నల్గురు బెంగాలీ ప్రముఖులు, మూడు మార్గాలు… మన దారి ఎటు?

కె. శ్యామ్ ప్రసాద్, 
జాతీయ సంయోజకులు, సామాజిక సమరసత
 
గత వేయి సంవత్సరాలుగా అవిభక్త బెంగాల్ రాష్ట్రం అనేక సమస్యలతో, ఉద్యమాలతో సలసలా మరుగుతున్నది. వేయి సంవత్సరాల క్రితం నుండి విదేశీ ముస్లిం మూకల ఆక్రమణలు, మత మార్పిడులు, ఆంగ్లేయుల పాలన, ఆర్థిక దోపిడీ, పాశ్చాత్య నాగరికత ప్రభావం, స్వాతంత్ర్యం కొరకు సాయుధ ఉద్యమాలు, ఆంగ్లేయ ప్రభుత్వపు అణచివేత… లాంటివి ఎన్నో……
 
ఈ రాష్ట్రంలో పుట్టి,ఉద్యమాలు నడిపిన నలుగురు బెంగాలీ ప్రముఖుల గురించి తెలుసుకుందాం. ఈ నలుగురు 100 సంవత్సరాల కాల వ్యవధిలో జన్మించారు. వీరిలో ముగ్గురు నవశూద్ర(ఎస్సీ) కులానికి చెందినవారు, ఒకరు రాజ వంశీ (ఎస్సీ) కులానికి చెందిన
వారు. వివరాల్లోకి వెడితే…
 
1. హరిచంద్ ఠాకూర్ (30మార్చ్ 1812 – 4 మార్చ్ 1878) వీరు నేటి బంగ్లాదేశ్ లో జన్మించారు.
2.  జోగేంద్రనాథ్ మండల్ (29మార్చ్1904 – 5అక్టోబర్ 1968), వీరూ నేటి బంగ్లాదేశ్ లో జన్మించారు.
3. చారు మజుందార్ (15మే 1918 – 23మే 2017) నేటి పశ్చిమ బెంగాల్ లోని సిలిగురిలో వద్ద జన్మించారు.
4.  నాల్గవ వ్యక్తి రాజ వంశీ (ఎస్సీ) కులానికి చెందిన ఠాకూర్ పంచానన బర్మ (13 ఫిబ్రవరి 1866 – 9సెప్టెంబర్ 1935). వీరూ నేటి పశ్చిమ బెంగాల్ లో జన్మించారు.
 
ఈ నలుగురు ప్రముఖులూ ఎస్సీ కులాలకు చెందిన వారే! హిందూ అగ్ర కులాల వారి వల్ల ఆ నాడు ఆ కులాల వారు ఎన్నో అవమానాలకు గురయ్యారు. ఈ నలుగురూ అనేక ప్రతికూలతలు, సవాళ్ల మధ్య ఉద్యమించారు. వీరెవరూ అధికారం కోసం అర్రులు చాచలేదు. వీరందరూ గొప్ప ఉద్యమకారులు, మేథావులు.
 
హరిచంద్ర ఠాకూర్, ఠాకూర్ పంచానన బర్మ వీరిది ఒక మార్గం:
” మీ హిందువులలో మీకు సమాన గౌరవ స్థానం లేదు.మిమ్మల్ని మీ సవర్ణ హిందువులే సమానంగా చూడరు. మమ్మలని మాత్రం ఇంట్లోకి రానిస్తారు, గౌరవిస్తారు. కనుక మీరు ముస్లింలు కండి” అని ముస్లింలు నవ శూద్రులను మభ్యపెడుతున్న కాలం అది.” హరి బోల్ ” మంత్రం ద్వారా,ధార్మిక, సామాజిక కార్యక్రమాల ద్వారా, మదువా ధర్మ ఉద్యమం ద్వారా నవ శూద్రుల సమానత్వం కోసం హరిచంద్ర ఠాకూర్ కృషి చేశారు. 
 
