నీరవ్ మోదీకి బ్రిటన్ కోర్టులో చుక్కెదురు

మనీ లాండరింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ భారత్ నుంచి పరారైన వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీకి బ్రిటన్ కోర్టులో చుక్కెదురైంది. తనను భారత్‌కు అప్పగించడాన్ని వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టులో అప్పీల్ చేసుకునేందుకు లండన్ హైకోర్టు నిరాకరించింది.
గుజరాత్‌కు చెందిన 51 ఏళ్ల నీరవ్ మోదీ రూ. 11 వేల కోట్ల పంజాబ్ నేషనల్ బ్యాంక్ కుంభకోణం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఆ వివరాలు బయటపడడానికి ముందే 2018లో ఆయన భారత్ నుంచి పరారయ్యారు. తనను కనుక భారత్‌కు అప్పగిస్తే ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనలు వస్తాయని ఆయన వాదించారు.
అయితే, ఆయన వాదనను కోర్టు కొట్టివేసింది. నీరవ్ మానసిక పరిస్థితి, ఆయన ఆత్మహత్యకు పాల్పడే ప్రమాదం ఉందన్న కారణంతో ఆయనను భారత్‌కు అప్పగించడం అన్యాయంగా, లేదంటే అణచివేతకు గురిచేస్తుందన్న విషయంతో తాము ఏకీభవించలేమని ఈ సందర్భంగా కోర్టు వ్యాఖ్యానించింది.
చట్టపరమైన ఖర్చుల కింద దాదాపు రూ. 1.5 కోట్లు చెల్లించాలని నీరవ్‌ను ఆదేశించింది.లండన్ హైకోర్టు తీర్పుతో నీరవ్ మోదీకి ఉన్న అన్ని దారులు మూసుకు పోయినట్టే. ఇప్పుడిక ఆయన భారత్‌కు వచ్చి విచారణ ఎదుర్కోక తప్పని పరిస్థితి ఎదురైంది. గత నెలలోనూ ఆయన అభ్యర్థనను హైకోర్టు కొట్టివేసింది.
మరోవైపు భారత్‌ అభ్యర్థన మేరకు బ్రిటన్‌ క్రౌన్ ప్రాసిక్యూషన్ సర్వీస్ (సీపీఎస్‌) కూడా వేగంగా స్పందించింది. నీరవ్‌ మోదీ అప్పీల్‌కు వ్యతిరేకంగా వారంలోనే ప్రతిస్పందనను సమర్పించడంతో ఆయన దరఖాస్తును లండన్‌ కోర్టు తిరస్కరించింది. దీంతో నీరవ్‌ మోదీని భారత్‌కు బ్రిటన్‌ అప్పగించే అవకాశాలు మెరుగయ్యాయి.
అయితే చివరి ప్రయత్నంగా  ఇప్పుడు ఆయనకు ఉన్న ఏకైక మార్గం యూరోపియన్ కోర్ట్ ఆఫ్ హ్యూమన్ రైట్స్‌ను ఆశ్రయించడమే. 2019 మార్చిలో అరెస్ట్ అయిన నీరవ్ మోదీ ప్రస్తుతం లండన్ జైలులో ఉన్నారు. కాగా, అంటిగ్వా అండ్ బార్బుడా పౌరసత్వం తీసుకున్న నీరవ్ మోదీ మేనమామ మెహుల్ చోక్సీ  కూడా ఇదే కేసులో నిందితుడిగా ఉన్నారు.