ఖర్గే వాఖ్యలపై పార్లమెంట్‌లో దుమారం

కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గే వివాదాస్పద వ్యాఖ్యలపై క్షమాపణలు చెప్పాలంటూ పార్లమెంట్‌లో దుమారం చెలరేగింది. మంగళవారం ఉదయం పార్లమెంట్‌ ప్రారంభం కాగానే క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేస్తూ బిజెపి సభ్యులు ఆందోళనకు దిగారు. మల్లికార్జున్‌ ఖర్గే అంగీకరించకపోవడంతో సభలో కొంతసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. 

ఓ రాజకీయ పార్టీకి జాతీయ అధ్యక్షుడై ఉండి ఖర్గే ఇష్టమొచ్చినట్లు మాట్లాడారంటూ బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రమంత్రులకు, ఖర్గేకు మధ్య పార్లమెంట్ లో మాటల యుద్ధం జరిగింది. అధికార, ప్రతిపక్షాల సభ్యుల వాగ్వాదంపై రాజ్యసభ ఛైర్మన్​ జగదీప్ ధన్‭ కర్​ అసహనం వ్యక్తం చేశారు. సభలో ఇలా ప్రవర్తించడం వల్ల చెడ్డ పేరు వస్తుందని వారించారు.

” మనమేం చిన్న పిల్లలం కాదు” అంటూ ఉపరాష్ట్రపతి జగదీప్‌ ధన్‌ఖర్‌  రాజ్యసభ సభ్యులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సభలో ఇలాంటి ప్రవర్తన మనకు చాలా చెడ్డపేరు తెస్తుందని, సభ నడిచే తీరుతో బయట ప్రజలు నిరుత్సాహానికి గురవుతున్నారని మండిపడ్డారు. అధికార, ప్రతిపక్ష సభ్యుల వాగ్వాదం మధ్య స్పీకర్‌ ధన్‌ఖర్‌ వారిని వారించే యత్నం చేశారు.

 సభను ప్రజలు  గమనిస్తున్నారని, మనల్ని చూసి 135 కోట్ల మంది ప్రజలు నవ్వుతున్నారని  ధన్‌ఖర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్లమెంట్‌ వెలుపల జరిగిన విషయం గురించి సభలో ఆందోళనలు సరికాదని, ప్రతిపక్షనేత మాట్లాడుతుంటే అడ్డుకోవడానికి మనమేం చిన్నపిల్లలం కాదంటూ మందలించారు.

‘భారత్‌ జోడో యాత్ర’లో భాగంగా రాజస్థాన్‌లోని అల్వార్‌లో జరిగిన ర్యాలీలో ఖర్గే మాట్లాడుతూ  దేశం కోసం కాంగ్రెస్‌ ఎంతో చేసిందని, ఇందిరా గాంధీ, రాజీవ్‌ గాంధీతోపాటు మరెందరో కాంగ్రెస్‌ నేతలు ప్రాణ త్యాగాలు చేశారని చెప్పారు. అయితే, బిజెపి దేశం కోసం కనీసం ఒక్క శునకాన్ని కూడా కోల్పోలేదని, అయినా దేశభక్తులమని చెప్పుకుంటారని ఎద్దేవా చేశారు. 

‘దేశం కోసం కాంగ్రెస్ నిలబడింది, స్వాతంత్య్రం సాధించింది. ఎందరో కాంగ్రెస్ నాయకులు ప్రాణత్యాగాలు చేశారు. బీజేపీ మాత్రం ఒక్క శునకాన్ని కూడా కోల్పోలేదు. అయినా తామే దేశభక్తులమని ఢంకా బజాయించుకుంటోంది. మేము (కాంగ్రెస్) ఏదైనా అంటే దేశద్రోహులుగా ముద్ర వేస్తారు” అని మల్లికార్జున ఖర్గే విమర్శించారు.

పార్లమెంటు సమావేశం కాగానే ఖర్గే వ్యాఖ్యలను బీజేపీ నేతలు ప్రస్తావిస్తూ ఆందోళనకు దిగారు. ఖర్గే క్షమాపణలు చెప్పాలని కేంద్ర మంత్రి పీయూశ్ రాజ్యసభలో డిమాండ్ చేశారు. స్వాతంత్య్రం వచ్చాక కాంగ్రెస్‌ను రద్దు చేయాలని మహాత్మాగాంధీ చెప్పారని ఉటంకించారు. ఖర్గే తన వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పకుంటే రాజ్యసభలో ఉండే అర్హత కోల్పోతారని హెచ్చరించారు.

ఇదిలావుండగా కాంగ్రెస్ అధ్యక్షుడు ఇంతలా దిగజారి మాట్లాడతారని తాననుకోలేదని కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు ఆగ్రహం వ్యక్తం చేశారు.  ఒక రాజకీయ పార్టీ నేతగా ఆయన తన బాధ్యతలను అర్ధం చేసుకోవాలని, తామేమీ శత్రువులమో, ప్రత్యర్థులమో కాదని అన్నారు. ఖర్గే వ్యాఖ్యలు అనుచితం, దురుదృష్టకరమని చెప్పారు.

క్షమాపణలు చెప్పాలంటూ బిజెపి చేసిన డిమాండ్‌ను ఖర్గే తోసిపుచ్చుతూపార్లమెంటు బయట చెప్పిన వ్యాఖ్యలకు సభలో చర్చ జరపాల్సిన అవసరమే లేదని పేర్కొన్నారు. తాము ఏమైనా అంటే దేశద్రోహులుగా ముద్రవేస్తారని ఖర్గే విమర్శించారు. ఈ వ్యాఖ్యలు రాజకీయంగా తీవ్ర దుమారానికి దారితీశాయి.

”దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన వారిని మీరు క్షమాపణలు అడుతున్నారా?” అంటూ బిజెపిని ప్రశ్నించారు. ఇందిరాగాంధీ, రాజీవ్‌గాంధీ వంటి ఎందరో కాంగ్రెస్‌ నేతలు ప్రాణ త్యాగాలు చేశారని, దేశ ఐక్యత కోసం మీలో ఎవరు ప్రాణ త్యాగం చేశారో చెప్పాలని బిజెపిని నిలదీశారు.