బీహార్‌లో రాష్ట్రపతి పాలన విధించాలని బిజెపి డిమాండ్

బీహార్ లో కల్తీ మద్యం మృతుల సంఖ్య గంటగంటకూ పెరుగుతుండటంతో ప్రతిపక్ష బీజేపీ మహాఘట్‌బంధన్ సర్కారుపై ఒత్తిడి పెంచింది. శుక్రవారం గవర్నర్‌ను కలవాలని బీజేపీ ఎమ్మెల్యేలు నిర్ణయించారు. బీహార్‌లో రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్ చేశారు.

బీహార్‌లో కల్తీసారా సేవనంతో ఇప్పుడు మృతుల సంఖ్య 39 దాటింది. ఈ దారుణంపై రాష్ట్ర ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ అసహనంగా వ్యవహరిస్తుండటం మరిన్ని వివాదాలకు దారి తీస్తుంది. ‘ఫుల్లుగా ఈ విధంగా సారా తాగితే చావకుండా ఉంటారా? చస్తారు’ అని గురువారం పేర్కొనడం గమనార్హం. 

ఆరేళ్లుగా మద్యనిషేధం అమల్లో ఉన్న బిహార్‌లో జరిగిన ఈ ఘటన తీవ్ర రాజకీయ దుమారం రేపుతోంది. సీఎం నితీశ్‌ బహిరంగ క్షమాపణ చెప్పాలంటూ విపక్షాలు జరుపుతున్న ఆందోళనలతో అసెంబ్లీ లోపల, బయటా తీవ్ర ప్రకంపనలు రేగాయి.  ఘటనపై ప్రతిపక్షాల ఆందోళనలతో బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ఉక్కిరిబిక్కిరౌతున్నారు. 

నితీశ్‌ రాజీనామా చేయాలంటూ బీజేపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీ లోపల ప్లకార్డులు ప్రదర్శించారు. దీంతో సభ స్తంభించిపోయింది. ఒకదశలో నితీశ్‌ సహనం కోల్పోయారు. ‘తాగొచ్చి సభలో అల్లరి చేస్తున్నారా?’ అంటూ బీజేపీ సభ్యులపై ఆయన మండిపడ్డారు. 

కాగా, పోలీసులు, కల్తీ మద్యం వ్యాపారుల మధ్య లాలూచీ ఫలితంగానే తరచూ జనం చనిపోతున్నారని బీజేపీ నేతలు ఆరోపించారు. మద్య నిషేధం అమలులో ఉండటంతో పేదలు ఎక్కువగా మురికివాడల వారు కల్తీసారాకు, నాటు సారాకు అలవాటుపడుతున్నారు. కొన్ని ముఠాలు విచ్చలవిడిగా జనాల బలహీనతలను ఆసరాగా చేసుకుని కల్తీ మద్యం విక్రయాలు సాగిస్తున్నాయి.

‘మేం ప్రతిపక్షంలో ఉన్నా మంచి జరిగినప్పుడు స్వాగతిస్తాం. రాష్ట్రంలో 2016లో మధ్య నిషేధం విధించినప్పుడు మేం విపక్షంలో ఉండి కూడా మద్దతు ఇచ్చాం. కానీ, నిషేధం అమలులో ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది’’ అని మాజీ ఉపముఖ్యమంత్రి తార్‌కిశోర్‌ ఆరోపించారు.

రాష్ట్రంలోని సరాన్ జిల్లాలో దాదాపు 40 మంది వరకూ కల్తీ సారా తాగినట్లు నిర్థారణ అయింది. దీనిపై సిఎం స్పందిస్తూ ఆల్కహాల్ తాగితే చస్తారు, మన ముందే ఇప్పుడు ఈ చావు ఘటనలు సజీవ ఉదాహరణలుగా ఉన్నాయని వ్యాఖ్యానించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ లిక్కర్ నిషేధం ఖచ్చితంగా అమలు చేయాల్సి ఉందని, దయచేసి ప్రజలు సారా మద్యం జోలికి వెళ్లరాదని తాను విజ్ఞప్తి చేస్తున్నానని ముఖ్యమంత్రి తెలిపారు. 

రాష్ట్రంలో ఏ ప్రాంతంలో అయినా కల్తీసారా తయారీకి దిగుతున్న వారిని గుర్తించి పట్టుకోవాలని, సారా వ్యాపారాలను నిర్వహించే వారిపనిపట్టాలని గురువారం నితీశ్ అధికారులను ఆదేశించారు. సారా సేవించడం ఆరోగ్యానికి చేటు కల్గిస్తుందని, దీనిని మానుకోవాలని సిఎం ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

ఇలా ఉండగా, సరన్ జిల్లాలో కల్తీ మద్యం సేవించడం వల్ల ఛప్రా హూచ్ దుర్ఘటనలో మరణించిన వారి సంఖ్య శుక్రవారంకు 50కి చేరుకుంది. ఛప్రాలోని హూచ్ విషాదం నేపథ్యంలో, మర్హౌరా సబ్-డివిజనల్ పోలీస్ ఆఫీసర్ యోగేంద్ర కుమార్ సిఫార్సు మేరకు స్టేషన్ హౌస్ ఆఫీసర్  రితేష్ మిశ్రా, కానిస్టేబుల్ వికేష్ తివారీలను గురువారం సస్పెండ్ చేశారు.