వీరిని శ్రీ కృష్ణుని అవతారంగా అనుయాయులు కొలుస్తారు. వీరు అందరికీ గౌరవనీయులు. వీరి మార్గాన్ని వీరు కుమారుడు గురుచంద్ ఠాకూర్ (13 మార్చ్ 1846 – 27 సెప్టెంబర్ 1937) విద్యారంగంలో సశక్తీకరణను జోడించి ముందుకు తీసుకు వెళ్లారు. నవ శూద్రుల కొరకు అనేక పాఠశాలలను వీరు ప్రారంభించారు.
హరిచంద్ గొప్ప ఆధ్యాత్మిక గురువు. వీరిద్దరి ప్రయత్నాల వల్ల నవ శూద్రులు హిందువులుగా నేడు కొన సాగుతున్నారు. చైతన్య మహా ప్రభు అనుచరులలో నేడు ఎక్కువమంది నవశూద్రులే! బంగ్లాదేశ్ లో ముస్లింల అత్యాచారాలకు తట్టుకోలేక ఎక్కువమంది నేటి పశ్చిమ బెంగాల్ కు హిందువులుగా వచ్చి చేరారు.
 
“నేడు మేము ఎస్సీలమే! మా పూర్వీకులు క్షత్రియులు. కొన్ని కారణాల వల్ల మేము వైదిక సంస్కృతికి దూరం అయ్యాము. మమ్మల్ని క్షత్రియులుగా గుర్తించండి” అని ఉద్యమించారు ఠాకూర్ పంచానన బర్మ. 
 
ఆ కులంలో వారు మొదటి న్యాయవాది. వారి ఉద్యమాన్ని కొంతమంది హిందువులు వ్యతిరేకించినా, సమర్థించిన హిందువులూ ఉన్నారు. చివరకు వారి వాదనను ఆంగ్లేయ ప్రభుత్వం అంగీకరించింది. ఈ వర్గాల ప్రజల ఆర్థిక అభివృద్ధి కొరకు ఆయన బ్యాంకులను ప్రారంభించారు. 
 
అత్యాచారాలకు గురవుతున్న మహిళలకు పంచానన బర్మ అండగా నిలిచారు. “ఆత్మరక్షణకు ఆయుధాలు పట్టండి” అని పిలుపునిచ్చారు. మహిళా పాఠశాలలు ప్రారంభించారు. వీరు గొప్ప రచయిత,కవి. వీరి అనేక ప్రయత్నాల వల్ల రాజ వంశీ కులస్థులు నేడు అన్ని రంగాల్లో ముందుకు వెడుతున్నారు.
 
సమాజంలో వీరికి గౌరవం లభించింది. వీరి జన్మ దినం రోజున ఈ కులస్థుల సామూహిక ఉపనయన సంస్కారం జరుగుతుంది. వీరు నేడు హిందువులుగా నిలబడ్డారు.
రెండవ మార్గాన్ని అవలంబించిన వారు జోగేంద్రనాథ్ మండల్ డా.బాబా సాహెబ్ అంబేద్కర్ సహచరునిగా, అనుయాయిగా ఎస్సీల సామాజిక, రాజకీయ ఉన్నతి కోసం ఎన్నో ఉద్యమాలు చేశారు జోగేంద్రనాథ్. డా.బాబా సాహెబ్ అంబేద్కర్ ను బెంగాల్ నుండి రాజ్యాంగ సభ సభ్యునిగా గెలిపించారు.
 
డా.బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచనలకు పూర్తి వ్యతిరేకంగా, ” మన ఎస్సీలకు సవర్ణ హిందువుల నుండి సమత, రక్షణ లభించవు. ముస్లింల నుండి మాత్రమే లభిస్తాయి” అనే సూత్రాన్ని నమ్మి ముస్లిం లీగ్ తో స్నేహం చేసి, నూతనంగా ఏర్పడిన పాకిస్థాన్ కు వెళ్ళిపోయారు. నవ పాకిస్థాన్ న్యాయశాఖా మంత్రి కూడా అయ్యారు. 
 
పాకిస్థాన్ లో ముస్లింలచే హిందువులపై, ఎస్సిలపై జరుగుతున్న అత్యాచారాలను ప్రత్యక్షంగా చూశారు. ఆపడం సాధ్యం కాదని అర్థమైంది. తన నమ్మకాలు పగటి కలలని అర్థమైంది. తన ప్రాణాలకే రక్షణ లేని పరిస్థితుల్లో ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని భారత్ కు పారిపోయి వచ్చారు. వారికి ప్రభుత్వం ద్వారా, ప్రజల ద్వారా ఏ విధమైన గుర్తింపు, గౌరవం లభించలేదు. అజ్ఞాతంగా తనువు చాలించారు.
 
