఘ్‌లోని సత్యాగ్రహీల సంఖ్య అన్ని ఇతర పార్టీల ఉమ్మడి నిరసనకారుల కంటే దాదాపు నాలుగు రెట్లు ఎక్కువ
యునైటెడ్ ఫ్రంట్ ఆఫ్ గోన్స్ (యు ఎఫ్ జి) సంస్థ ముంబైలో ఉనికిలోకి వచ్చింది. దాదర్‌ను యునైటెడ్ ఫ్రంట్ ఆఫ్ గోవాన్స్ , నగర్ హవేలీని వినాయక్ రావ్ ఆప్టే నేతృత్వంలోని 40-50 మంది సంఘ్ స్వయంసేవక్ లు, ప్రభాకర్ విఠల్ సెనారి, ప్రభాకర్ వైద్య నేతృత్వంలోని ఆజాద్ గోమంతక్ దళ్‌కు చెందిన వారు డామన్ ను గోవా కార్యకర్తలతో కలిసి విముక్తి చేశారు.

 
ప్రధాని నెహ్రూ దౌత్యపరమైన పరిష్కారం కోసం చూస్తున్న సమయంలో గోవాను విముక్తి చేయాలనే ఒత్తిడి పెరిగింది. ఆ సమయంలో పోర్చుగల్ నాటోలో సభ్యదేశంగా ఉన్నందున, కాశ్మీర్ సమస్య కూడా వివాదాస్పదంగా ఉన్నందున, అటువంటి పరిస్థితిలో, భారత్‌పై సైనిక చర్య సరికాదని ఆయన వెనుకడుగు వేశారు.
 
పోలీస్ చర్యకై దీనదయాళ్, గురూజీ పిలుపు 
 
1955లో ఢిల్లీలోని రాజేంద్ర నగర్‌లో జనసంఘ్ ఆధ్వర్యంలో జరిగిన భారీ బహిరంగ సభలో గోవాలో పోలీసు చర్య తీసుకోవాలని జనసంఘ్ ప్రధాన కార్యదర్శి పండిట్  దీనదయాళ్ ఉపాధ్యాయ పిలుపిచ్చారు. 
 
అనాగరిక దౌర్జన్యాలతో ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తూ గోవాలో ఆందోళనకు దిగుతున్న భారతీయులను పోర్చుగీస్ పాలన ఆపాలని కోరుకుంటోందని పేర్కొంటూ భారత ప్రజలు భయపడరని,  పోర్చుగీస్ దురాగతాలకు ఏమాత్రం తలొగ్గరని స్పష్టం చేశారు. 
 

పెద్ద సంఖ్యలో సత్యాగ్రహులను పంపడం ద్వారా ఉద్యమాన్ని మరింత బలోపేతం చేస్తామని ప్రకటించారు. గోవా జైలులో ఉన్న జగన్నాథరావు జోషి మొదలైన సత్యాగ్రహుల భద్రతకు చర్యలు తీసుకోవాలని కోరుతూ  హోం మంత్రి పండిట్ గోవింద్ బల్లభ్ పంత్‌కు టెలిగ్రామ్ పంపారు.

ఆగష్టు, 1955లో  ఒక ప్రకటనలో, ఆర్ఎస్ఎస్ సర్ సంఘచాలక్  మాధవరావు సదాశివరావు గోల్వాల్కర్ (గురూజీ) ఇలా అన్నారు: “గోవాలో పోలీసు చర్య తీసుకొని గోవాను విముక్తి చేయడానికి ఇంతకంటే మంచి అవకాశం మరొకటి ఉండదు. ఇది మన అంతర్జాతీయ ప్రతిష్టను పెంచుతుంది. మన చుట్టూ ఉన్న దేశాలకు పాఠాలు కూడా నేర్పుతుంది. మనల్ని బెదిరిస్తున్నారు”.

 
కాగా, గోవా విమోచన ఉద్యమానికి మద్దతు ఇవ్వబోమని ప్రకటించడం ద్వారా విమోచన ఉద్యమానికి భారత ప్రభుత్వం  వెన్నుపోటు పొడిచిందని గురూజీ ఆగ్రహం వ్యక్తం చేశారు.  భారత పౌరులపై జరుగుతున్న ఈ అమానుష కాల్పులపై భారత్ ప్రభుత్వం స్పందించి, ఇప్పటికైనా దేశీయుల బానిసత్వంలో కొట్టుమిట్టాడుతున్న మాతృభూమికి విముక్తి కల్పించేలా చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
ఇలా ఉండగా, జులై 23, 1955న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశమై గోవా ఉద్యమాన్ని అక్కడి ప్రజలే జరపాలని, బయటి ప్రజలు అందులో పాల్గొనకూడదని,  శాంతియుతంగానే గోవా విలీనం జరగాలని తీర్మానం చేయడం పట్ల జనసంఘ్ ఆగ్రహం ప్రకటించింది. గోవా ఉద్యమం భారత స్వతంత్ర ఉద్యమంలో భాగమే అని స్పష్టం చేసింది.