మోదీపై భుట్టో అనుచిత వ్యాఖ్యలతో భగ్గుమన్న భారత్

ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో బుధవారం కశ్మీర్ అంశాన్ని పాకిస్థాన్ లేవనెత్తడంతో ఇరు దేశాల మధ్య మరోసారి మాటల యుద్ధం మొదలైంది. భద్రతా మండలిలో పాక్ చర్యలను భారత విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ తూర్పారబట్టారు. బిన్ లాడెన్‌కు ఆతిథ్యం ఇచ్చినవాళ్లు, పొరుగు పార్లమెంట్‌పై దాడిచేసిన దేశం నీతులు చెబుతోందని ఏకిపారేశారు. 

దీంతో పాక్ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో జర్దారీ అసహనంతో  ప్రధాని మోదీపై వ్యక్తిగత విమర్శలకు దిగారు. భారత్ ప్రధాని మోదీని `గుజరాత్ కసాయి’ అంటూ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. ‘‘ఒసామా బిన్ లాడెన్ చనిపోయాడు.. కానీ గుజరాత్ కసాయి బతికే ఉన్నాడని భారత్‌కు చెప్పాలనుకుంటున్నాను అదే భారత ప్రధాని నరేంద్ర మోదీ.. అప్పట్లో మోదీకి అమెరికా వీసా నిరాకరించింది.. ప్రధాని అయిన తర్వాతే వీసా వచ్చింది.. ఆయన ఆర్ఎస్ఎస్‌కు ప్రధానమంత్రి’’ అని విమర్శించారు.

‘‘ఈ వ్యాఖ్యలు పాకిస్థాన్ మరింత దిగజారిగిపోయిందనడానికి నిదర్శనం.. పాక్ విదేశాంగ మంత్రి 1971లో ఈ రోజుని స్పష్టంగా మర్చిపోయారు.. ఇది పాక్ పాలకులు బెంగాలీలు, హిందువులపై చేసిన మారణహోమం ప్రత్యక్ష ఫలితం. దురదృష్టవశాత్తు, తన దేశంలోని మైనారిటీల పట్ల వ్యవహరించే విషయంలో పాక్ పెద్దగా మారినట్లు కనిపించడం లేదు. భారత్‌పై దుష్ప్రచారం చేయడానికి దానికి అర్హత లేదు’’ అని భారత్ మండిపడింది.

పాకిస్థాన్ విదేశాంగ మంత్రి పిచ్చి ప్రేలాపన ఆ దేశంలో పెరుగుతున్న ఉగ్రవాదులు, వారి సానుభూతిపరులను నియంత్రించలేని అసమర్థతకు నిదర్శనంగా కనిపిస్తోందని భారత్ దుయ్యబట్టింది. ‘‘న్యూయార్క్, ముంబయి, పుల్వామా, పఠాన్‌కోట్, లండన్‌ వంటి నగరాల్లో హింసాత్మక దాడుల వెనుక పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాదం ఉంది.. ఈ హింస వారి ప్రత్యేక టెర్రరిస్ట్ జోన్ల నుంచి ఉద్భవించింది.. ప్రపంచంలోని అన్ని ప్రాంతాలకు ఎగుమతి అవుతోంది.. ముందు ‘మేక్ ఇన్ పాకిస్థాన్’ ఉగ్రవాదాన్ని అరికట్టాలి’’ అని భారత్ చురకలంటించింది.

‘అంతర్జాతీయ ఉగ్రవాది ఒసామా బిన్ లాడెన్‌ను పాకిస్థాన్ అమరవీరుడిగా కీర్తిస్తోంది.. లఖ్వీ, హఫీజ్ సయీద్, మసూద్ అజార్, సాజిద్ మిర్, దావూద్ ఇబ్రహీం వంటి ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించింది. ఐరాస గుర్తించిన 127 మంది అంతర్జాతీయ ఉగ్రవాదులు, 27 ఉగ్రవాద సంస్థలు ఉన్నాయని ఏ దేశమూ గొప్పలు చెప్పుకోదు’ అని భారత్ కడిగిపారేసింది.

