ఆర్థిక సంక్షోభంతో ఎంబసీని అమ్మకానికి పెట్టిన పాక్

పాకిస్తాన్ తీవ్రమైన ఆర్థిక సంక్షోభం ఎదుర్కొంటున్నది. ద్రవ్యోల్భణం ఎన్నడూ లేనంత గరిష్టంగా 42 శాతంకు చేరుకోగా, విదేశీ మారక 6.7 బిలియన్ డాలర్లకు పడిపోయాయి. అవి కేవలం ఒక నెల రోజుల పాటు దిగుమతులకు మాత్రమే సరిపోతాయి. పాకిస్తాన్ కరెన్సీ ఎంత అధ్వానంగా ఉన్నదంటే  ఇప్పుడు ఒక డాలర్ కు 224.63 పాకిస్థాన్ రూపాయిలు మారక విలువగా ఉన్నాయి.

ఎగుమతులు తగ్గిపోతుండగా, దిగుమతులకు అవసరమైన డాలర్లు లేక ఇబ్బందులు పడుతున్నది. చివరకు మిత్రదేశాలైన ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్ ల నుండి కూడా చెల్లించడానికి డాలర్లు లేకపోవడంతో దిగుమతులు తగ్గిపోతున్నాయి. ఈ సంక్షోభం నుండి గట్టెక్కి,  దైనందిన కార్యకలాపాల నిర్వహణలకు వీలు కల్పించుకునేందుకు పాకిస్థాన్ ప్రభుత్వం నానా మార్గాలు ఎంచుకొంటోంది.

ఇందులో భాగంగా ఇప్పుడు పాకిస్థాన్ అమెరికాలోని తమ ఎంబస్సీ ఆస్తులను అమ్మేసుకుంది. 2000 ప్రాంతంలో వాషింగ్టన్‌లో పాక్ రాయబార కార్యాలయం విలాసవంతంగా నిర్మించారు. భారత రాయబార కార్యాలయంకు అతి దగ్గరిలోనే మసాఛూసెట్స్ అవెన్యూలో ఇంతకు ముందటి రాయబార కార్యాలయం ఉంది. దీని తర్వాత కొత్త భవనం వెలిసింది.

అంతర్జాతీయ సంస్థల నుంచి భారీ సాయం పొందేందుకు పాకిస్తాన్ పలు విధాలుగా యత్నిస్తూ ఉన్నా, ఉగ్రవాద ముద్రలతో అడ్డంకులు ఏర్పడుతున్నాయి. ఈ క్రమంలో పలు దేశాలలోని తమ దేశ ఆస్తులను విక్రయించేందుకు ఇప్పుడు షెహబాజ్ ప్రభుత్వం యత్నిస్తోంది.

ఇప్పటికే గ్రీసు తమ ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దుకునేందుకు తమ దీవులను విక్రయించింది. పాకిస్థాన్‌కు దీవులు లేకపోవడంతో ఇప్పుడు దౌత్యకార్యాలయాలను విక్రయించేందుకు రంగం సిద్ధం చేసుకుంది. ఇప్పుడు వాషింగ్టన్‌లోని ఆర్ స్ట్రీట్ ఎన్‌డబ్లులో ఉన్న బిల్డింగ్ సంబంధిత ఆస్తులను విక్రయిస్తున్నట్లు  వెల్లడైంది.

అందుకనే గత 15 ఏళ్లుగా ఖాళీగా ఉంటున్న పాత భవనాన్ని అమ్మేయడానికి విదేశాంగ మంత్రిత్వ శాఖ నుండి అమెరికాలోని పాకిస్తాన్ రాయబార కార్యాలయంకు అనుమతి లభించింది. 5 నుండి 6 మిలియన్ డాలర్లు దీని అమ్మకం ద్వారా లభించగలవని అంచనా వేస్తున్నారు.

దిగుమతులు తగ్గిపోవడంతో ముడి పదార్ధాల కొరత ఏర్పడి దేశంలోని ఔషధ పరిశ్రమ కుదేలు పడడంతో ప్రజలు తీవ్రమైన మందుల కొరతను ఎదుర్కొంటున్నారు. ఔషధాల తయారీకి 17 శాతం ముడి పదార్ధాలను పాకిస్తాన్ దిగుమతి చేసుకొంటున్నది. వాటి దిగుమతులకు లెటర్ అఫ్ క్రెడిట్ ఇవ్వడానికి బ్యాంకులు నిరాకరిస్తూ ఉండడంతో వాటి ఉత్పత్తి ఆగిపోయింది.

గత సెప్టెంబర్ లో పాకిస్థాన్ తీవ్రమైన వరదలతో అంటువ్యాధులు, ముఖ్యంగా డెంగ్యూ వ్యాపించినప్పుడు జ్వరం, నొప్పులు వంటి సాధారణ రుగ్మతలకు కూడా మందులు దొరకక ప్రజలు నరకం అనుభవించారు. మధుమేహంకు అవసరమైన మందులు, విటమిన్ సి బిళ్ళలు కూడా కొరత ఏర్పడింది.

ఈ వరదల కారణంగా 30 బిలియన్ డాలర్ల నష్టాన్ని ఆ దేశం ఎదుర్కొంది. విదేశీ మారకద్రవ్య నిల్వలు పడిపోవడంతో ముడి పదార్ధాల దిగుమతులు ఆగి పోతుండడంతో అనేక పరిశ్రమలు ఖాయిలా దిశగా వెడుతున్నాయి.

చాలాకాలంగా ఈ సంక్షోభం నుండి బయట పడటానికి సహకరించమని పాకిస్థాన్ ప్రభుత్వం అంతర్జాతీయ ద్రవ్య సంస్థను వేడుకొంటున్నది. కొత్తగా అధికారంలోకి వచ్చిన షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వానికి ఊపిరి పీల్చుకొనేందుకు అవకాశం కల్పిస్తూ ఐఎంఎఫ్ 8 బిలియన్ డాలర్ల బెయిల్ అవుట్ ప్యాకేజీ మంజూరు చేసింది.

అయితే ఆర్ధిక వ్యవహారాల నిర్వహణ లోపభూయిష్టంగా ఉండడంతో పాటు రాజకీయ అస్థిరత్వం సంక్షోభాన్ని మరింత తీవ్రతరం చేస్తుంది. ఇప్పుడు పాకిస్థాన్ ప్రభుత్వం సౌదీ అరేబియా నుండి ఆర్ధిక సహాయం  కోసం ఎదురు చూస్తున్నది. విదేశీ మారకద్రవ్యాన్ని సమకూర్చడంతో పాటు ముఖ్యంగా చమురు దిగుమతులపై చెల్లింపులను వాయిదా వేయమని కోరుతున్నది.