చారు మజుందార్ మార్గం భిన్నమైనది.  చారు మజుందార్ మేథావి, ఉద్యమకారుడు. చిన్న నాటనే స్వాతంత్ర్య ఉద్యమంలో పాల్గొన్నారు. కమ్యూనిస్టు పార్టీలో చేరారు. అంచెలంచెలుగా పార్టీలో ఎదిగారు. మొదట సిపిఐ, తరువాత సిపిఎంలో పనిచేశారు.1967 నక్సల్బరీ ఉద్యమంలో కాసు సన్యాల్ తో కలిసి సాయుధ మార్క్సిస్టు ఉద్యమానికి సిపిఐఎంఎల్ కు మూలస్తంభం అయ్యారు.
 
వీరు, కాసు సన్యాల్, మరొకరు కలసి1967లో చైనా వెళ్లి మావోను కలసి సాయుధ పోరాటానికి తర్ఫీదు పొందారు. చివరలో మావో వీరితో,” మీరు ఇక్కడ పొందిన తర్ఫీదు అంశాలు మరచిపొండి. మీ దేశ పరిస్థితులకు అనుగుణంగా ఉద్యమించండి. ఉద్యమాన్ని ముందుకు తీసుకు వెళ్ళండి” అని సూచించారు.
 
“సాయుధ పోరాటం ద్వారా అధికారం, తద్వారా ఆర్థిక సమత, సామాజిక సమత రెండూ సహజంగా లభిస్తాయి.” అన్నది మార్క్సిస్టు మౌలిక ఆలోచన. 
“కమ్యూనిస్టు నాయకత్వం మార్క్సిస్టు ఆలోచనలను భారతీయ పరిస్థితులకు సరిగ్గా సమన్వయం చేయని కారణంగానే మేము విఫలం చెందాము. సాయుధ ఉద్యమంలో క్రింది స్థాయి ఉద్యమకారులు ఎస్సీలు, ఎస్టీలు, ఇతర బలహీన వర్గాలు కాగా, నాయకత్వం మాత్రం అగ్ర కులాల చేతిలో ఉన్నదని” ఆంధ్ర ప్రదేశ్ లో నక్సల్ ఉద్యమ మూల స్తంభం లో ఒకరైన  సత్యమూర్తి విశ్లేషించారు.
 
కాసు సన్యాల్, ” చారు మజుందార్ వర్గ శత్రు నిర్మూలన” సిద్ధాంతంతో విభేదించారు. నక్సల్బరీ ఉద్యమం అణచివేయ బడింది. చారు మజుందార్ పోలీసు కస్టడీలో మరణించారు. తర్వాత కాసు సవ్యాల్ ఆత్మహత్య చేసుకున్నారు. ఇప్పటికీ కొన్ని రాష్ట్రాలలో సాయుధ పోరాటం కొనసాగుతోంది. అనేకమంది సామాన్యులు, పోలీసులు, రక్షణ దళాల వారు, సాయుధ ఉద్యమకారులు మరణిస్తున్నారు. కనుచూపు మేరకు సాయుధ పోరాటపు విజయం కనపడటం లేదు.
 
 హరిచంద్ ఠాకూర్, ఠాకూర్ పంచానన బర్మ విజయం పొందడానికి బెంగాల్ లో సామాజిక సమత కోసం కృషి చేసిన శ్రీ చైతన్య మహా ప్రభు, రాజా రామోహన్ రాయ్, ఈశ్వర చంద్ర విద్యాసాగర్, స్వామి ప్రణవానంద, స్వామి వివేకానందలు చేసిన కార్యకలాపాలు కూడా ఒక ప్రధాన కారణం.
 
ఈ విషయాలను తెలుసుకున్న తర్వాత హిందూ సమాజంలో సామాజిక సమత సాధన కోసం, నిమ్న కులాల ఉన్నతి కోసం మనం ఏ మార్గంలో నడుద్దామన్న విషయాన్ని మనమే నిర్ణయించుకోవచ్చు కదా?