జడ్జీల నియామకంలో సర్కారు పాత్ర ఉండాల్సిందే

ఉన్నత న్యాయస్థానాల్లో న్యాయమూర్తుల నియామక ప్రక్రియ మారనంత వరకూ జడ్జీల ఖాళీల సమస్య పెరుగుతూనే ఉంటుందని  కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరణ్‌ రిజిజు స్పష్టం చేశారు. ప్రస్తుతం న్యాయమూర్తుల నియామక విధానంలో ప్రభుత్వానిది పరిమిత పాత్రే అని పేర్కొంటూ జడ్జీల పేర్లను కొలీజియం సిఫారసు చేస్తున్నది. న్యాయమూర్తులను నియమించే అధికారం ప్రభుత్వానిదేనని రాజ్యాంగం సెలవిస్తున్నదని ఆయన గుర్తు చేశారు. 

ఉన్నత న్యాయస్థానాల్లో న్యాయమూర్తుల నియామకానికి అనుసరిస్తున్న సుప్రీంకోర్టు కొలీజియం వ్యవస్థపై కొంతకాలంగా చెలరేగుతున్న విమర్శలను దృష్టిలో ఉంచుకొని పార్లమెంట్ వేదికగా ఆయన ప్రభుత్వం అభిప్రాయాన్ని స్పష్టంగా ప్రకటించారు.  దేశంలో ఐదు కోట్ల కేసులు పెండింగ్‌లో ఉండటానికి కొలీజియం వ్యవస్థనే కారణమని విమర్శించారు.

గురువారం రాజ్యసభలో ఓ ప్రశ్నకు సమాధానమిచ్చిన ఆయన సుప్రీంకోర్టు, హైకోర్టుల్లో న్యాయమూర్తుల నియామకంలో కేంద్ర ప్రభుత్వ పాత్ర తప్పనిసరిగా ఉండాల్సిందేనని తేల్చి చెప్పారు. బీజేపీ ప్రభుత్వం 2014లో తెచ్చిన నేషనల్‌ జ్యుడీషియల్‌ అపాయింట్‌మెంట్స్‌ కమిషన్‌ (ఎన్‌జేఏసీ) మళ్లీ మనుగడలోకి వస్తేనే కోర్టుల్లో నాణ్యమైన న్యాయమూర్తుల నియామకం సాధ్యమవుతుందని కిరణ్‌ రిజిజు పేర్కొన్నారు.

‘న్యాయస్థానాల్లో పెండింగ్‌ కేసులను తగ్గించేందుకు ప్రభుత్వం అనేక చర్యలు తీసుకొన్నది. కానీ, న్యాయమూర్తుల నియామకంలో ప్రభుత్వం పాత్ర చాలా పరిమితంగా ఉన్నది. న్యాయమూర్తుల పేర్లను కొలీజియం సూచిస్తున్నది. దీంతో ఉన్నత న్యాయస్థానాల్లో జడ్జీల నియామకం విషయంలో ప్రభుత్వానికి ఎలాంటి అధికారం లేకుండా పోయింది’ అని మంత్రి విచారం వ్యక్తం చేశారు.

దేశంలోని భిన్నత్వాన్ని ప్రతిబింబించేలా, మహిళలకు ప్రాధాన్యం దక్కేలా న్యాయమూర్తుల పేర్లు సూచించాలని సుప్రీంకోర్టు, హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులను ప్రభుత్వం కోరిందని ఆయన గుర్తు చేశారు. కానీ, ప్రస్తుతం ఉన్న నియామక విధానం పార్లమెంటు, దేశ ప్రజల మనోభావాలను ప్రతిబింబించటం లేదని,  అందుకే కొలీజియం సూచించే పేర్లను ప్రభుత్వం ఆమోదించలేకపోతున్నదని స్పష్టం చేశారు.

`న్యాయ వ్యవస్థలో ప్రభుత్వం జోక్యం ఉండాలని నేను కోరుకోవటం లేదు. కానీ, న్యాయమూర్తుల నియామకంలో ప్రభుత్వం భాగస్వామ్యం ఉండటం అనేది రాజ్యాంగ స్ఫూర్తికి చిహ్నం. ఆ విధానం 1993 తర్వాతే మారింది’ అని కిరణ్‌ రిజిజు పేర్కొన్నారు. కేసుల పెండింగ్‌ కాలాన్ని తగ్గించాలంటే సుప్రీంకోర్టు బెయిల్‌ పిటిషన్లను స్వీకరించకుండా ఉండాలని మంత్రి కిరణ్‌ రిజిజు సూచించారు.

ప్రస్తుతం హైకోర్టులలో 1,108 న్యాయమూర్తులు ఉండవలసి ఉండగా, 777 మంది ఉన్నారని, అంటే 331 (30 శాతం) ఖాళీలు ఉన్నాయని మంత్రి తెలిపారు. అదే విధంగా, సుప్రీం కోర్టులో 34 మంది న్యాయమూర్తులకు గాను 27 మంది పనిచేస్తున్నారని, ఏడు ఖాళీలు ఉన్నాయని వివరించారు.  ప్రభుత్వం తిరిగి నేషనల్‌ జ్యుడీషియల్‌ అపాయింట్‌మెంట్స్‌ కమిషన్‌ (ఎన్‌జేఏసీ)ని అమలులోకి తీసుకు రావాలనుకొంటుందా అని ప్రశ్నించగా ఐదుగురు సభ్యుల సుప్రీంకోర్టు బెంచ్ ఆ చట్టాన్ని కొట్టివేయడం సరికాదని పలువురు రిటైర్డ్ న్యాయమూర్తులు, ప్రముఖ న్యాయనిపుణులు, న్యాయవాదులు, రాజకీయ నాయకులు భావిస్తున్నారని కేంద్ర మంత్రి గుర్తు చేశారు.