‘‘పాక్ ఉగ్రవాది అజ్మల్ కసబ్ బుల్లెట్ల నుంచి 20 మంది గర్భిణీల ప్రాణాలను కాపాడిన ముంబయి నర్సు అంజలి కుల్తే చెప్పిన విషయాలు గురించి పాక్ విదేశాంగ మంత్రి నిన్న ఐరాస భద్రతా మండలిలో మరింత నిజాయితీగా విని ఉండాల్సిందని కోరుకుంటున్నాం… స్పష్టంగా పాకిస్థాన్ పాత్రను తేటతెల్లం చేయడానికి విదేశాంగ మంత్రి ఎక్కువ ఆసక్తి చూపారు. పాకిస్థాన్ విదేశాంగ మంత్రి నిరాశ తన దేశంలోని తీవ్రవాద సంస్థల సూత్రధారుల వైపు మళ్లింది. ఉగ్రవాదాన్ని తమ దేశ విధానంలో భాగంగా మార్చుకున్నారు.. పాక్ ఈ విషయంలో తన ఆలోచనా విధానాన్ని మార్చుకోవాలి’’ అని హితవు పలికింది.

ఉగ్రవాదానికి పాక్‌ కేంద్ర బిందువుగా నిలుస్తున్నదని ఐక్యరాజ్యసమితి వేదికగా భారత విదేశాంగ మంత్రి జైశంకర్‌ విమర్శలు గుప్పించిన నేపథ్యంలో ప్రధాని మోదీ లక్ష్యంగా భుట్టో వ్యక్తిగత దూషణకు దిగారు. ‘బిన్‌లాడెన్‌ చనిపోయాడు. కానీ గుజరాత్‌ కసాయి బతికే ఉన్నాడు. అతడే భారత ప్రధాని మోదీ’ అని వ్యాఖ్యానించారు. భారత్‌పై దుష్ప్రచారం చేసే అర్హత పాకిస్థాన్‌కు లేదని, ముందు ‘మేకిన్ పాకిస్తాన్ టెర్రరిజాన్ని’ ఆపాలని భారత్ హితవు పలికింది. 

ఢిల్లీలో పాక్‌ ఎంబసీ వద్ద బీజేపీ నిరసన

ఢిల్లీ నగరంలోని పాకిస్థాన్ హైకమిషనర్ కార్యాలయం ఎదుట బీజేపీ నేతలు నిరసన చేపట్టారు.  ప్రధాని నరేంద్ర మోడీపై పాక్ విదేశాంగశాఖ మంత్రి బిలావల్ భుట్టో జర్దారీ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా వ్యతిరేకిస్తూ బీజేపీ నేతలు నిరసనకు దిగారు. పాక్ కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ.. పాకిస్థాన్ హైకమిషనర్ కార్యాలయంలోకి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో ఆందోళనకారులను పోలీసులు అడ్డుకున్నారు.

పాక్‌ మంత్రి వాడిన భాష దివాలా తీసిన దేశానికి ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నట్టు చెబుతోందని కేంద్ర మంత్రి మీనాక్షి లేఖి మండిపడ్డారు. ఆయనే మానసిక దివాలా కోరని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘విఫల దేశానికి బిలావల్‌ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వ్యక్తిగతంగా ఆయన విఫలమయ్యారు. పాక్‌ కూడా విఫలమైంది. ఉగ్రవాద మనస్తత్వంతో ఉన్న వారి నుంచి ఇంత కంటే ఏం ఆశించగలం’’ అని లేఖి ధ్వజమెత్తారు. కాగా, బిలావల్‌ వ్యాఖ్యలకు నిరసనగా శనివారం దేశవ్యాప్త ఆందోళనలకు బీజేపీ పిలుపునిచ్చింది.